గణనీయంగా తగ్గనున్న రాష్ట్ర ఆదాయం | Telangana State Revenue Will Drop Significantly During This Time | Sakshi
Sakshi News home page

గణనీయంగా తగ్గనున్న రాష్ట్ర ఆదాయం

Published Sat, Jan 30 2021 1:10 AM | Last Updated on Sat, Jan 30 2021 2:59 AM

Telangana State Revenue Will Drop Significantly During This Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గనుంది. కరోనా అనంతర పరిస్థితుల్లో వార్షిక ఆర్థిక అం చనాల్లో భారీ లోటు కనపడేటట్లుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల ఆదాయాలు, అప్పులు, కేంద్ర ప్రభుత్వ సాయాల ద్వారా రూ.1.76 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ అంచనా కాగా, అందులో డిసెంబర్‌ నాటికి 59% రాబడి సమ కూరింది. డిసెంబర్‌–2020 నాటికి అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.1,04,311.04 కోట్లు వచ్చినట్టు ‘కాగ్‌’కు రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా సమ ర్పించిన నివేదికలో వెల్లడిం చింది. ఇందులో అన్ని రకాల పన్ను ఆదాయం రూ. 67,149 కోట్లు కాగా, అప్పుల కింద మరో రూ. 37 వేల కోట్లు సమకూర్చు కున్నట్టు వెల్లడించింది. ఇలా ఖజానా లెక్క ఎట్టకేలకు రూ.లక్ష కోట్లు దాటింది. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాలో ఇది 59% కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి బడ్జెట్‌ అంచనాలో 67% సమకూరింది. అంటే దాదాపు 8% ఈసారి లోటు అన్నమాట. 

కొన్ని తగ్గినా... కొన్ని పుంజుకుని
వాస్తవానికి, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరోనా మహమ్మారి చేసిన దాడితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. పూర్తిస్థాయిలో ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో బాండ్ల అమ్మకాలు, అప్పుల ద్వారా నెట్టుకు రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చాలా పకడ్బందీగా వ్యవహరించిన ఆర్థిక శాఖ రాష్ట్ర మనుగడకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లింది. అయితే, క్రమేపీ పరిస్థితుల్లో వస్తున్న మార్పు కారణంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్‌ రాబ డుల్లో పురోగతి కనిపిం చింది. ఈ ఏడాది జీఎస్టీ ద్వారా 32,671 కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, డిసెంబర్‌ ముగిసే నాటికి దాదాపు 53.5 శాతం అంటే రూ. 17,553 కోట్లు వచ్చింది. ఎౖMð్సజ్‌ రాబడుల ద్వారా రూ.16 వేల కోట్లు వస్తాయనుకుంటే... రూ.10,443 కోట్లు వచ్చింది.

పన్నేతర రాబడులు తల్లకిందులు...
అయితే, కేంద్ర పన్నుల్లో వాటా ప్రభుత్వం ఆశించిన మేర రావడం లేదని డిసెంబర్‌ నివేదిక వెల్లడిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,906 కోట్లు వస్తాయని అనుకున్నా మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటివరకు కేంద్ర పన్నుల వాటా కింద రూ.5వేల కోట్ల పైచిలుకు మాత్రమే వచ్చాయి. అదే విధంగా పన్నేతర రాబడులు కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వ అంచనాను తల్లకిందులు చేశాయి. పన్నేతర రాబడుల ద్వారా రూ.30,600 కోట్లు వస్తాయన్నది ప్రభుత్వ అంచనా కాగా, అందులో కేవలం 8.23 శాతం అంటే రూ.2,519.48 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద పన్నుల రాబడి అంచనా 1.43 లక్షల కోట్లలో 47 శాతం... అంటే రూ.67,149 కోట్లు సమకూరాయని ఆర్థిక శాఖ లెక్కలు చెపుతున్నాయి. అయితే, గత ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో ఇదే సమయానికి 63 శాతం పన్ను రాబడి వచ్చిందని, ఈ లెక్కన చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడిలో రూ.22 వేల కోట్ల వరకు తగ్గుదల కనిపిస్తోందని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. 

అప్పు పెరుగుతోంది
రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడులు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పుల మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది రూ.33 వేల కోట్ల పైచిలుకు రుణాల ద్వారా తెచ్చుకోవాలనుకున్నా ఇప్పటికే అప్పు పద్దు రూ.37 వేల కోట్లు దాటింది. నవంబరు నెలలో రూపాయి అప్పు తీసుకోకపోయినా, డిసెంబర్‌లో మాత్రం మరో రూ.10వేల కోట్ల వరకు రుణం చేయాల్సి వచ్చింది. మొత్తం మీద గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే రూ.16వేల కోట్ల వరకు అప్పు ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు అనుగుణంగానే అప్పులు తెస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నా కరోనా కొట్టిన దెబ్బకు ఖజానా మరింత ఇరకాటంలో పడినట్టేనని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది అప్పులకు వడ్డీల కింద రూ. 11,489 కోట్లు చెల్లించడం గమనార్హం. ఇక, కేంద్ర సాయం కింద గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ లెక్క మాత్రం ఈసారి ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఈ పద్దు కింద ఏడాదిలో రూ. 10,525 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఇప్పటికే అంతకంటే ఎక్కువగా రూ. 12,018 కోట్లు రావడం గమనార్హం. 
ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అప్పులు నెలల వారీగా:
నెల            తీసుకున్న అప్పు (రూ.కోట్లలో)
ఏప్రిల్‌            5,709.23
మే                7,642.79
జూన్‌            4,318.43
జూలై            3,113.39
ఆగస్టు            3,935.19
సెప్టెంబర్‌            1,270.40
అక్టోబర్‌            1,629.61
నవంబర్‌            –398.63
డిసెంబర్‌            9,897.04
––––––––––––––––––––––––––––
మొత్తం            37,117.45
––––––––––––––––––––––––––––

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement