పోర్టు సెక్యూరిటీ డీజీఎంపై చేయిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే
కృష్టపట్నం పోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యేది కాక మిగిలిన వాహనాలను తనిఖీ చేయాలన్న సెక్యూరిటీ
ఆగ్రహంతో ఊగిపోతూ దాడికి తెగబడిన సోమిరెడ్డి అసభ్య పదజాలంతో తిట్లదండకం చర్యలు తీసుకోవాలంటూ సిబ్బంది నిరసన
సాక్షి ప్రతినిధి నెల్లూరు/ముత్తుకూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాడికి తెగబడిన వైనం కలకలం రేపింది. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునద్ధరణ పనులపై యాజమాన్యంతో చర్చించేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమవారం తన అనుచరులతో వెళ్లారు. పోర్టు ప్రధానద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ డీజీఎం ఎమ్మెల్యే కారుతోపాటు కొన్ని వాహనాలను లోనికి అనుమతించారు.
మిగిలిన వాహనాలను తనిఖీచేయాలని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన సోమిరెడ్డి కారునుంచి దిగివచ్చి కోపంతో ఊగిపోతూ అసభ్య పదజాలంతో తిట్లదండకం అందుకున్నారు. సెక్యూరిటీ డీజీఎంపై దాడికి తెగబడి ఆయన్ని వెనక్కి నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసకువెళ్లే క్రమంలో పోలీసులు, నాయకులు డీజీఎంను వారించారు. ఇదే అంశంపై పోర్టు అడ్మిన్ భవనం వద్ద కూడా సోమిరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
సీఈఓతోనూ దురుసు ప్రవర్తన
ఎన్నికలముందు పోర్టు కంటైనర్ టెర్మినల్ సేవలను పునరుద్ధరిస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటివరకు పోర్టు యాజమాన్యంతో చర్చలు జరపకపోవడం, కార్యాచరణ చేపట్టకపోవడంతో సీఐటీయూ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి అఖిలపక్షం పేరుతో పోర్టు అధికారులతో మాట్లాడేందుకు సోమవారం వెళ్లిన సోమిరెడ్డి పోర్టు కార్యాలయంలోకి వెళ్లి సీఈఓతోనూ వాగ్వాదానికి దిగారు. ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తూ కేకలు వేశారు.
ఖండించిన కాకాణి
కృష్ణపట్నం పోర్టులో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేయిచేసుకోవడాన్ని మాజీమంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమిరెడ్డి అఖిలపక్షం పేరిట డ్రామాలు ఆడుతూ, కూటమి పార్టీల నేతలను పోర్టుకు తీసుకెళ్లడం ఏమిటని నిలదీశారు. అత్యంత భద్రత ఉండే ప్రధానమైన పోర్టులో తనిఖీచేసి వాహనాలను అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినకుండా దాడి చేశారన్నారు. పోర్టు కార్యాలయంలోనూ సోమిరెడ్డి కేకలు వేసి సీఈఓతో దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. ఎమ్మెల్యే వీధిరౌడీలా మారి నేరుగా దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment