Telangana income
-
మార్చి ఆదాయం అదుర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ప్రభావం మొదలైన మార్చిలో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలు చెబుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కాగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో అన్ని వనరుల ద్వారా సర్కారుకు రూ. 16,840 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ నెలలో 22వ తేదీ నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించినప్పటికీ దాదాపు రూ. 17 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, ఆ పది రోజులు ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా జరిగి ఉంటే ఆదాయం రూ. 20 వేల కోట్లు దాటేదని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. సగటు కంటే ఎక్కువ... 2019–20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రాబడులు రూ. 1.37 లక్షల కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లెక్కన నెలకు సగటున రూ. 11,500 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరంలో చివరి నెల కాబట్టి సగటుకన్నా కొంత ఎక్కువ వస్తుందని అధికారులు భావించగా ఏకంగా రూ. 16,840 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం మార్చి నెల ఆదాయంలో పన్నుల రూపేణా రూ. 9,117 కోట్లు రాగా, ఇతర వనరుల ద్వారా మరో రూ. 7,500 కోట్లకుపైగా రాబడి వచ్చిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పన్నేతర ఆదాయం రూ. 3,100 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ. 1,000 కోట్లతోపాటు అప్పుల ద్వారా రూ. 3,400 కోట్లు ఖజానాకు సమకూరాయి. రిజిస్ట్రేషన్ల రికార్డు.. గత ఆర్థిక సంవత్సర ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చింది. ఆ ఏడాదిలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 6,146 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా రూ. 500 కోట్లు అదనంగా రూ. 6,671 కోట్లు వచ్చాయి. మద్యం అమ్మకాలు కూడా గతేడాది అంచనాలకు మించి ఆదాయాన్ని తెచ్చి పెట్టాయని కాగ్ వెల్లడించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 10,901 కోట్ల అంచనా ప్రభుత్వానికి ఉండగా వాస్తవ లెక్కలను చూస్తే రూ. 11,991 కోట్లు వచ్చాయి. అమ్మకపు పన్ను ఆదాయం అంచనాలతో పోలిస్తే 94 శాతం రాగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో 89 శాతం రాబడి వచ్చింది. పన్నేతర ఆదాయం అంచనాలో కేవలం 46 శాతమే వచ్చింది. కేంద్ర పన్నుల్లో రావాల్సిన వాటా 80 శాతమే వచ్చింది. కానీ పన్ను ఆదాయం 93 శాతం వసూలు కావడం, రుణాలు అంచనాలకు మించి అందడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఎక్కువ నిధులు సమకూరడంతో మొత్తం రాబడుల అంచనా 96 శాతం నెరవేరింది. -
ఆదాయం పెరిగింది
సుస్థిర ప్రగతి దిశగా రాష్ట్రం ముందడుగు: కేసీఆర్ ఏప్రిల్, మేలలో రాష్ట్ర రెవెన్యూ రూ. 7,687 కోట్లు గతేడాదితో పోలిస్తే 27.45 శాతం వృద్ధిరేటు నమోదు 120% పెరిగిన ఎక్సైజ్, 64 శాతం పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం 10 కీలక శాఖల ఆదాయ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ‘‘గడచిన రెండు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం 27.45 శాతం ఆదాయ వృద్ధిరేటు సాధించింది. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా ఆర్థిక ప్రగతిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మేలతో పోలిస్తే ఈ ఏడాది అద్భుత ప్రగతి కనిపిస్తున్నది’’ అని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వ్యయాలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమీక్షించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే 10 ముఖ్యమైన శాఖల ద్వారా గడిచిన రెండు నెలల్లో వచ్చిన ఆదాయాన్ని ఈ సందర్భంగా సమీక్షించారు. ఇవీ లెక్కలు... 2015 ఏప్రిల్, మేలలో కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, ట్రాన్స్పోర్ట్, గనులు తదితర శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 6,031 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏప్రిల్, మేలలో రూ. 7,687 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుటితో పోలిస్తే రూ.1,656 కోట్ల ఆదాయం పెరిగింది. ఈ లెక్కన 27.45 శాతం వృద్ధి నమోదైంది. ఇదే రకమైన సుస్థిర ఆదాయ వృద్ధి రేటు కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి స్టేట్ ఓన్ రెవెన్యూ రూ.11,500 కోట్ల మేరకు పెరగనుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. గత రెండు నెలల్లో రాష్ట్రంలో ఓవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతోపాటు మంచి ముహూర్తాలు లేక శుభకార్యాలు జరగకపోయినప్పటికీ ఈ రకమైన ఆర్థిక ప్రగతి సాధించడంపట్ల అధికార వర్గాల్లో సంతృప్తి వ్యక్తమైంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయం గతేడాదితో పోలిస్తే 64 శాతం పెరిగింది. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సదస్సులు, వేడుకలకు వేదికగా ఉండటం, దేశ విదేశాలకు చెందిన వారి బస వల్ల విదేశీ మద్యం భారీగా అమ్ముడుపోవడంతో ఎక్సైజ్ శాఖలో 120 శాతం ఆదాయం పెరిగింది. లగ్జరీ టాక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రంలో వివిధ సరుకుల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా పెద్ద ఎత్తున జరగడంతో అమ్మకపు పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 17 శాతం పెరిగింది. ఆదాయం తెచ్చిపెట్టే శాఖలన్నిం టా ఇంచుమించుగా ఇదేతీరుగా ఆదాయ వృద్ధిరేటు పెరిగింది. ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక, అవినీతిరహిత పద్ధతులు, వివిధ శాఖల్లో సంస్కరణలు, టీఎస్ ఐపాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం కల్పించిన రాయితీలు తదితర కారణాలతో ఈ రెవెన్యూ ప్రగతి సాధ్యమైంది. ఇది సానుకూల సంకేతం ‘‘నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. దాదాపు ఏడు నెలలపాటు పూర్తిస్థాయి అధికారులు లేకుండా పాలన చేయాల్సి వచ్చింది. మొదటి రెండు బడ్జెట్లు కేవలం అంచనాల ఆధారంగా ప్రవేశపెట్టుకున్నాం. తర్వాత మెల్లగా కోలుకున్నాం. రాజకీయ సుస్థిరత సాధించాం. అనేక విషయాల్లో విధానపరమైన మార్పులు చేసుకున్నాం. పారదర్శకతను పెంపొందించాం. అవినీతిని బాగా తగ్గించగలిగాం. పరిశ్రమల స్థాపన, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాం. శాంతిభద్రతల పరిస్థితినీ మెరుగుపరిచాం. దీంతో తెలంగాణ రాష్ట్రం సుస్థిరత సాధించింది. ఆర్థిక ప్రగతి కూడా సుస్థిరంగా సాగుతున్నది. ఫలితంగానే ఈ ప్రగతి సాధ్యమైంది. ఇదే విధమైన ప్రగతి కొనసాగితే వచ్చే ఏడాది బడ్జెట్ కూడా పెరుగుతుంది. ప్రజలకు ఉపయోగకరమైన మరిన్ని మంచి పనులు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. బంగారు తెలంగాణ సాధనకు ఇది సానుకూల అంశం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
తెలంగాణ రెవిన్యూ పై ఖుష్
-
తెలంగాణ ఖజానా భేష్
* జూలైలో అంచనాలను మించిన రాష్ర్ట ఆదాయం * పన్ను, పన్నేతర వసూళ్లు రూ. 3822 కోట్లు * వ్యాట్, మద్యం ఆదాయం మెరుగు * పడిపోయిన రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం * రాష్ర్ట విభజన ప్రభావం అంతంతే! సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ ఆదాయంపై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. విభజన తర్వాత ఆదాయం తగ్గుపోతుందన్న వాదనలు తప్పని రుజువయ్యాయి. తెలంగాణ ప్రాంత ఆదాయ వనరుల్లో ఎలాంటి లోటు లేదని తాజాగా తేలింది. జూలై నెలలో ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ నిధులు ఖజానాకు రావడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఇప్పటివరకు తెలంగాణ ఆదాయాన్ని అంచనా వేశారు. అంతేతప్ప ఈ ప్రాంతం నుంచి ఎంత ఆదాయం వస్తుందన్న కచ్చితమైన లెక్కలు లేవు. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది. అన్ని రకాల పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జూలైలో తెలంగాణకు వచ్చిన ఆదాయాన్ని అధికారులు నిర్ధారించారు. రాష్ర్ట ఆదాయం ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉన్నట్లు తేల్చారు. ఈ ఒక్క నెల ఆదాయం రూ. 3822 కోట్లుగా తేలింది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఎంత ఆదాయం వస్తుందో అర్థంకాక అధికారులు మొదట్లో హైరానా పడ్డారు. రాష్ర్ట విభజన తర్వాత నిత్యం ఖజానాకు జమ అవుతున్న ఆదాయంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ వచ్చారు. తాజాగా వచ్చిన అధికారిక లెక్కలతో స్పష్టత వచ్చింది. వ్యాట్, ఎక్సైజ్ ఆదాయం బాగానే ఉన్నా.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం ఆశించిన మేరకు రాలేదని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి ఆధారం కావడంతో.. ఈ రెండు జిల్లాలపై అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్ శివార్లలో ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగని కారణంగా.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెద్దగా లేనట్లు సమాచారం. అదీకాక గత నెలలో బిల్డర్లు సిమెంట్ కొనుగోళ్లు ఆపేయడంతో నిర్మాణ రంగంలో పనులు మందగించాయి. దీంతో గృహ నిర్మాణ రంగంలో ఆశించిన పురోగతి లేదు. అయితే మొత్తంగా మాత్రం కొత్త రాష్ర్ట ఆదాయం సంతృప్తికరంగానే ఉన్నట్లు సమాచారం. జూన్‌లో వచ్చిన ఆదాయంతో పోల్చినా జూలైలో ఆదాయం పెరిగినట్లు ఓ అధికారి వివరించారు.