ఏపీ ఆదాయానికి ఢోకా లేదు
* రాష్ట్రం విడిపోయాక జూలై నెలలో రూ. 5,480 కోట్లు ఆదాయం
* రెండు నెలలు జీతం ఇచ్చినా లోటు రూ.124 కోట్లకే పరిమితం
* రాష్ట్ర పన్ను, కేంద్ర పన్నుల వాటా వనరులు బాగానే వచ్చాయి
* వ్యాట్, మద్యం ఆదాయం అదిరింది
* పైసా అప్పు కూడా చేయలేదు.. భయపడాల్సిన పరిస్థితి లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ వనరులు తగ్గిపోతాయన్న అంచనాలు నిజం కాదని తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి ఢోకా లేదని తేటతెల్లమైంది. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల వాటా ద్వారా వచ్చిన ఆదాయం మెరుగ్గా ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ముందుగా ఆందోళన చెందినట్లుగా పరిస్థితి లేదని, జూలై నెలలో ఆదాయం బాగా వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
జూలై నెలలో రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర, కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.5,480 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు వ్యాట్ ఆదాయం 45 శాతమే వస్తుందని అంచనా వేయగా, 47 శాతం వచ్చింది. కొత్త మద్యం లెసైన్సుల విధానం కారణంగా మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా జూలై నెలలో బాగా పెరిగింది. మోటారు వాహనాల పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంది. కేంద్ర పన్నుల వాటా నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ. 1,960 కోట్లు వచ్చేవి.
రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర పన్నుల వాటా నుంచి జూలై నెలలో రూ. 1,200 కోట్లు వచ్చింది. రాష్ట్రం విడిపోయి రెండు నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు పైసా కూడా అప్పు చేయలేదు. జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు నెలల జీతాలు, పింఛన్ల కింద రూ.5,800 కోట్లు చెల్లించింది. అయినా ఇతర లావాదేవీలన్నీ సరిచూసిన తరువాత జూలై నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును 124 కోట్ల రూపాయలకే ఆర్థిక శాఖ పరిమితం చేయగలిగింది.