Excise Income
-
ఆ రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలల రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పీఆర్సీతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే ఆదాయాన్ని బట్టి 2021–22 బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇప్పటివరకు 2020–21 బడ్జెట్లో అప్పులు, ఆదాయం మొత్తం కలిపి రూ.1.04 లక్షల కోట్లు ఖజానాకు చేరగా, జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ఆదాయం నిలకడగా వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల వరకు చేరవచ్చని ఆ శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. మరికొంత మొత్తం అప్పుల రూపంలో సమకూరినప్పటికీ 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను రూ.1.83 లక్షల కోట్ల నుంచి రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించాల్సి ఉంటుందని వారంటున్నారు. అంచనాలు తలకిందులు కరోనా కొట్టిన దెబ్బతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అంచనాలు తలకిందులయ్యాయి. అంతా సవ్యంగా ఉంటే మరో రూ.30 వేల కోట్ల వరకు సొంత పన్నుల ఆదాయం పెరిగేది. ఈ పరపతి భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఉపయోగపడేది. కానీ, కరోనా కాటుతో కీలక రంగాలు దెబ్బ తినడం, ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థిక ఆశలు ఆవిరి అయ్యాయి. అయితే గత ఆరు నెలలుగా (జూలై, 2020 నుంచి) వస్తుసేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్ ఆదాయం నిలకడగా ఉండడం, ఈ రెండూ కలిపి సగటున రూ.4,000 కోట్ల వరకు ఆదాయం వస్తుండడంతో కొంత మేర ప్రభుత్వ ఖజానా ఊపిరి పీల్చుకుంది. వీటికి తోడు గత రెండు నెలలుగా స్టాంపు, రిజిస్ట్రేషన్ల గల్లా కూడా కళకళలాడుతోంది. డిసెంబర్లో రూ.661 కోట్లు, జనవరిలో రూ.800 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరాయి. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.2 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ మూడు శాఖల ద్వారా నెలకు సగటున రూ.5వేల కోట్ల చొప్పున రూ.15 వేల కోట్ల వరకు వస్తాయని ఆ శాఖ లెక్కలు కడుతోంది. సగటున రూ.10 వేల కోట్ల రాబడి గత 3 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ రాబడులను పరిశీ లిస్తే సగటున నెలకు రూ.10 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతోంది. అక్టోబర్‌లో రూ.10,178 కోట్లు, నవంబర్‌లో రూ.10,239 కోట్లు, డిసెంబర్లో రూ.20,103 కోట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్లో సొంత పన్నులు, కేంద్ర సాయం, ఇతర ఆదాయాలు కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఉండగా, మరో రూ.10 వేల కోట్లు అప్పులు కింద సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సగటున రూ.10 వేల కోట్లు చొప్పున మూడు నెలల్లో రూ.30 వేల కోట్ల వరకు వస్తాయని, అప్పులు ఇంకో రూ.7–8 వేల కోట్ల వరకు తెచ్చుకున్నా, అంతా కలిపి రూ.1.45 లక్షల కోట్ల వరకు బడ్జెట్ చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు గడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2020–21 వార్షిక బడ్జెట్‌ను రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే నెలలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ జనవరి, ఫిబ్రవరి రాబడులను బట్టి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలైన జీఎస్టీ, ఎక్సైజ్ ఆదాయాలు నెలల వారీగా..(రూ.కోట్లలో) (మొత్తం వార్షిక బడ్జెట్ అంచనాల్లో డిసెంబర్ నెలాఖరు వరకు జీఎస్టీ 53.7% రాగా, ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం 65.27 శాతానికి చేరింది) -
గణనీయంగా తగ్గనున్న రాష్ట్ర ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గనుంది. కరోనా అనంతర పరిస్థితుల్లో వార్షిక ఆర్థిక అం చనాల్లో భారీ లోటు కనపడేటట్లుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల ఆదాయాలు, అప్పులు, కేంద్ర ప్రభుత్వ సాయాల ద్వారా రూ.1.76 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ అంచనా కాగా, అందులో డిసెంబర్ నాటికి 59% రాబడి సమ కూరింది. డిసెంబర్–2020 నాటికి అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.1,04,311.04 కోట్లు వచ్చినట్టు ‘కాగ్’కు రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా సమ ర్పించిన నివేదికలో వెల్లడిం చింది. ఇందులో అన్ని రకాల పన్ను ఆదాయం రూ. 67,149 కోట్లు కాగా, అప్పుల కింద మరో రూ. 37 వేల కోట్లు సమకూర్చు కున్నట్టు వెల్లడించింది. ఇలా ఖజానా లెక్క ఎట్టకేలకు రూ.లక్ష కోట్లు దాటింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలో ఇది 59% కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి బడ్జెట్ అంచనాలో 67% సమకూరింది. అంటే దాదాపు 8% ఈసారి లోటు అన్నమాట. కొన్ని తగ్గినా... కొన్ని పుంజుకుని వాస్తవానికి, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరోనా మహమ్మారి చేసిన దాడితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. పూర్తిస్థాయిలో ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో బాండ్ల అమ్మకాలు, అప్పుల ద్వారా నెట్టుకు రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చాలా పకడ్బందీగా వ్యవహరించిన ఆర్థిక శాఖ రాష్ట్ర మనుగడకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లింది. అయితే, క్రమేపీ పరిస్థితుల్లో వస్తున్న మార్పు కారణంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్ రాబ డుల్లో పురోగతి కనిపిం చింది. ఈ ఏడాది జీఎస్టీ ద్వారా 32,671 కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, డిసెంబర్ ముగిసే నాటికి దాదాపు 53.5 శాతం అంటే రూ. 17,553 కోట్లు వచ్చింది. ఎౖMð్సజ్ రాబడుల ద్వారా రూ.16 వేల కోట్లు వస్తాయనుకుంటే... రూ.10,443 కోట్లు వచ్చింది. పన్నేతర రాబడులు తల్లకిందులు... అయితే, కేంద్ర పన్నుల్లో వాటా ప్రభుత్వం ఆశించిన మేర రావడం లేదని డిసెంబర్ నివేదిక వెల్లడిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,906 కోట్లు వస్తాయని అనుకున్నా మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటివరకు కేంద్ర పన్నుల వాటా కింద రూ.5వేల కోట్ల పైచిలుకు మాత్రమే వచ్చాయి. అదే విధంగా పన్నేతర రాబడులు కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వ అంచనాను తల్లకిందులు చేశాయి. పన్నేతర రాబడుల ద్వారా రూ.30,600 కోట్లు వస్తాయన్నది ప్రభుత్వ అంచనా కాగా, అందులో కేవలం 8.23 శాతం అంటే రూ.2,519.48 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద పన్నుల రాబడి అంచనా 1.43 లక్షల కోట్లలో 47 శాతం... అంటే రూ.67,149 కోట్లు సమకూరాయని ఆర్థిక శాఖ లెక్కలు చెపుతున్నాయి. అయితే, గత ఏడాది బడ్జెట్ అంచనాల్లో ఇదే సమయానికి 63 శాతం పన్ను రాబడి వచ్చిందని, ఈ లెక్కన చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడిలో రూ.22 వేల కోట్ల వరకు తగ్గుదల కనిపిస్తోందని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అప్పు పెరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడులు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పుల మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది రూ.33 వేల కోట్ల పైచిలుకు రుణాల ద్వారా తెచ్చుకోవాలనుకున్నా ఇప్పటికే అప్పు పద్దు రూ.37 వేల కోట్లు దాటింది. నవంబరు నెలలో రూపాయి అప్పు తీసుకోకపోయినా, డిసెంబర్లో మాత్రం మరో రూ.10వేల కోట్ల వరకు రుణం చేయాల్సి వచ్చింది. మొత్తం మీద గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే రూ.16వేల కోట్ల వరకు అప్పు ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగానే అప్పులు తెస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నా కరోనా కొట్టిన దెబ్బకు ఖజానా మరింత ఇరకాటంలో పడినట్టేనని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది అప్పులకు వడ్డీల కింద రూ. 11,489 కోట్లు చెల్లించడం గమనార్హం. ఇక, కేంద్ర సాయం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ లెక్క మాత్రం ఈసారి ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఈ పద్దు కింద ఏడాదిలో రూ. 10,525 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఇప్పటికే అంతకంటే ఎక్కువగా రూ. 12,018 కోట్లు రావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అప్పులు నెలల వారీగా: నెల తీసుకున్న అప్పు (రూ.కోట్లలో) ఏప్రిల్ 5,709.23 మే 7,642.79 జూన్ 4,318.43 జూలై 3,113.39 ఆగస్టు 3,935.19 సెప్టెంబర్ 1,270.40 అక్టోబర్ 1,629.61 నవంబర్ –398.63 డిసెంబర్ 9,897.04 –––––––––––––––––––––––––––– మొత్తం 37,117.45 –––––––––––––––––––––––––––– -
అంచనాల మేరకే ఆబ్కారీ ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ప్రధానమైన ఎక్సైజ్‌శాఖ ఈ ఏడాది లక్ష్యానికి చేరువలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో గత ఏడాది కన్నా 12 శాతం అదనపు ఆదాయం సాధించింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు తెలంగాణ పదిజిల్లాల నుంచి వచ్చిన ఆదాయంతో పోల్చితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా అంతే ఆదాయం వస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం గత నెల 20 నుంచి ఈ నెల మొదటి వారం వ రకు పది జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించారు. లెసైన్స్ ఫీజు, ఎక్సైజ్ డ్యూటీల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో పాటు నెలానెలా లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు. దీంతో ఐదునెలల్లో అంచనాను మించి 11వేల కోట్లకు పైగా ఆదాయం ఎక్సైజ్‌శాఖకు సమకూరే అవకాశం ఉంది. గతేడాదికన్నా 12 శాతం దాటిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయ గణాంకాల ప్రకారం 12 శాతం మేర వృద్ధిరేటు కనిపిస్తోంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ. 4,948.11 కోట్లు కాగా, అందుకున్న లక్ష్యం రూ. 5,195 కోట్లు. అంటే ఆరునెలల్లో వృద్ధిరేటు 12 శాతం. అక్టోబర్ నెలకు సంబంధించి లెక్కలు కూడా కలుపుకుంటే ఈ లక్ష్యం మరింత ఎక్కువేనని చెప్పుకోవచ్చు. ముఖ్యాంశాలు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖకు 5,612.70 కోట్లు సమకూరాయి. అక్టోబర్ ఒక్కనెలలోనే రూ. 1,016 కోట్లు ఎక్సైజ్‌శాఖ ఆర్జించింది. గత ఏడాది సమకూరిన ఆదాయం రూ. 9,911.98 కోట్లు. దీనికి 10శాతం అదనంగా ఈ ఏడాది రూ. 10,700 కోట్ల వరకు సమకూర్చుకోవాలని ఎక్సైజ్ శాఖ ఆశిస్తోంది. గత నెలలో ఎక్సైజ్ శాఖకు లెసైన్స్‌ఫీజుల రూపంలో వచ్చిన మొత్తమే రూ. 321.20 కోట్లు. ఇక ఎక్సైజ్ డ్యూటీ, ప్రివిలేజ్ టాక్స్, వ్యాట్, ఇతర పన్నుల ద్వారా సుమారు రూ. 695 కోట్లు సమకూరింది. -
ఏపీ ఆదాయానికి ఢోకా లేదు
-
తెలంగాణ రెవిన్యూ పై ఖుష్
-
తెలంగాణ ఖజానా భేష్
* జూలైలో అంచనాలను మించిన రాష్ర్ట ఆదాయం * పన్ను, పన్నేతర వసూళ్లు రూ. 3822 కోట్లు * వ్యాట్, మద్యం ఆదాయం మెరుగు * పడిపోయిన రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం * రాష్ర్ట విభజన ప్రభావం అంతంతే! సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ ఆదాయంపై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. విభజన తర్వాత ఆదాయం తగ్గుపోతుందన్న వాదనలు తప్పని రుజువయ్యాయి. తెలంగాణ ప్రాంత ఆదాయ వనరుల్లో ఎలాంటి లోటు లేదని తాజాగా తేలింది. జూలై నెలలో ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ నిధులు ఖజానాకు రావడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఇప్పటివరకు తెలంగాణ ఆదాయాన్ని అంచనా వేశారు. అంతేతప్ప ఈ ప్రాంతం నుంచి ఎంత ఆదాయం వస్తుందన్న కచ్చితమైన లెక్కలు లేవు. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది. అన్ని రకాల పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జూలైలో తెలంగాణకు వచ్చిన ఆదాయాన్ని అధికారులు నిర్ధారించారు. రాష్ర్ట ఆదాయం ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉన్నట్లు తేల్చారు. ఈ ఒక్క నెల ఆదాయం రూ. 3822 కోట్లుగా తేలింది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఎంత ఆదాయం వస్తుందో అర్థంకాక అధికారులు మొదట్లో హైరానా పడ్డారు. రాష్ర్ట విభజన తర్వాత నిత్యం ఖజానాకు జమ అవుతున్న ఆదాయంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ వచ్చారు. తాజాగా వచ్చిన అధికారిక లెక్కలతో స్పష్టత వచ్చింది. వ్యాట్, ఎక్సైజ్ ఆదాయం బాగానే ఉన్నా.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం ఆశించిన మేరకు రాలేదని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి ఆధారం కావడంతో.. ఈ రెండు జిల్లాలపై అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్ శివార్లలో ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగని కారణంగా.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెద్దగా లేనట్లు సమాచారం. అదీకాక గత నెలలో బిల్డర్లు సిమెంట్ కొనుగోళ్లు ఆపేయడంతో నిర్మాణ రంగంలో పనులు మందగించాయి. దీంతో గృహ నిర్మాణ రంగంలో ఆశించిన పురోగతి లేదు. అయితే మొత్తంగా మాత్రం కొత్త రాష్ర్ట ఆదాయం సంతృప్తికరంగానే ఉన్నట్లు సమాచారం. జూన్‌లో వచ్చిన ఆదాయంతో పోల్చినా జూలైలో ఆదాయం పెరిగినట్లు ఓ అధికారి వివరించారు. -
ఏపీ ఆదాయానికి ఢోకా లేదు
* రాష్ట్రం విడిపోయాక జూలై నెలలో రూ. 5,480 కోట్లు ఆదాయం * రెండు నెలలు జీతం ఇచ్చినా లోటు రూ.124 కోట్లకే పరిమితం * రాష్ట్ర పన్ను, కేంద్ర పన్నుల వాటా వనరులు బాగానే వచ్చాయి * వ్యాట్, మద్యం ఆదాయం అదిరింది * పైసా అప్పు కూడా చేయలేదు.. భయపడాల్సిన పరిస్థితి లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ వనరులు తగ్గిపోతాయన్న అంచనాలు నిజం కాదని తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి ఢోకా లేదని తేటతెల్లమైంది. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల వాటా ద్వారా వచ్చిన ఆదాయం మెరుగ్గా ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ముందుగా ఆందోళన చెందినట్లుగా పరిస్థితి లేదని, జూలై నెలలో ఆదాయం బాగా వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జూలై నెలలో రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర, కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.5,480 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు వ్యాట్ ఆదాయం 45 శాతమే వస్తుందని అంచనా వేయగా, 47 శాతం వచ్చింది. కొత్త మద్యం లెసైన్సుల విధానం కారణంగా మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా జూలై నెలలో బాగా పెరిగింది. మోటారు వాహనాల పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంది. కేంద్ర పన్నుల వాటా నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ. 1,960 కోట్లు వచ్చేవి. రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర పన్నుల వాటా నుంచి జూలై నెలలో రూ. 1,200 కోట్లు వచ్చింది. రాష్ట్రం విడిపోయి రెండు నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు పైసా కూడా అప్పు చేయలేదు. జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు నెలల జీతాలు, పింఛన్ల కింద రూ.5,800 కోట్లు చెల్లించింది. అయినా ఇతర లావాదేవీలన్నీ సరిచూసిన తరువాత జూలై నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును 124 కోట్ల రూపాయలకే ఆర్థిక శాఖ పరిమితం చేయగలిగింది.