ఆదాయం పెరిగింది | telangana income hiked, says cm kcr | Sakshi
Sakshi News home page

ఆదాయం పెరిగింది

Published Wed, Jun 15 2016 1:47 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ఆదాయం పెరిగింది - Sakshi

ఆదాయం పెరిగింది

  • సుస్థిర ప్రగతి దిశగా రాష్ట్రం ముందడుగు: కేసీఆర్
  •  ఏప్రిల్, మేలలో రాష్ట్ర రెవెన్యూ రూ. 7,687 కోట్లు
  •  గతేడాదితో పోలిస్తే 27.45 శాతం వృద్ధిరేటు నమోదు
  •  120% పెరిగిన ఎక్సైజ్, 64 శాతం పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
  •  10 కీలక శాఖల ఆదాయ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష
  •  

     సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ‘‘గడచిన రెండు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం 27.45 శాతం ఆదాయ వృద్ధిరేటు సాధించింది. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా ఆర్థిక ప్రగతిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మేలతో పోలిస్తే ఈ ఏడాది అద్భుత ప్రగతి కనిపిస్తున్నది’’ అని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వ్యయాలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమీక్షించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే 10 ముఖ్యమైన శాఖల ద్వారా గడిచిన రెండు నెలల్లో వచ్చిన ఆదాయాన్ని ఈ సందర్భంగా సమీక్షించారు.
     

    ఇవీ లెక్కలు...

    2015 ఏప్రిల్, మేలలో కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, ట్రాన్స్‌పోర్ట్, గనులు తదితర శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 6,031 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏప్రిల్, మేలలో రూ. 7,687 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుటితో పోలిస్తే రూ.1,656 కోట్ల ఆదాయం పెరిగింది. ఈ లెక్కన 27.45 శాతం వృద్ధి నమోదైంది. ఇదే రకమైన సుస్థిర ఆదాయ వృద్ధి రేటు కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి స్టేట్ ఓన్ రెవెన్యూ రూ.11,500 కోట్ల మేరకు పెరగనుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. గత రెండు నెలల్లో రాష్ట్రంలో ఓవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతోపాటు మంచి ముహూర్తాలు లేక శుభకార్యాలు జరగకపోయినప్పటికీ ఈ రకమైన ఆర్థిక ప్రగతి సాధించడంపట్ల అధికార వర్గాల్లో సంతృప్తి వ్యక్తమైంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయం గతేడాదితో పోలిస్తే 64 శాతం పెరిగింది. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సదస్సులు, వేడుకలకు వేదికగా ఉండటం, దేశ విదేశాలకు చెందిన వారి బస వల్ల విదేశీ మద్యం భారీగా అమ్ముడుపోవడంతో ఎక్సైజ్ శాఖలో 120 శాతం ఆదాయం పెరిగింది.

     

     లగ్జరీ టాక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రంలో వివిధ సరుకుల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా పెద్ద ఎత్తున జరగడంతో అమ్మకపు పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 17 శాతం పెరిగింది. ఆదాయం తెచ్చిపెట్టే శాఖలన్నిం టా ఇంచుమించుగా ఇదేతీరుగా ఆదాయ వృద్ధిరేటు పెరిగింది. ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక, అవినీతిరహిత పద్ధతులు, వివిధ శాఖల్లో సంస్కరణలు, టీఎస్ ఐపాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం కల్పించిన రాయితీలు తదితర కారణాలతో ఈ రెవెన్యూ ప్రగతి సాధ్యమైంది.

     

     ఇది సానుకూల సంకేతం
    ‘‘నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. దాదాపు ఏడు నెలలపాటు పూర్తిస్థాయి అధికారులు లేకుండా పాలన చేయాల్సి వచ్చింది. మొదటి రెండు బడ్జెట్లు కేవలం అంచనాల ఆధారంగా ప్రవేశపెట్టుకున్నాం. తర్వాత మెల్లగా కోలుకున్నాం. రాజకీయ సుస్థిరత సాధించాం. అనేక విషయాల్లో విధానపరమైన మార్పులు చేసుకున్నాం. పారదర్శకతను పెంపొందించాం. అవినీతిని బాగా తగ్గించగలిగాం. పరిశ్రమల స్థాపన, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాం. శాంతిభద్రతల పరిస్థితినీ మెరుగుపరిచాం. దీంతో తెలంగాణ రాష్ట్రం సుస్థిరత సాధించింది. ఆర్థిక ప్రగతి కూడా సుస్థిరంగా సాగుతున్నది. ఫలితంగానే ఈ ప్రగతి సాధ్యమైంది. ఇదే విధమైన ప్రగతి కొనసాగితే వచ్చే ఏడాది బడ్జెట్ కూడా పెరుగుతుంది. ప్రజలకు ఉపయోగకరమైన మరిన్ని మంచి పనులు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. బంగారు తెలంగాణ సాధనకు ఇది సానుకూల అంశం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement