సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అడుగంటిన రైతుల ఆశలు చిగురు తొడుగుతున్నాయి. సోమశిల ప్రాజెక్ట్‌కు సుమారు 50 టీఎంసీల నీరు చేరడం.. మూడేళ్ల తరువాత వరుణుడు కటాక్షించి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో వ్యవసాయ రంగానికి మంచి శకునాలే కనిపిస్తున్నాయి. సోమశిల ప్రాజెక్ట్ నుంచి డెల్టాకు గురువారం నీరు విడుదల కానుంది. రోజుకు 4,900 క్యూసెక్కులు అవసరం ఉండగా.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెయ్యి క్యూసెక్కులను మాత్రమే విడుదల చేయనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి నీటి సరఫరా పెంచుతారు. బుధవారం సాయంత్రానికి సోమశిల ప్రాజెక్ట్‌లో 50.310 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 8,670 క్యూసెక్కుల వరద నీరు సోమశిలకు చేరింది. జిల్లాలో మొత్తం రబీ సీజన్ కింద 4.95 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అంచనా వేశారు.
ఆ మేరకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. సాగునీటి సలహా మండలి సమావేశం ముందు రోజు సోమశిలలో 49.969 క్యూసెక్కుల నీరుంది. నవంబర్‌లో 6.688 టీఎంసీలు, డిసెంబర్‌లో 5.365 టీఎంసీలు రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహ జలాలు (ఇన్ ఫ్లో) వస్తాయని అంచనా వేసి మొత్తం నీటి నిల్వను 62.022 టీఎంసీలుగా చూపారు. ఇందులో 7.5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ నిల్వగా ఉంటుంది. నెల్లూరు నగరం, కావలి, అల్లూరు తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు కేటాయించాలని, మొత్తం నీటిలో 1.5 టీఎంసీలు ఆవిరైపోతుందని అంచనా వేశారు. మొత్తంగా 12 టీఎంసీల నీరు పోగా.. 52.281 టీఎంసీలను పంటలకు అందించనున్నారు.
కండలేరుకు ఆపేయాలి
వరద నీరు అధికంగా వస్తుందనే కారణంతో కండలేరుకు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా నుంచి కండలేరు ప్రాజెక్ట్ ద్వారా చిత్తూరు, చెన్నై అవసరాలకు ఇప్పటికే 15 టీఎంసీలను విడుదల చేశారు. ఈ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే మొదటి హక్కు జిల్లా రైతులకు మాత్రమే ఉంది. ఈ క్రమంలో నూరు శాతం సాగుకు నీరిచ్చి ఆ తర్వాతనే ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కృష్ణా జలాలు విడుదల కాకముందే కండలేరుకు నీరు విడుదల చేయడంపై జిల్లా రైతులు తీవ్రస్థాయిలో అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 15 టీఎంసీల కృష్ణా జలాలను కండలేరు ద్వారా చెన్నై, చిత్తూరుకు పంపుతుంటారు. ఈ ఏడాది కృష్ణా జలాలు విడుదల కాకముందే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సోమశిల జలాలను ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం రోజూ 7,500 క్యూసెక్కుల చొప్పున పంపిస్తున్నారు. తక్షణమే దీనిని నిలిపివేసి సోమశిలలో నిల్వ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
నాన్ డెల్టాలోనూ చిగురిస్తున్న ఆశలు
గత ఏడాది వర్షాలు లేక నాన్ డెల్టా ప్రాంతమైన ఓజిలి, చిల్లకూరు, వాకాడు, చిట్టమూరు, పెళ్లకూరు, తడ మండలాల్లో పంటలు పండలేదు. కోట, రాపూరు మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోవడంతో రైతులు అష్టకష్టాలు పడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ ప్రాంత రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వర్షాలకు చెరువులు నిండితే.. పంటలు వేసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.
రోజూ 4,900 క్యూసెక్కులు అవసరం
జిల్లాలో రబీ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ క్రమంలో రోజూ 4,900 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉంది. పెన్నా డెల్టా ద్వారా నెల్లూరు, సంగం కాలువలకు 2,500 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 600, కనుపూరు కెనాల్‌కు 400 క్యూసెక్కులు విడుదల చేయాలి. నాన్ డెల్టా ప్రాంతంలోని నార్త్ ఫీడర్‌కు 450, సౌత్ ఫీడర్‌కు 450 క్యూసెక్కుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అంత నీరు అవసరం లేదని లెక్క తేల్చారు. కలిగిరి రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 500 క్యూసెక్కులను మూడు రోజుల క్రితమే విడుదల చేశారు. రిజర్వాయర్‌లో 17 అడుగుల మేర నీటి నిల్వ ఉండటంతో తాత్కాలికంగా విడుదల చేసినట్లు చెబుతున్నారు. నాన్ డెల్టాకు సంబంధించి ఈనెల 7న రైతులతో సమావేశం నిర్వహించి నీటి విడుదల షెడ్యూల్ సిద్ధం చేసి 8వ తేదీ నుంచి నీరు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నార్త్, సౌత్ ఫీడర్‌లకు గురువారం నీరు విడుదల చేయడం లేదు. సోమశిల నుంచి పెన్నాకు నీరు విడుదల చేశాక అక్కడ నుంచి డెల్టాలోని ప్రధాన కెనాల్స్‌కు వెళుతుంది.
Comments
Please login to add a commentAdd a comment