నెల్లూరు: తెలుగుదేశం పార్టీ టికెట్ల విషయంలో నువ్వా? నేనా? అనే రీతిలో తెర రాజకీయ యుద్ధానికి దిగిన పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఈ నెల 5వ తేదీన పార్టీలో చేరబోతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య రాజీ కుదిరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కోవూరు టికెట్ పోలంరెడ్డికే ఇప్పించాలని ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర చేసిన ప్రయత్నాలకు ఆదాల చేయూతనందించారు. చివరకు ఈ టికెట్ వ్యవహారం ఆదాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో పార్టీ సాధారణ కార్యకర్తల్లాగానే సోమిరెడ్డి అధినేత చంద్రబాబు వద్ద తన అక్కసు, ఆవేదన వెల్లగక్కిన విషయం తెలిసిందే. కోవూరు టికెట్ పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి ఆదాల- సోమిరెడ్డి మధ్య మధ్యస్తం చేసే బాధ్యతను పార్టీ నాయకుడు సుజనా చౌదరికి అప్పగించారని సమాచారం.
ఇటీవల ప్రజాగర్జన సభ ఏర్పాట్ల కోసం నెల్లూరు వచ్చిన సుజనా చౌదరి ఈ ఇద్దరు నేతలతో సుదీర్ఘ మంతనాలు సాగించి కొన్ని షరతులతో ఎట్టకేలకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారని టీడీపీలో గుప్పుమంటోంది. ఈ రాజీ సూత్రం ప్రకారం కోవూరు పోలంరెడ్డికి, నెల్లూరు రూరల్ సోమిరెడ్డికి, సర్వేపల్లి పెళ్లకూరుకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ప్రచారం సాగుతోంది. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో తలదూర్చననే షరతుతో సోమిరెడ్డితో ఆదాల రాజీకి అంగీకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.