నేల రాలని చినుకు..
– ముదిరిన ఎండలు, పెరిగిన చలి, పత్తాలేని వరుణుడు
– పప్పుశనగ, ఇతర రబీ పంటలు సాగు ప్రశ్నార్థకం
– క్షీణిస్తున్న భూగర్భజలాలు, పట్టు, పండ్లతోటలకూ నష్టం
నైరుతీ నైరాశ్యం మాదిరిగానే ఈశాన్య రుతుపవనాలు కూడా జిల్లా రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు. కనీవిని ఎరుగని రీతిలో ఆగస్టులో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు 7.60 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలను అతలాకుతలం చేయగా... ఇపుడు అక్టోబర్‌లో నెలకొన్న అనావష్టి 1.50 లక్షల హెక్టార్ల రబీ ఆశలను తుంచేసే పరిస్థితి నెలకొంది. వాన చినుకు కరువైపోవడంతో ‘అనంత’ వ్యవసాయం పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మెట్ట వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న లక్షలాది ‘అనంత’ రైతుల బతుకులు దుర్భరంగా మారాయి.
ప్రశ్నార్థకంగా పప్పుశనగ
ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో రబీ ప్రధాన పంట పప్పుశనగ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్ మాదిరిగానే అక్టోబర్‌లో కూడా వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండటంతో వరుణుడి జాడ కరువైపోంది. ఎక్కడా పంట సాగుకు అనువుగా వర్షం పడలేదు. ఈ నెలలో 110.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 7.1 మి.మీ నమోదైంది. నల్లరేగడి భూములు కలిగిన 35 మండలాల్లో 80 నుంచి 90 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పప్పుశనగ సాగు చేయాల్సివుంది. అందులోనూ 10 మండలాల్లో 8 నుంచి 10 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంట వేస్తున్నారు. అయితే ఈ నెల 11న కురిసిన వర్షానికి అరకొర తేమలోనే అక్కడక్కడ 6 నుంచి 8 వేల హెక్టార్లలో మాత్రమే విత్తనం వేయడం విశేషం. పప్పుశనగ సాగుకు సరైన సమయం అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే. అయితే ప్రస్తుత పరిస్థితులను దష్టిలో ఉంచుకుని నవంబర్ 15వ తేదీ వరకు వేసుకున్నా ఫరవాలేదంటూ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటనలు చేస్తున్నారు.
వర్ష సూచనలేవీ?
నవంబర్ 15వ తేదీ వరకు పప్పుశనగ విత్తుకోవచ్చు అంటున్నా... ఇపుడు నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే వర్షం వచ్చే సూచనలు లేవంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు మూడు డి్రగ్రీలు పెరగడంతో ఎండలు ముదిరాయి. ఇక రాత్రి ఉష్ణోగ్రతులు కూడా సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో శీతల వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మామూలుగా వర్షం పడటం కష్టమని చెబుతున్నారు. అల్పపీడనాలు, తుఫాన్లు సంభవిస్తే తప్ప వర్షం కురవడం కష్టమంటున్నారు. విస్తారంగా వర్షాలు పడాల్సిన ఆగస్టు, సెప్టెంబర్‌లోనే వరుణుడు మొహం చాటేయడంతో వర్షం వస్తుందనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లింది. ఆగస్టులో 88.7 మి.మీ గానూ ఏకంగా 80 శాతం తక్కువగా కేవలం 18.1 మి.మీ, అలాగే సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గానూ 65 శాతం తక్కువగా కేవలం 41.9 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ కకావికలమైంది. అందులోనూ 6.09 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంట నిలువునా ఎండిపోవడంతో అంతులేని నష్టం వాటిల్లింది.
ఇతర రబీ పంటలు కూడా
వర్షం జాడ లేకపోవడంతో పప్పుశనగతో పాటు నీటి వసతి కింద సాగు చేసే వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర ఇతర రబీ పంటల సాగు కూడా కష్టంగా మారింది. వచ్చే ఖరీఫ్‌లో విత్తన కొరత ఏర్పడకుండా ఉండాలంటే రబీలో పండే వేరుశనగే కీలకం. వర్షాలు లేక భూగర్భజలాలు రోజురోజుకూ క్షీణించిపోతుండటంతో బోరుబావులు కూడా కట్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 60 వేల బోర్లలో నీళ్లు రావడం లేదని అధికారిక నివేదికలు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం జిల్లాలో సగటు భూగగర్భజలమట్టం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 21 మీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వర్షం రాకుంటే నీళ్లు రాని బోర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం రబీ పంటలతో పాటు వచ్చే వేసవిలో 28 వేల ఎకరాల్లో ఉన్న పట్టు, 1.70 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచివుండటంతో రైతుల్లో ఆందోళన ఎక్కువవుతోంది.