ఆశలు.. మోసులు | Nellore Agriculture Farmers Unhappy | Sakshi
Sakshi News home page

ఆశలు.. మోసులు

Published Thu, Aug 30 2018 8:58 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Nellore Agriculture Farmers Unhappy - Sakshi

సోమశిలలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టం

జిల్లాలో రబీ సీజన్‌ సాగుపై ఆశలు మోసులెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయానికి సోమశిల, కండలేరు జలవనరులే కీలకం. అటువంటి జలాశయాలు ప్రస్తుతం నిండుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో ఊరిస్తున్న మేఘాలు జల్లుకురిసే వరకు నిలవడం లేదు. ఈ పరిస్థితితో వర్షాలు జిల్లాకు మొహం చాటేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కృష్ణా జలాలు సోమశిలకు వస్తుండడంతో జిల్లా రైతులు రబీ సాగుపై ఆశలు పెట్టుకుంటున్నారు. వర్షం ఊరిస్తుందా.. ఊతమిస్తుందా అనేది చూడాల్సి ఉంది.

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో వ్యవసాయం సాగుకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకున్నాయి. సోమశిల 71 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా రెండు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. సోమశిల కింద గతంలో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. కండలేరు కింద జిల్లాలో 2.54 జిల్లాలో ఆయకట్టు ఉంటే.. చిత్తూరు జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి స్టోరేజీని బట్టి ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని స్థిరీకరిస్తున్నారు.
 
ఊరిస్తుందా..! ఊతమిస్తుందా!! 
సాధారణంగా సోమశిల జలాశయం నుంచి 18 నుంచి 20 టీఎంసీలు ఉంటేనే అరకొర నీరు వదులుతారు. కండలేరు పరిస్థితి కూడా అంతే. 8.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాగుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో నీరు లేకపోవడంతో చాలా తక్కువ శాతం సాగు చేశారు.  అయితే సోమశిల జలాశయంలో కొద్ది రోజుల వరకు 9 టీఎంసీల నిల్వ ఉండేది. ఇటీవల కృష్ణా జలాలు విడుదల కావడంతో సాగుపై కాసింత ఆశలు మొలకెత్తాయి. బుధవారం సాయంత్రానికి 18.587 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 16,440 క్యూసెక్కుల వంతున కృష్ణానది జలాల రాక కొనసాగింది. గతేడాది కూడా జిల్లాలో వర్షాలు కురవలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు నీళ్లు రావడంతో రబీ సాగు గట్టెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సోమశిలకు రావడంతో అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్‌పై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు.

చిత్తడి జల్లులతో సరి.. 
రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం తుంపర్లతో సరిపెడుతున్నాయి. గతేడాది కూడా పడాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 55 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రబీ అంతంత మాత్రంగా గట్టెక్కినా.. ఖరీఫ్‌లో అనుకున్నంతగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జిల్లాలో 45 మండలాలను కరువుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రబీ సీజన్‌ ముంచుకొస్తున్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన రోజులు దాటిపోతున్నా.. నీటి నిల్వల పరిస్థితి రైతాంగాన్ని కలవరపెడుతుంది. జిల్లాలో ఏడాది కూడా ప్రస్తుత సమయానికి పడాల్సిన వర్షాలు కూడా పడలేదు. ఈ ఏడాది పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుండడంతో రబీ ప్రారంభం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రబీలో కొంత, ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది రబీలోనైనా గట్టెక్కాలనుకుంటే వరుణుడు కనికరించక పోవడంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.  

ఎప్పుడూ ఈ విధంగా లేదు
ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాగు, తాగుకు నీరు ఇబ్బందికరంగా మారింది. భూగర్భ జలాలు ఎండిపోయాయి. బోర్లు వేద్దామన్నా నీరు పడే పరిస్థితి లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి. – కొప్పోలు యల్లారెడ్డి, ఆత్మకూరు

జేడీ వ్యవసాయశాఖఆందోళన కలిగిస్తుంది
ప్రస్తుతం కొంత కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎక్కువగా రాపూరు మండలంలో కరువు ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షాలపై ఎక్కువగా ఆధార పడి సాగు చేస్తారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేకపోతే ఈ ఏడాది పంట ఏ విధంగా సాగుచేయాలో ఆందోళన కలిగిస్తుంది.– టి హరగోపాల్, రాపూరు

ప్రత్యామ్నాయ పంటలను చూస్తాం
 ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అనుకున్నంతగా సాగు చేయలేదు. కానీ మరో నెల తర్వాత రబీ ప్రారంభం కానుంది. అప్పటికీ వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. రబీకి విత్తనాలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.   – బీ చంద్రనాయక్,

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement