సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు కుదేలైన రాష్ట్ర రాబడులు నెమ్మదిగా యథాతథ స్థితికి వస్తున్నాయి. కొత్త అప్పు చేయకుండానే రాష్ట్రం నవంబర్ మాసాన్ని నెట్టుకురాగలిగింది. ఇది ఊరటనిచ్చే అంశం. కరోనా మహమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలతో... 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడది మారిందని నవంబర్ నెల రాష్ట్ర ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: (1,950కోట్లు ఇవ్వండి)
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో రూపాయి కూడా అప్పు చేయలేదు. పైగా 398.63 కోట్ల రూపాయల అప్పును కూడా తీర్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరులు గత మూడు మాసాలుగా నిలకడగా వస్తుండటం, ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 3,784 కోట్లు రావడంతో నవంబర్‌లో అప్పు పద్దుకు వెళ్లాల్సిన అవసరం రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు.
నిలకడగా ఆదాయం...
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే మొదలైన కరోనా కష్టాల నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టేనని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ మాసంలో కూడా పన్నుల రాబడి కింద రూ. 6,374 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి. గత ఐదునెలలుగా రూ.6 వేల కోట్లు దాటుతున్న పన్ను ఆదాయం నవంబర్‌లో కూడా అదే స్థాయిలో రావడం గమనార్హం. ఇందులో జీఎస్టీ కింద నవంబర్ నెలలో రూ.2,360 కోట్లు సమకూరాయి. దీంతో వార్షిక బడ్జెట్ అంచనాల్లో జీఎస్టీ రాబడులు నవంబర్ నాటికి రూ. 15,247 కోట్లకు చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం నామమాత్రంగానే వచ్చిందని నవంబర్ కాగ్ లెక్కలు చెబుతున్నాయి.
ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.1,000 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,027 కోట్లు ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఈసారి కేంద్ర పన్నుల్లో వాటా పెద్దగా రాలేదు కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 3,784 కోట్లు వచ్చాయి. మొత్తం మీద రెవెన్యూ రాబడులు ఈ ఏడాది రూ.1.43 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయగా, నవంబర్ నాటికి రూ.56,948 కోట్లు వచ్చింది. మొత్తం అంచనాలో ఇది 39.82 శాతం మాత్రమే. ఇక, మొత్తం రాబడుల అంచనా రూ.1.76 లక్షల కోట్లు కాగా నవంబర్ నాటికి రూ.84,702 కోట్లు (47.74 శాతం) వచ్చింది. ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో మొత్తం రెవెన్యూ రాబడులు 70–75 శాతం మించే అవకాశం లేదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. చదవండి: (అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు)
ఖర్చు కూడా పెరిగింది
నవంబర్ మాసంలో ఆదాయంతో పాటు ఖర్చు కూడా పెరిగిందని కాగ్ గణాంకాలు చెపుతున్నాయి. రెవెన్యూ పద్దు కింద ఈ ఏడాదిలో నవంబర్ నెలలో అతి తక్కువగా రూ. 2,045 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబరులో ఉద్యోగుల వేతనాల కింద రూ. 2,558 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదే విధంగా పింఛన్ల కోసం కూడా ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబరులో రూ. 1,213 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. సబ్సిడీల కింద కూడా రూ. 1,400 కోట్ల వ్యయం జరిగింది. మొత్తం మీద నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.78,003 కోట్లు ఖర్చు పెట్టిందని కాగ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment