ఐసోలేషన్‌ రోగులకు ‘హితం’ | Telangana Government Launched New Application For Covid 19 | Sakshi
Sakshi News home page

ఐసోలేషన్‌ రోగులకు ‘హితం’

Published Tue, Jul 21 2020 2:39 AM | Last Updated on Tue, Jul 21 2020 5:07 AM

Telangana Government Launched New Application For Covid 19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌కు హోం ఐసోలేషన్‌ ట్రీట్మెంట్‌ అప్లికేషన్‌ మేనేజ్‌మెంట్‌ (హితం) అనే పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న ఈ యాప్‌ రెండు మూడు రోజుల్లో రోగులకు అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌ ఐఐటీతో కలిసి ఈ యాప్‌ను సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు డాక్టర్ల సలహాలు, సూచనలు, కౌన్సెలింగ్‌ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం. పూర్తిగా డాక్టర్లతోనే ఈ యాప్‌ను నడిపిస్తారు. ఒక్కో డాక్టర్‌కు 50 మంది కరోనా రోగులను కేటాయిస్తారు. రోగులతో డాక్టర్లు ప్రతీరోజూ మాట్లాడుతారు. అలాగే రోగులు కూడా రేయిపగలూ అన్న తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు తనకు కేటాయించిన డాక్టర్‌తో మాట్లాడవచ్చు.

యాప్‌లో అత్యవసర బటన్‌ నొక్కితే ‘108’కు కనెక్ట్‌... 
కరోనా సోకినవారిలో దాదాపు 9 వేల మంది వరకు ఇళ్లల్లోనే (హోం ఐసోలేషన్‌) ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే చాలాచోట్ల ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నవారికి సరైన చికిత్స, డాక్టర్ల సలహాలు, సూచనలు అందడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం కూడా చెప్పేవారు లేరన్న ఆరోపణలు వచ్చాయి. ఐసోలేషన్‌ కిట్లు కూడా చాలా మందికి అందడంలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ‘హితం’పేరుతో యాప్‌ను తీసుకువస్తోంది. ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఏదైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే డాక్టర్లను సంప్రదించవచ్చు.

ఆరోగ్య సమస్యలు తలెత్తితే యాప్‌లో ఉండే అత్యవసర బటన్‌ నొక్కితే జీపీఎస్‌ సిస్టం ద్వారా నేరుగా ‘108’కు కనెక్ట్‌ అవుతుంది. దీంతో రోగి ఉండే ఇంటికే 20 నిముషాల్లో నేరుగా 108 వాహనం వచ్చి సమీపంలోని కోవిడ్‌ ఆసుపత్రికి తీసుకెళ్తుంది. రోగికి కేటాయించిన డాక్టర్‌కూ యాప్‌ ద్వారా ఈ సమాచారం అందుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రోగుల సమాచారాన్ని మొత్తం యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. వారిలో ఎవరికి ఎలాంటి లక్షణాలు, ఇతర జబ్బులున్నాయో కూడా నిక్షిప్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఏర్పాటు చేస్తున్నట్లు ఒక వైద్యాధికారి తెలిపారు. 

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ కరోనా టెస్టులు, చికిత్స
మరోవైపు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లోనూ కరోనా టెస్టులు, చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసింది. అన్నిచోట్లా ర్యాపిడ్‌ టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చే సింది. మరికొన్ని లక్షల యాంటిజెన్‌ కిట్లకు ఆర్డర్‌ చేసింది. గ్రామాల్లో స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లను కూడా ఐసోలేషన్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement