నూతన పద్ధతులతో అధిక దిగుబడి సాధించండి
రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్‌నగర్ వ్యవసాయం : రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రైతులు నూతన పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయితీపై రైతులకు వ్యవసాయ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రపంచం కుగ్రామంగా మారిన పరిస్థిలలో భారతదేశం కూడా వ్యవసాయరంగంలో తగిన పోటీ ఇవ్వాలని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునాతన పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధిస్తుండగా, భారతదేశ రైతులు మాత్రం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సాంకేతిక పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలంపూర్‌లో ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా పారిశ్రామిక రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ యువతకు పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాలు కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు.
అనంతరం ప్లానింగ్ కమిషన్ వైస్ చెర్మైన్ ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం రానున్న కాలంలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అన్నారు. అనంతరం పార్లమెంటు సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జెడ్పీ చెర్మైన్ బండారి భాస్కర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చెర్మైన్ నవీన్‌కుమార్ రెడ్డి, జేడీఏ ఉష పాల్గొన్నారు.