సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మినహా ఆ శాఖ పరిధిలో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని, ఎన్నికల కోడ్ కారణంగా గత రెండున్నర నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందన్న సాకుతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు ముందుకు రాకపోవడం గమనార్హం.
ధరణి పోర్టల్‌తో పాటు జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాల్సిన కలెక్టర్లు ఆ ఫైళ్లన్నింటినీ పక్కన పెట్టేయడం, తాజాగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వా త కూడా వాటిని పరిశీలించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొందని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి.
దీనికి తోడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయిందని, కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఆరా తీసే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ఈ ఏడాది సెపె్టంబర్ నుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమయింది. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్‌రాగా, నవంబర్‌లో నోటిఫికేషన్ వెలువడింది. అయితే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి నుంచి రెవెన్యూ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ సిబ్బందిదే కీలక పాత్ర కావడం, తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా, ఆర్డీవోలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉండటంతో వారు రెవెన్యూ పనులన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.
ఇక కలెక్టర్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఈనెల 4వ తేదీ వరకు (ఎన్నికల కోడ్ ముగిసే వరకు) బిజీబిజీగా ఉన్నారు. దీంతో తహసీల్దార్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ వ్యవహారాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కనీసం విరాసత్, పెండింగ్ డిజిటల్ సంతకాల దరఖాస్తులను కూడా పరిష్కరించలేదు. దీంతో ప్రస్తుతం ధరణి, జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధికరణ)లకు చెందిన లక్షలాది మంది దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
తదుపరి ఆదేశాల వరకు పెండింగ్‌లోనే?
రాష్ట్రంలో అధికారం చేతులు మారిన నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రెవెన్యూ కార్యకలాపాలు ముట్టుకో వద్దని, అన్ని ఫైళ్లు పెండింగ్‌లో పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ మేరకు కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పా రని అంటున్నారు. మరోవైపు రెవెన్యూ కార్యకలాపాలపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని సీసీఎల్‌ఏ కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని కూడా సమాచారం.
అయితే ఇవి కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రెవెన్యూ వ్యవహారాలు స్తబ్దుగా మారాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘రెవెన్యూ వ్యవహారాలపై ప్రభుత్వం ఆదేశాలివ్వడం కొత్తేమీ కాదు. కానీ అధికారంలో ఉన్న పార్టీ మారడంతో రెవెన్యూ సిబ్బందిలో కొంత కంగాళీ ఉన్న మాట మాత్రం వాస్తవం.
ఏం చేస్తే ఏం జరుగుతుందోననే ఆందోళనతో ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు..’ఈ శాఖ ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ‘ఎప్పటివో పాత దరఖాస్తులు పరిష్కరించేందుకు అడ్డు వచ్చిందెవరు? జీవో 59 కింద దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు దాటిపోయింది. వాటి పరిష్కారం వద్దని ప్రభుత్వం ఎందుకు అంటుంది?’అని ప్రశ్నించారు. పైగా వీటి పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా? ’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment