గురువారం తాటిపర్తిపాళెంలో పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్ డేగా శ్రీదేవి శుక్రవారం అదే కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సోమిరెడ్డి
వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెంలో పంచాయతీ కార్యాలయాన్ని..కమ్యూనిటీ భవనాన్ని ఆ గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. సరిగ్గా 24 గంటలు గడవలేదు. హంగూ..ఆర్భాటాలు..మందీ మార్బలంతో వచ్చి మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మళ్లీ వాటిని ప్రారంభించారు. ఇది చూసి జనం అవాక్కయ్యారు. ఇదేం విడ్డూరమంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటివి ఆయనకు పరిపాటే అంటున్నారు స్థానికులు. మత్స్యకారులకు వలలు ఇస్తామని ప్రలోభపెట్టి కండువాలు కప్పడం.. సైకిళ్ల పంపిణీ కోసం తీసుకెళ్లి పార్టీలో చేరినట్లు ప్రకటించుకోవడం టీడీపీ నాయకులకే చెల్లుతోందని గుసగుసలాడున్నారు.
వెంకటాచలం: మండలంలోని తాటిపర్తిపాళెంలో గేట్‌వే కంపెనీ ఏర్పాటుకు పంచాయతీ సహకరించడంతో ఆ కంపెనీ యాజమాన్యం గ్రామంలో తమవంతు సహకారంగా గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు కమ్యూనిటీ హాల్, పాఠశాలకు ప్రహరీ ర్మాణాలను చేపట్టింది. ఈ నిర్మాణాలు పూర్తికావడంతో అధికారికంగా గురువారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు సమక్షంలో పంచాయతీ కార్యాలయాన్ని, కమ్యూనిటీ హాల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ డేగా శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో టీడీపీ గ్రామంలో చాలా బలహీనంగా ఉందనే విషయం స్పష్టమైపోయింది.
దీన్ని కప్పిపుచ్చుకునేందుకు పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ హాల్‌ను 24 గంటల వ్యవధిలో మంత్రి సోమిరెడ్డి చేతుల మీదుగా మళ్లీ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. గురువారం గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారనే విషయం తెలిసినా మంత్రి సోమిరెడ్డి అవేమీ తనకు పట్టవన్నట్లు మళ్లీ ప్రారంభించడాన్ని చూసి గ్రామస్తులు నవ్వుకున్నారు. సర్పంచ్ ప్రారంభించిన కార్యాలయాన్ని మంత్రి మళ్లీ ప్రారంభించడం ఏమిటని సొంత పార్టీ నాయకులే చెవులు కొరుక్కున్నారు. వెంకటాచలం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో దిక్కుతోచక తీసుకునే నిర్ణయాలతో టీడీపీ నవ్వులపాలవుతోందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment