సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో వర్గవిభేదాలు షరామామూలుగా మారాయి. వేదికలు మాత్రమే మారుతున్నాయి. ప్రతి వేదికపై ఒక వర్గం మరో వర్గంపై పైచేయి సాధించుకునే క్రమంలో ఘాటు విమర్శలకు దిగుతోంది. తాజాగా నెలన్నరగా అధికారపార్టీలో ఆత్మకూరు పంచాయితీ ముగింపు లేని రీతిలో కొనసాగుతోంది. జిల్లా టీడీపీలో ఉన్న గ్రూప్‌లన్నీ ఆత్మకూరులో ఉండడం, ప్రతి ఒక్కరూ అక్కడివారు కావడంతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సంగం మండలంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన పార్టీ సమావేశానికి మంత్రి సోమిరెడ్డి వర్గం పూర్తిగా గైర్హాజరైంది. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మంత్రి సోమిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు విమర్శలు చేయడం పార్టీలో మళ్లీ చర్చనీయాంశం అయింది.
సోమవారం సంగం, ఆత్మకూరు మండలాల్లో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఆత్మకూరు తాత్కాలిక ఇన్‌చార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డి సమావేశాలు నిర్వహించారు. దీనికి యథావిధిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరుడు, పార్టీ నేత కన్నబాబు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు సన్నిహితంగా ఉండే డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక కొత్తగా రంగంలోకి రావాలనుకుంటున్న బొల్లినేని కృష్ణయ్య ప్రతినిధిగా అతని సమీప బంధువు తాళ్లూరి గిరినాయుడు హాజరయ్యారు. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి పేరు చెప్పకుండా ఆయనపై ఫైర్ అయ్యారు.
గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తనని 2004 ఎన్నికల సమాయానికి పార్టీ నుంచి బయటకు పంపేశారని, మళ్లీ గత కొంతకాలంగా తనపై పార్టీలోని ఆయన సొంత మనుషుల ద్వారా విషప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. వీళ్లకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. వాళ్లకి మంత్రి పదవి రావాలే తప్ప జిల్లాలో పార్టీ బాగుండాలని ఏమాత్రం లేదని, గోదావరి జిల్లాలో గెలిస్తే అధికారం వస్తుందనుకుంటున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. గత ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేకుండా చేసిన పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మరోవైపు ఆదాల వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment