ట్రాక్టర్లు
జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి రాయితీలు కావాలన్నా, సబ్సిడీ పరికరాలు తీసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఇన్‌చార్జుల సిఫార్సులు తప్పనిసరి అని అధికారులు చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. అర్హులైన రైతులను పక్కనపెట్టి అధికారపార్టీ నేతల బినామీలకు రైతురథం పేరుతో ట్రాక్టర్లను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు(సెంట్రల్): జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదేశాలతో ఇష్టా నుసారంగా అధికారపార్టీ నేతల అనుచరులకు ట్రాక్టర్లను పంపిణీ చేయనుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోక పోవడం, ప్రభుత్వం ఇచ్చే రాయితీ ట్రాక్టర్లు తీసుకుందామన్నా టీడీపీ నేతల లేఖలు అధికారులు అడుగుతుండటంతో రైతులకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైతురథం అనే కన్నా టీడీపీ రథం అని పేరుపెట్టుకుని నేరుగా వారికే ఇవ్వాలని ఎద్దేవా చేస్తున్నారు.
ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.5 లక్షల సబ్సిడీ
జిల్లాలో నెల్లూరు మినహా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు 1,070 రైతు రథం ట్రాక్టర్లను పంపిణీ చేసే విధంగా గత ఏడాది టార్గెట్ విదించారు. వీటికి ఒక్కోదానికి రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. టీడీపీ నేతలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ట్రాక్టర్లు పంపిణీ చేశారు. 2018 సంవత్సరానికి కూడా ఇదే తరహాలో అధికార పార్టీ నేతల సిఫార్సు ఉంటేనే ఇస్తున్నారు.
రథాల రాజకీయం
గత ఏడాది జిల్లాకు 1,050 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. మొదట 700 ట్రాక్టర్లు మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ అధికారుల చేత జిల్లాకు చెందిన మంత్రి ప్రకటన చేయించారు. తరువాత తానే జిల్లాకు అవసరం అని ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు మంజూరు చేయించానని చెప్పుకునేదానికి తిరిగి 1,050 ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది జిల్లాకు 1,300 ట్రాక్టర్లు మంజూరైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతం 550 ట్రాక్టర్లు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా 150 ట్రాక్టర్లకు అనుమతి
జిల్లాలో రైతురథం ట్రాక్టర్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో ఇంత వరకు అధికారులు ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి 150 ట్రాక్టర్లను మంజూరు చేసినట్లు తెలిసింది. వీటిని ఈ వారంలోనే పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లను ఈ విధంగా పంపిణీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి కనుసన్నల్లో
జిల్లాకు చెందిన మంత్రి కనుసన్నల్లో టీడీపీ నేతలకు రైతురథం ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి సూచనలతో 150 ట్రాక్టర్లను పంపకానికి అధికారులు సిద్ధం చేశారు. మరొకొన్ని ట్రాక్టర్లను మంజూరు చేసే విధంగా అధికారులకు సిఫార్సు లేఖలు పంపిణినట్లు సమాచారం. ఈ విధంగా ఆ మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం చేస్తున్నాం
మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. కొన్ని ట్రాక్టర్లను ఇప్పటికే మంజూరు చేసిన మాట వాస్తవమే. ట్రాక్టర్లు మంజూరు చేయాలంటే ఇన్‌చార్జి మంత్రి లేదా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సంతకంతో లెటర్ ఉండాలి. అన్నింటినీ పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తాం .–బి.చంద్రనాయక్, జేడీ, వ్యవసాయశాఖ
అధికారపార్టీ వాళ్లకే ఇస్తున్నారు
రైతురథం ట్రాక్టర్లు మొత్తం టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే గత ఏడాది ఇచ్చారు. ఈ ఏడాది ప్రస్తుతం ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవాలే అనే విషయం కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నులో జరుగుతోంది. –ప్రభాకర్‌నాయుడు, యనమదల, చేజర్ల మండలం
అర్హులకు అందడం లేదు
ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే రైతురైథం పథకంలో అర్హులైన వారికి ట్రాక్టర్లు ఇవ్వడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు చెప్పిన వారికి ఇస్తామంటే వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్నాం అని చెప్పడం దేనికి, నేరుగా టీడీపీ కార్యాలయం నుంచే ఇస్తే సరిపోతుంది కదా. గత ఏడాది అర్హులకు అందలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితిగా ఉంది. –సంకటి రామకృష్ణారెడ్డి, చేజర్ల
Comments
Please login to add a commentAdd a comment