అచ్చంపేటకు అండగా ఉంటాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం సీట్లను టీఆర్ఎస్కు కట్టబెట్టిన అచ్చంపేట ప్రజలకు, పట్టణానికి అవసరమైన అన్ని పనులూ చేయాలని ఆయన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు చెప్పారు. అచ్చంపేట ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎమ్మెల్యే బాలరాజు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి బాలరాజును అభినందించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టేలా పని చేయాలని, తాను అండగా ఉంటానని సీఎం అన్నారు. ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ యువ నాయకుడు మహ్మద్ ఆజం అలీ కూడా సీఎంను కలిశారు.