నా వయసు 58! | Coronavirus Effect On New Pensioners In Telangana | Sakshi
Sakshi News home page

నా వయసు 58!

Sep 14 2020 4:05 AM | Updated on Sep 14 2020 4:05 AM

Coronavirus Effect On New Pensioners In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసహాయులైన పేదలపై కరోనా పంజా విసిరింది. ప్రభుత్వ చేయూత కోసం మరి కొన్నాళ్లు ఎదురుచూసేలా చేసింది. పేదరికంలో మగ్గుతున్న పండుటాకులను ఆదుకునేందుకు గత ఏప్రిల్‌ నుంచి మరింత మంది వృద్ధులకు ‘ఆసరా’పింఛన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బడ్జెట్‌లోనూ అదనపు నిధులు కేటాయించింది. అయితే, ఊహించనివిధంగా కరోనా మహమ్మారి పడగలు విప్పడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ వల్ల రాబడులు తగ్గిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. దీంతో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకు పడింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు లాక్‌డౌన్‌ కొనసాగడంతో కొత్త పింఛన్ల పంపిణీ అటకెక్కింది. ప్రజాజీవనం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నా.. ఆర్థికంగా కోలుకోవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

6.62 లక్షల మంది ఎదురు చూపులు 
నిరుపేదలకు అండగా నిలుస్తున్న ప్రభు త్వం.. ప్రస్తుతం 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఆసరా పింఛన్లను అందజేస్తోంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న 12.21 లక్షల వృద్ధాప్య పింఛన్లకు అదనంగా మరో 6.62 లక్షల వృద్ధాప్య పింఛన్లు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. తొలుత గతేడాది నుంచే దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇదివరకే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హుల జాబితాను తయారు చేసింది. అయితే, ప్రస్తుతం ఇందులో కొందరు మరణించి ఉంటారని భావిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ.. తాజాగా మరోసారి వివరాలను పరిశీలించాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం గ్రామాలవారీగా ఓటర్ల జాబితాను సేకరించి.. అందులో 57 ఏళ్లు పైబడిన ఓటర్ల వివరాల లెక్క తీసింది. అయితే, కేవలం ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకోకుండా.. క్షేత్రస్థాయిలో శిబిరాలు నిర్వహించి వయసును నిర్ధారించాలని నిర్ణయించింది. ఆధార్, ఓటర్‌ ఐడీల ఆధారంగా అర్హుల జాబితాను స్క్రీనింగ్‌ చేయాలని భావించింది. ఇంతలోనే కరోనా వైరస్‌ విశ్వరూపం చూపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో కొత్త పింఛన్ల మాట అటు ఉంచి..ఉన్నవారికి నెలవారీగా సక్రమంగా చెల్లిస్తే చాలనే పరిస్థితి తలెత్తింది. 

అదనంగా నెలకు రూ.133.45 కోట్ల భారం 
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లకు ప్రభు త్వం 2019–20లో రూ.9,402 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక సంవత్సరానికి రూ.11,758 కోట్లకు పెంచింది. అయితే, పెంచిన రూ.2,356 కోట్లు ఈసారి అదనంగా పెరిగే వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, కొత్తగా పెరిగే 6.62 లక్షల వృద్ధాప్య పింఛన్లతో నెలకు రూ.133.45 కోట్ల మేర అదనపు భారం పడనుందని అంచనా వేసింది. 

రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లు 
వృద్ధాప్య: 12,21,887
వికలాంగులు: 4,91,892 
హెచ్‌ఐవీ బాధితులు: 32,627
వితంతువులు: 14,31,585 
బోదకాలు బాధితులు: 14,901  
చేనేత కార్మికులు: 36,813
బీడీ కార్మికులు: 4,07,268  
గీత కార్మికులు: 62,069
ఒంటరి మహిళలు: 1,33,789

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement