తెలంగాణ ఖజానా భేష్
* జూలైలో అంచనాలను మించిన రాష్ర్ట ఆదాయం
* పన్ను, పన్నేతర వసూళ్లు రూ. 3822 కోట్లు
* వ్యాట్, మద్యం ఆదాయం మెరుగు
* పడిపోయిన రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం
* రాష్ర్ట విభజన ప్రభావం అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ ఆదాయంపై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. విభజన తర్వాత ఆదాయం తగ్గుపోతుందన్న వాదనలు తప్పని రుజువయ్యాయి. తెలంగాణ ప్రాంత ఆదాయ వనరుల్లో ఎలాంటి లోటు లేదని తాజాగా తేలింది. జూలై నెలలో ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ నిధులు ఖజానాకు రావడమే ఇందుకు నిదర్శనం.
ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఇప్పటివరకు తెలంగాణ ఆదాయాన్ని అంచనా వేశారు. అంతేతప్ప ఈ ప్రాంతం నుంచి ఎంత ఆదాయం వస్తుందన్న కచ్చితమైన లెక్కలు లేవు. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది. అన్ని రకాల పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జూలైలో తెలంగాణకు వచ్చిన ఆదాయాన్ని అధికారులు నిర్ధారించారు. రాష్ర్ట ఆదాయం ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉన్నట్లు తేల్చారు.
ఈ ఒక్క నెల ఆదాయం రూ. 3822 కోట్లుగా తేలింది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఎంత ఆదాయం వస్తుందో అర్థంకాక అధికారులు మొదట్లో హైరానా పడ్డారు. రాష్ర్ట విభజన తర్వాత నిత్యం ఖజానాకు జమ అవుతున్న ఆదాయంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ వచ్చారు. తాజాగా వచ్చిన అధికారిక లెక్కలతో స్పష్టత వచ్చింది. వ్యాట్, ఎక్సైజ్ ఆదాయం బాగానే ఉన్నా.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం ఆశించిన మేరకు రాలేదని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి ఆధారం కావడంతో.. ఈ రెండు జిల్లాలపై అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టారు.
రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్ శివార్లలో ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగని కారణంగా.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెద్దగా లేనట్లు సమాచారం. అదీకాక గత నెలలో బిల్డర్లు సిమెంట్ కొనుగోళ్లు ఆపేయడంతో నిర్మాణ రంగంలో పనులు మందగించాయి. దీంతో గృహ నిర్మాణ రంగంలో ఆశించిన పురోగతి లేదు. అయితే మొత్తంగా మాత్రం కొత్త రాష్ర్ట ఆదాయం సంతృప్తికరంగానే ఉన్నట్లు సమాచారం. జూన్‌లో వచ్చిన ఆదాయంతో పోల్చినా జూలైలో ఆదాయం పెరిగినట్లు ఓ అధికారి వివరించారు.