పచ్చి మోసం..
కడప అగ్రికల్చర్ : ఎనిమిది రోజుల్లో రబీ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు దుక్కులు దున్ని పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవడానికి ఉపక్రమించారు. ఈ రబీలో వర్షాలు ఆశాజనకంగా కురిస్తే 2.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. రెండేళ్లుగా జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో రబీ సీజన్‌లో ఇవ్వనున్న పప్పు శనగ విత్తన ధరలను ప్రభుత్వం క్వింటాలుపై ఈ ఏడాది రూ.884 పెంచడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వ్యాపారులకు దోచిపెడుతోంది..
రబీ సీజన్‌కు గాను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయనున్న శనగ విత్తనాలను ట్రేడర్లు, వ్యాపారుల వద్ద క్వింటా రూ.6,100 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. అవే విత్తనాలను క్వింటా రూ.6,450 చొప్పున విక్రయించడానికి విత్తన సేకరణ ఏజెన్సీలకు వీలు కల్పించింది. వాస్తవానికి చాలా మంది రైతుల వద్ద శనగ విత్తనాలు భారీ పరిమాణంలో నిల్వ ఉన్నాయి. వారి వద్ద నుంచే నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే ఉపయోగం ఉండేది. రైతులను కాదని, వ్యాపారుల వద్ద నుంచి గొనుగోలు చేయడం వారికి దోచిపెట్టడమే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లో పప్పు శనగలు క్వింటా ధర రూ.4,500 మించి లేదు.
ప్రభుత్వం మాత్రం ధర రూ.6,450గా నిర్ణయించింది. ఇందులో రూ.2,150 (33.33 శాతం) సబ్సిడీ ఇస్తోంది. ఈ లెక్కన రైతులు తమ వాటాగా రూ.4,300 చెల్లించాలని విత్తన ఖరారు పత్రంలో ప్రభుత్వం పొందుపరిచింది. ఒక్కో రైతుకు రెండున్నర హెక్టార్లకుపైగా భూమి ఉన్నా 50 కిలోల వరకు (రెండు బ్యాగులు) పంపిణీ చేయాలని నిర్ణయించారు. 50 కిలోల బస్తాకు రూ.2,150, 25 కిలోల బస్తాకు రూ.1,075 చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది క్వింటాలు ధర రూ.3,800 కాగా, ఇందులో సబ్సిడీ రూ.1,266.50 ఉండేది. ఇది పోను రైతు రూ.2,533.50 చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఉన్నట్లుండి ధర రెండింతలు పెంచడంపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ధర ప్రభుత్వ పెద్దలు, విత్తన ట్రేడర్లు, విత్తన సేకరణ సంస్థలకు వరమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ధరల పెంపు దారుణం
అసలే కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం విత్తన ధరలు పెంచడం దారుణం. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇలా చేస్తారా? రైతును ఆదుకుంటామంటూనే నడ్డి విరుస్తున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో సబ్సిడీ ఇంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం మాదిరిగా ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా రైతును కుంగదీసిన దాఖలాలు గతంలో లేవు.
-గంగిరెడ్డి,రైతు, చెన్నంరాజుపల్లె, పెండ్లిమర్రి మండలం
విత్తన ధరలు తగ్గించాలి
ప్రభుత్వం రైతులపై భారం మోపుతూ విత్తన ధరలు పెంచడం వల్ల పంటలెలా సాగు చేయాలో అర్థం కావడం లేదు. కరువుతో అల్లాడుతుంటే మళ్లీ విత్తన ధరలు పెంచడం దుర్మార్గం. రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తోంది. రైతులను ఆదుకుంటామంటూనే నట్టేట ముంచుతోంది. విత్తన ధరలు తగ్గించి ఆదుకోకపోతే పంటలను సాగు చేయలేం.
-సుబ్బరాయుడు, రేపల్లె, పెండ్లిమర్రి మండలం
ఆందోళన చేపడతాం
రబీలో విత్తన ధరలు అమాంతం పెంచడం తగదు. రైతులు అసలే కరువులో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి రైతు పట్ల కనికరం లేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది పోయి భారం మోపడం తగదు. రైతులందరినీ కలుపుకుని ఆందోళన చేపడతాం.
-రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం