మార్చి ఆదాయం అదుర్స్‌  | Telangana Government Income Is Record Of March Month | Sakshi
Sakshi News home page

మార్చి ఆదాయం అదుర్స్‌ 

Published Sat, Jul 11 2020 3:00 AM | Last Updated on Sat, Jul 11 2020 3:00 AM

Telangana Government Income Is Record Of March Month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ప్రభావం మొదలైన మార్చిలో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) లెక్కలు చెబుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో అన్ని వనరుల ద్వారా సర్కారుకు రూ. 16,840 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ నెలలో 22వ తేదీ నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించినప్పటికీ దాదాపు రూ. 17 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, ఆ పది రోజులు ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా జరిగి ఉంటే ఆదాయం రూ. 20 వేల కోట్లు దాటేదని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.  

సగటు కంటే ఎక్కువ... 
2019–20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రాబడులు రూ. 1.37 లక్షల కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లెక్కన నెలకు సగటున రూ. 11,500 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరంలో చివరి నెల కాబట్టి సగటుకన్నా కొంత ఎక్కువ వస్తుందని అధికారులు భావించగా ఏకంగా రూ. 16,840 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం మార్చి నెల ఆదాయంలో పన్నుల రూపేణా రూ. 9,117 కోట్లు రాగా, ఇతర వనరుల ద్వారా మరో రూ. 7,500 కోట్లకుపైగా రాబడి వచ్చిందని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పన్నేతర ఆదాయం రూ. 3,100 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ. 1,000 కోట్లతోపాటు అప్పుల ద్వారా రూ. 3,400 కోట్లు ఖజానాకు సమకూరాయి.
రిజిస్ట్రేషన్ల రికార్డు.. 
గత ఆర్థిక సంవత్సర ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చింది. ఆ ఏడాదిలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 6,146 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా రూ. 500 కోట్లు అదనంగా రూ. 6,671 కోట్లు వచ్చాయి. మద్యం అమ్మకాలు కూడా గతేడాది అంచనాలకు మించి ఆదాయాన్ని తెచ్చి పెట్టాయని కాగ్‌ వెల్లడించింది.

ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ. 10,901 కోట్ల అంచనా ప్రభుత్వానికి ఉండగా వాస్తవ లెక్కలను చూస్తే రూ. 11,991 కోట్లు వచ్చాయి. అమ్మకపు పన్ను ఆదాయం అంచనాలతో పోలిస్తే 94 శాతం రాగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో 89 శాతం రాబడి వచ్చింది. పన్నేతర ఆదాయం అంచనాలో కేవలం 46 శాతమే వచ్చింది. కేంద్ర పన్నుల్లో రావాల్సిన వాటా 80 శాతమే వచ్చింది. కానీ పన్ను ఆదాయం 93 శాతం వసూలు కావడం, రుణాలు అంచనాలకు మించి అందడం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో ఎక్కువ నిధులు సమకూరడంతో మొత్తం రాబడుల అంచనా 96 శాతం నెరవేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement