tractors distribution
-
ఎమ్మెల్యే సిఫార్సు ఉందా ఐతే ఓకే..!
నిడదవోలు రూరల్ : రైతుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఆపత్కాలంలో ఉన్న అన్నదాతలను ఆదుకుంటాం. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం కర్షకులకు చెప్పే కల్లబొల్లి మాటలు. కానీ వాస్తవంగా చూస్తే కర్షకుల కన్నీళ్లు తుడవడం మానేసి వారికిచ్చే రాయితీ పథకాలను అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో చేజిక్కించుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా అందించే వ్యవసాయ యంత్రాల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకే అధికార యంత్రాంగం ప్రాధాన్యం ఇవ్వడంతో ఏటా అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతోంది. ఇలా రైతులకు అందే వ్యవసాయ పరికరాలను టీడీపీ నేతలు చేజిక్కించుకుని రాయితీ నిధులతో జేబులు నింపుకుంటున్నారు. ఆధునిక పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అందించే వివిధ వ్యవసాయ పనిముట్లు, యం త్రాలు అధికార పార్టీ నేతలకే అందుతున్నాయి. జిల్లాలో 2017–18 ఏడాదిలో రూ.23.14 కోట్లు విలువచేసే 9,262 యంత్రాలను పంపిణీ చేశారు. 2018–19 ఏడాదికిగాను ఇవిగో ఉదాహరణలు నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బండి వెంకటేశ్వరరావుకు రైతురథం పథకంలో ట్రాక్టర్‌ను మంజూరు చేశారు. 2017 అక్టోబర్ 24వ తేదీన దరఖాస్తు చేసుకోగా రోటోవేటర్, చిన్న ట్రాక్టర్‌కు కలిపి ఆయన రూ.2 లక్షలు రాయితీ పొందారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్, నిడదవోలు సామాజిక ఆరోగ్యకేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ కొమ్మిన వెంకటేశ్వరరావు మేనల్లుడైన కుదప శ్రీనుకు రాయితీపై ట్రాక్టర్‌తో పాటు రోటోపుడ్లర్ను మంజూరు చేశారు. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ నాయకుడు కరుటూరి చౌదరికి 2017–18లో రాయితీపై ట్రాక్టర్‌ను మంజూరు చేశారు. నిడదవోలు మండలంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయగా లబ్ధిదారులందరూ టీడీపీకి చెందిన వారే. పై ముగ్గురితో పాటు ఎమ్మెల్యే సిఫార్సుతో మరో 27 మంది రైతులు గతేడాది యంత్రాలను దక్కించుకున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. రూ.10.03 కోట్ల బడ్జెట్‌తో 2,420 యంత్రాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది యంత్రాలను ఎంపిక చేసిన రైతులకు గత పది రోజులుగా అందజేస్తున్నారు. రైతు రథం పథకం కింద ఒక్కొక్క ట్రాక్టర్‌ను రూ.2 లక్షలు రాయితీపై పొందేందుకు టీడీపీ సభ్యత్వ కార్డులు, అధికారపార్టీ నేతల సిఫార్సులు ఉన్నవారే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ సిఫార్సులున్న వారికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని అర్హులైన రైతులు వాపోతున్నారు. ఏటా 12 వేల దరఖాస్తులు కోరుమామిడి, మునిపల్లి గ్రామాలకు చెందిన రైతులు రెండేళ్లుగా రాయితీపై అందించే యంత్రాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ నేటీకీ మంజూరు చేయలేదు. పొలానికి సంబంధించి అర్హత పత్రాలన్నీ ఉన్నా మాకేందుకు మంజూరు చేయలేదని సదరు రైతులు వ్యవసాయశాఖ సిబ్బందిని ప్రశ్నిస్తే వ్యవసాయశాఖ ద్వారా అందించే రాయితీ యంత్రాలను పొందాలంటే కచ్చితంగా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సంతకం ఉండాలని ఉన్నతాధికారులు సమాధానం చెప్పడంతో రైతులు ఎవరికీ చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఏటా 12 వేల మంది అర్హులైన రైతులు వ్యవసాయ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే సిఫార్సు లెటర్లు తేలేక రాయితీ యంత్రాలు పొందలేకపోతున్నారు. పవర్ టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు, రోటోవేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు కోసం అధికంగా రైతులు దరఖాస్తు చేస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి రైతు రథం పథకం కింద ట్రాక్టర్లు, పవర్టిల్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను అర్హులైన రైతులకు అందజేయాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న రైతుల స్థితిగతులను విచారించి సొంత భూమి కలిగి ఉండి, వ్యవసాయంపై మక్కువ ఉన్న వారికే వీటిని అందజేయాలి. ఇస్తున్నది ఎవరికి రైతు రథం పథకం కింద ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే దక్కుతున్నాయి. అధికారులు కూడా ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉన్న వారికే వీటిని మంజూరు చేస్తున్నారు. దాంతో అప్పనంగా సబ్సిడీ సొమ్ము దక్కించుకుంటున్నారు. రైతు రథం పొందడానికి అర్హులు వీరే.. ఎస్సీ, ఎస్టీ రైతులు ఎకరం పొలం, బీసీ, ఓసీ కులాల రైతులు కనీసం రెండు ఎకరాల పొలం కలిగి ఉండాలి. కౌలు రైతులు సాగుచేసే భూమికి ఐదేళ్లు పాటు అగ్రిమెంట్ కలిగి ఉండాలి. పట్టదారు పాస్‌పుస్తకం, సాగుచేయు పంటలు, ఆధార్, బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రైతుకు సొంతంగా ట్రాక్టర్ ఉండకూడదు. కుదించిన రాయితీ పరికరాలు వ్యవసాయ యాంత్రీకరణకు రాయితీపై అందించే పరికరాలు ఈ ఏడాది కుదించారు. ఒక్కోజిల్లాకు సబ్సిడీపై 500 ట్రాక్టర్లు ఇస్తామని ప్రకటించినా బడ్జెట్లో మాత్రం గతేడాది కంటే 50 శాతం నిధులు కోత విధించారు. 2018–19 ఏడాదికి 2,420 యంత్రాల సబ్సిడీకి రూ.10.03 కోట్లు మంజూరు చేశారు. రైతులకు సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ కింద 90 శాతం రాయితీతో పరికరాలు అందిస్తామని చెప్పినా ఇంకా కార్యరూపం దాల్చ లేదు. పవర్టిల్లర్తోపాటు, వరి విత్తనాలను వెదజల్లే యంత్రం, వరికోత యంత్రం, చిన్న ట్రాక్టర్లు, లెవెలింగ్ బ్లేడులు, పవర్ టిల్లర్లను కూడా అధికార పార్టీ నేతలకే అందజేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల స్థితిగతులపై జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. అర్హులైన రైతులు నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు ట్రాక్టర్లతో పాటు మిగిలిన యంత్రాలను రాయితీపై అందజేస్తున్నాం. – గౌసియాబేగం, సంయుక్త వ్యవసాయ సంచాలకులు, ఏలూరు. -
సిఫార్సు ఉంటేనే!
జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి రాయితీలు కావాలన్నా, సబ్సిడీ పరికరాలు తీసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఇన్చార్జుల సిఫార్సులు తప్పనిసరి అని అధికారులు చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. అర్హులైన రైతులను పక్కనపెట్టి అధికారపార్టీ నేతల బినామీలకు రైతురథం పేరుతో ట్రాక్టర్లను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదేశాలతో ఇష్టా నుసారంగా అధికారపార్టీ నేతల అనుచరులకు ట్రాక్టర్లను పంపిణీ చేయనుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోక పోవడం, ప్రభుత్వం ఇచ్చే రాయితీ ట్రాక్టర్లు తీసుకుందామన్నా టీడీపీ నేతల లేఖలు అధికారులు అడుగుతుండటంతో రైతులకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైతురథం అనే కన్నా టీడీపీ రథం అని పేరుపెట్టుకుని నేరుగా వారికే ఇవ్వాలని ఎద్దేవా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.5 లక్షల సబ్సిడీ జిల్లాలో నెల్లూరు మినహా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు 1,070 రైతు రథం ట్రాక్టర్లను పంపిణీ చేసే విధంగా గత ఏడాది టార్గెట్ విదించారు. వీటికి ఒక్కోదానికి రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. టీడీపీ నేతలు, జిల్లా ఇన్చార్జి మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ట్రాక్టర్లు పంపిణీ చేశారు. 2018 సంవత్సరానికి కూడా ఇదే తరహాలో అధికార పార్టీ నేతల సిఫార్సు ఉంటేనే ఇస్తున్నారు. రథాల రాజకీయం గత ఏడాది జిల్లాకు 1,050 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. మొదట 700 ట్రాక్టర్లు మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ అధికారుల చేత జిల్లాకు చెందిన మంత్రి ప్రకటన చేయించారు. తరువాత తానే జిల్లాకు అవసరం అని ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు మంజూరు చేయించానని చెప్పుకునేదానికి తిరిగి 1,050 ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది జిల్లాకు 1,300 ట్రాక్టర్లు మంజూరైనట్లు సమాచారం. అయితే ప్రస్తుతం 550 ట్రాక్టర్లు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 150 ట్రాక్టర్లకు అనుమతి జిల్లాలో రైతురథం ట్రాక్టర్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో ఇంత వరకు అధికారులు ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి 150 ట్రాక్టర్లను మంజూరు చేసినట్లు తెలిసింది. వీటిని ఈ వారంలోనే పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లను ఈ విధంగా పంపిణీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కనుసన్నల్లో జిల్లాకు చెందిన మంత్రి కనుసన్నల్లో టీడీపీ నేతలకు రైతురథం ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి సూచనలతో 150 ట్రాక్టర్లను పంపకానికి అధికారులు సిద్ధం చేశారు. మరొకొన్ని ట్రాక్టర్లను మంజూరు చేసే విధంగా అధికారులకు సిఫార్సు లేఖలు పంపిణినట్లు సమాచారం. ఈ విధంగా ఆ మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చేస్తున్నాం మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. కొన్ని ట్రాక్టర్లను ఇప్పటికే మంజూరు చేసిన మాట వాస్తవమే. ట్రాక్టర్లు మంజూరు చేయాలంటే ఇన్చార్జి మంత్రి లేదా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి సంతకంతో లెటర్ ఉండాలి. అన్నింటినీ పరిశీలించి ట్రాక్టర్లు మంజూరు చేస్తాం .–బి.చంద్రనాయక్, జేడీ, వ్యవసాయశాఖ అధికారపార్టీ వాళ్లకే ఇస్తున్నారు రైతురథం ట్రాక్టర్లు మొత్తం టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే గత ఏడాది ఇచ్చారు. ఈ ఏడాది ప్రస్తుతం ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవాలే అనే విషయం కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నులో జరుగుతోంది. –ప్రభాకర్‌నాయుడు, యనమదల, చేజర్ల మండలం అర్హులకు అందడం లేదు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే రైతురైథం పథకంలో అర్హులైన వారికి ట్రాక్టర్లు ఇవ్వడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు చెప్పిన వారికి ఇస్తామంటే వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్నాం అని చెప్పడం దేనికి, నేరుగా టీడీపీ కార్యాలయం నుంచే ఇస్తే సరిపోతుంది కదా. గత ఏడాది అర్హులకు అందలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితిగా ఉంది. –సంకటి రామకృష్ణారెడ్డి, చేజర్ల -
ట్రాక్టర్ల పంపిణీలో.. పైరవీలు
సాక్షి, వికారాబాద్ : వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ప్రభుత్వం రైతులకు పనిముట్లతో పాటు ఆధునిక యంత్రాలను రాయితీపై అందజేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన వారికి సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేసే కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ఏటా బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. బడ్జెట్ సకాలంలో విడుదల కాని పక్షంలో ట్రాక్టర్ షోరూంలతో ఒప్పందం చేసుకుని ముందస్తుగానే వీటిని రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2017– 18 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో జిల్లాకు 166 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వీటి పంపిణీకి అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ఎస్పీ (స్టేట్ నార్మల్ ప్లాన్) కింద 116, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్కేవీవై పథకం కింద 50 ట్రాక్టర్లు అందజేయనుంది. ఈ నెల 15వ తేదీ వరకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు ప్రకటించారు. నిబంధనలు... ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీపై, బీసీ, ఇతర రైతులకు 50 శాతం రాయితీపై ట్రాక్టర్లు ఇవ్వనున్నారు. ఉదాహరణకు రూ.7 లక్షల విలువచేసే ట్రాక్టర్‌కు బీసీ, ఇతర రైతులు తమ వాటాగా మూడున్నర లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీపై ట్రాక్టర్ పొందాలనుకునే రైతు తనకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉన్నట్లు పాస్‌బుక్ (ధ్రువీకరణపత్రం), రుణం ఇచ్చేందుకు బ్యాంకు అంగీకారపత్రం, తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయాధికారుల నుంచి తీర్మానపత్రం పొందాలి. దరఖాస్తులన్నీ పరిశీలించిన తర్వాత అధికారులు అర్హత ఉన్నవారికే ట్రాక్టర్లు అందజేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆయా మండలాలకు చెందిన ఏఓలకు దరఖాస్తులు అందజేయాలి. సిఫారసులకు ప్రాధాన్యత ఇవ్వొద్దు... గతేడాది జిల్లాలో పంపిణీ చేసిన 68 ట్రాక్టర్లలో అధిక శాతం అనర్హులకే దక్కినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది కూడా ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి సిఫారసు లెటర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అస్మదీయులకు వాహనాలు ఇప్పించడానికి కొంతమంది నేతలు అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి రైతులను మోసం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఓ పార్టీకి చెందిన నాయకుడు హెచ్చరించారు. అర్హులకే అందజేస్తాం సబ్సిడీ ట్రాక్టర్ల కోసం అర్హులైన రైతులు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాకు ఎన్ఎస్పీ కింద 116, ఆర్‌కేబీవై కింద 50 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. బడ్జెట్ ఇంకా విడుదల కాకపోయినా నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగానే కంపెనీలతో ముందస్తు ఒప్పందంతో అర్హులకు అందిస్తాం. సిఫారసులు, ఫోన్లు వస్తున్నాయనే ఆరోపణల్లో నిజం లేదు. ఎవరి ఒత్తిడికీ తలొగ్గే ప్రసక్తేలేదు. నిబంధనల ప్రకారం అర్హులైన వారికే ట్రాక్టర్లు అందజేస్తాం. – గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి -
కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రా?: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ తన దత్తత గ్రామానికే ముఖ్యమంత్రా.. మొత్తం రాష్ట్రానికి కాదా అని సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు.ఎర్రవల్లిలోని వారికి రుణాలు అందించడం, ట్రాక్టర్లు పంపిణీ చేయడం, ఇతరత్రా సహాయం అందించడం అభినందనీయమేనన్నారు. అయితే ఎర్రవల్లిలోని ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని చెబుతున్న సీఎం, ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమిస్తామన్న ప్రకటనలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తన దత్తత గ్రామానికే పరిమితం కాకుండాయావత్ రాష్ట్రాన్ని సొంత ఊరిగా చూసుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన ఒక ప్రకటనలో నిలదీశారు. శనివారం నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును పార్టీ నాయకులతో కలసి సందర్శించినపుడు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. -
మీరే ఆదర్శం...
♦ అందరికీ తొవ్వ చూపాలెఅంకాపూర్ను మరవాలె ♦ రెండు నెలల్లో కొత్త ఇళ్లకు పోదాం ♦ యాగంజేసి.. పెద్ద పండుగ జేద్దాం ♦ నేనూ మీతోపాటే భోజనం చేస్తా ఊళ్లో అందరికీ ఉపాధి ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు ♦ దత్తత గ్రామం ఎర్రవల్లిలో పర్యటన ♦ 42 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ గజ్వేల్/జగదేవ్‌పూర్ : ‘మీ వెనుక సర్కారుంది.. తెలంగాణలో మీరు అదృష్టవంతులు. ముందు వరుసలో అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నరు. అన్ని గ్రామాలకు ఆదర్శం గావాలె... అందరికీ తొవ్వ చూపాలె... రెండు నెలల్లోపు యాగం చేసి శ్రావణ మాసంలో ఇళ్లలోకి పోదాం.. రెండేళ్లలో పాములుపర్తి రిజర్వాయర్‌కు గోదావరి నీళ్లు తీసుకువస్తా.. ఎర్రవల్లికి 24 గంటలు నీళ్లే..స్వయం పాలిత, స్వయం సమృద్ధితో పని చేయాలి.. అంకాపూర్‌ను మరిచి ఎర్రవల్లి బాట పట్టాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం తన దత్తత గ్రామమైన ఎర్రవల్లి, నర్సన్నపేటగ్రామాల్లో నిరుపేదలకు సబ్సిడీ ద్వారా ఎర్రవల్లి సభలో 42 మందికి ట్రాక్టర్లను అందజేశారు. సీఎం ఫాంహౌస్ నుంచి 3:10 గంటలకు ఎర్రవల్లికి బయలుదేరారు. ఎర్రవల్లికి రాగానే ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. అలాగే డబుల్బెడ్రూం ఇళ్లను పరిశీలించి పక్కనే ఉన్న జేసీ వెంకట్రాంరెడ్డికి పలు సూచనలు ఇచ్చారు. మొక్కలు నాటుకునేలా రెండు వైపుల ఖాళీ స్థలం ఉండేలా మురికి కాల్వలను నిర్మించాలని అధికారులకు అదేశించారు. అనంతరం ట్రాక్టర్ల పంపిణీ వద్దకు వచ్చి లబ్ధిదారుడు పోచయ్యతో కొబ్బరికాయ కొట్టించారు. సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి డ్రైవర్ సీటులో ఎక్కి ట్రాక్టర్‌ను ఆన్ చేశారు. అనంతరం సభలో పాల్గొని మాట్లాడారు. ఒక్క కుటుంబం కూడా ఖాళీగా ఉండొద్దు... ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఒక్క కుటుంబం కూడా ఖాళీగా ఉండొద్దని అందరూ ఉపాధి పొందాలన్న లక్ష్యంతోనే భూమిలేని నిరుపేదలకు ట్రాక్టర్లు పంపిణీ చేశామని కేసీఆర్ తెలిపారు. డబుల్బెడ్రూం ఇళ్ల చుట్టూ చెట్లను పెంచాలన్నారు. అలాగే ఇంటికి రెండు గేదెలు లేదా ఆవులను అందిస్తామని తద్వారా ఉపాధి పొందవచ్చని చెప్పారు. ఈసారి చేబర్తి చెరువుతోనే సాగు... ఈ ఖరీఫ్‌లో చేబర్తి పెద్ద చెరువు నుంచి బిందుసేద్యం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పాములపర్తి రిజర్వాయర్‌కు గోదావరి నీళ్లు రావాలంటే సుమారు రెండేళ్లు పట్టవచ్చని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో కూడవెళ్లి వాగు నుండి వచ్చే నీళ్లను కుంటలోకి మలుపుకుని సాగుకు నీరు అందించాలన్నారు. అలాగే రైతుల బోర్ల నుండి సంపులోకి నీరు సరఫరా చేసి అక్కడి బిందుసేద్యానికి పంపిణి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాలు కొనాల్సిన అవసరం లేదని, లారీల కొద్ది ఎరువులు ఎర్రవల్లికే వస్తాయన్నారు. పంపుహౌస్‌ల నుంచి పంటలకు నెటాఫిమ్ విధానం ద్వారా ఎరువులు అందించేలా ఏర్పాటు చేశామన్నారు. రెండు గోదాముల నిండా విత్తనాలు, ఎరువులు ఉంటాయన్నారు. రబీలో విత్తనోత్పత్తి ఉంటుందని, ఖరీఫ్‌లో సాధారణ మొక్కజొన్న పంటను సాగు చేసుకుందామన్నారు. చిరునవ్వే శ్రీరామరక్ష... చిరునవ్వు... ప్రేమనురాగాలే ప్రజలకు శ్రీరామరక్ష అని సీఎం అన్నారు. గ్రామంలో ఎవరు కూడా విభేదాలు, కులం మతం లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఎర్రవల్లిని చూసి మిగతా గ్రామాల ప్రజలు నేర్చుకునేలా సంఘటితశక్తిగా ముందుకు పోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, ఎర్రవల్లి సర్పంచ్ భాగ్య, ఎంపీటీసీ భాగ్యమ్మ, ఎంపీపీ ఎర్ర రేణుక, జడ్పీటీసీ ఎంబరి రాంచంద్రం, వీడీసీ చైర్మన్ కిష్టారెడ్డి, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి పాల్గొన్నారు. -
నూతన పద్ధతులతో అధిక దిగుబడి సాధించండి
రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్ వ్యవసాయం : రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రైతులు నూతన పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయితీపై రైతులకు వ్యవసాయ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచం కుగ్రామంగా మారిన పరిస్థిలలో భారతదేశం కూడా వ్యవసాయరంగంలో తగిన పోటీ ఇవ్వాలని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునాతన పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధిస్తుండగా, భారతదేశ రైతులు మాత్రం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సాంకేతిక పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలంపూర్‌లో ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా పారిశ్రామిక రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ యువతకు పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాలు కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం ప్లానింగ్ కమిషన్ వైస్ చెర్మైన్ ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం రానున్న కాలంలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అన్నారు. అనంతరం పార్లమెంటు సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జెడ్పీ చెర్మైన్ బండారి భాస్కర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చెర్మైన్ నవీన్‌కుమార్ రెడ్డి, జేడీఏ ఉష పాల్గొన్నారు.