మీరే ఆదర్శం...
♦ అందరికీ తొవ్వ చూపాలెఅంకాపూర్‌ను మరవాలె
♦ రెండు నెలల్లో కొత్త ఇళ్లకు పోదాం
♦ యాగంజేసి.. పెద్ద పండుగ జేద్దాం
♦ నేనూ మీతోపాటే భోజనం చేస్తా ఊళ్లో అందరికీ ఉపాధి
♦ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు
♦ దత్తత గ్రామం ఎర్రవల్లిలో పర్యటన
♦ 42 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ
గజ్వేల్/జగదేవ్‌పూర్ : ‘మీ వెనుక సర్కారుంది.. తెలంగాణలో మీరు అదృష్టవంతులు. ముందు వరుసలో అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నరు. అన్ని గ్రామాలకు ఆదర్శం గావాలె... అందరికీ తొవ్వ చూపాలె... రెండు నెలల్లోపు యాగం చేసి శ్రావణ మాసంలో ఇళ్లలోకి పోదాం.. రెండేళ్లలో పాములుపర్తి రిజర్వాయర్‌కు గోదావరి నీళ్లు తీసుకువస్తా.. ఎర్రవల్లికి 24 గంటలు నీళ్లే..స్వయం పాలిత, స్వయం సమృద్ధితో పని చేయాలి.. అంకాపూర్‌ను మరిచి ఎర్రవల్లి బాట పట్టాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం తన దత్తత గ్రామమైన ఎర్రవల్లి, నర్సన్నపేటగ్రామాల్లో నిరుపేదలకు సబ్సిడీ ద్వారా ఎర్రవల్లి సభలో 42 మందికి ట్రాక్టర్లను అందజేశారు.
సీఎం ఫాంహౌస్ నుంచి 3:10 గంటలకు ఎర్రవల్లికి బయలుదేరారు. ఎర్రవల్లికి రాగానే ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. అలాగే డబుల్‌బెడ్రూం ఇళ్లను పరిశీలించి పక్కనే ఉన్న జేసీ వెంకట్రాంరెడ్డికి పలు సూచనలు ఇచ్చారు. మొక్కలు నాటుకునేలా రెండు వైపుల ఖాళీ స్థలం ఉండేలా మురికి కాల్వలను నిర్మించాలని అధికారులకు అదేశించారు. అనంతరం ట్రాక్టర్ల పంపిణీ వద్దకు వచ్చి లబ్ధిదారుడు పోచయ్యతో కొబ్బరికాయ కొట్టించారు. సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి డ్రైవర్ సీటులో ఎక్కి ట్రాక్టర్‌ను ఆన్ చేశారు. అనంతరం సభలో పాల్గొని మాట్లాడారు.
ఒక్క కుటుంబం కూడా ఖాళీగా ఉండొద్దు...
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఒక్క కుటుంబం కూడా ఖాళీగా ఉండొద్దని అందరూ ఉపాధి పొందాలన్న లక్ష్యంతోనే భూమిలేని నిరుపేదలకు ట్రాక్టర్లు పంపిణీ చేశామని కేసీఆర్ తెలిపారు. డబుల్‌బెడ్రూం ఇళ్ల చుట్టూ చెట్లను పెంచాలన్నారు. అలాగే ఇంటికి రెండు గేదెలు లేదా ఆవులను అందిస్తామని తద్వారా ఉపాధి పొందవచ్చని చెప్పారు.
ఈసారి చేబర్తి చెరువుతోనే సాగు...
ఈ ఖరీఫ్‌లో చేబర్తి పెద్ద చెరువు నుంచి బిందుసేద్యం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పాములపర్తి రిజర్వాయర్‌కు గోదావరి నీళ్లు రావాలంటే సుమారు రెండేళ్లు పట్టవచ్చని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో కూడవెళ్లి వాగు నుండి వచ్చే నీళ్లను కుంటలోకి మలుపుకుని సాగుకు నీరు అందించాలన్నారు. అలాగే రైతుల బోర్ల నుండి సంపులోకి నీరు సరఫరా చేసి అక్కడి బిందుసేద్యానికి పంపిణి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాలు కొనాల్సిన అవసరం లేదని, లారీల కొద్ది ఎరువులు ఎర్రవల్లికే వస్తాయన్నారు. పంపుహౌస్‌ల నుంచి పంటలకు నెటాఫిమ్ విధానం ద్వారా ఎరువులు అందించేలా ఏర్పాటు చేశామన్నారు. రెండు గోదాముల నిండా విత్తనాలు, ఎరువులు ఉంటాయన్నారు. రబీలో విత్తనోత్పత్తి ఉంటుందని, ఖరీఫ్‌లో సాధారణ మొక్కజొన్న పంటను సాగు చేసుకుందామన్నారు.
చిరునవ్వే శ్రీరామరక్ష...
చిరునవ్వు... ప్రేమనురాగాలే ప్రజలకు శ్రీరామరక్ష అని సీఎం అన్నారు. గ్రామంలో ఎవరు కూడా విభేదాలు, కులం మతం లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఎర్రవల్లిని చూసి మిగతా గ్రామాల ప్రజలు నేర్చుకునేలా సంఘటితశక్తిగా ముందుకు పోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, ఎర్రవల్లి సర్పంచ్ భాగ్య, ఎంపీటీసీ భాగ్యమ్మ, ఎంపీపీ ఎర్ర రేణుక, జడ్పీటీసీ ఎంబరి రాంచంద్రం, వీడీసీ చైర్మన్ కిష్టారెడ్డి, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి పాల్గొన్నారు.