వేగం పెంచండి
♦ మే 30లోగా అభివృద్ధి పనులన్నీ పూర్తి కావాలి
♦ ఎర్రవల్లి ఆదర్శవల్లి కావాలి
♦ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం
♦ కలెక్టర్ పనితీరు భేష్ అంటూ కితాబు
♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన
జగదేవ్‌పూర్ : ‘ఎర్రవల్లి, నర్సన్నపేటలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలి.. మే 30లోగా పనులన్నీ పూర్తి చేయాలి.. దేశంలోనే ఈ గ్రామాలు ఆదర్శం కావాలి..నత్తనడకన కొనసాగిస్తే లక్ష్యం చేరుకోలేం’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. బుధవారం తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో ఏపీజీవీబీ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రెండు మూడు రోజుల్లో రెండువేగం పెంచండి గ్రామాలకు గోదావరి నీళ్లు రానున్నాయని, ఇక నీళ్ల బాధలు ఉండవని చెప్పారు.
ఆ దిశగా పనులు జరుగుతున్నట్లు వివరించారు. డ్రిప్పు, చెరువు, కుంటల పనులను యుద్ధప్రాతిపదికనా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్ చాలా కష్టపడుతున్నారని ఆయన పనితీరు అభినందనీయమని అన్నారు. అంకాపూర్ మదిరిగానే ఎర్రవల్లిలో నేడు బ్యాంకు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఎర్రవల్లి గ్రామస్తులు భారీ మొత్తంలో డిపాజిట్ చేసుకోవాలని, అలాగే రుణాలు పొందాలని సూచించారు. ఎర్రవల్లి బ్యాంకు రాష్ట్రంలోనే నంబర్‌వన్ బ్యాంకుగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఎర్రవల్లిలో బ్యాంకు ప్రారంభించగానే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు బ్యాంకులో కలెక్టర్ రోనాల్డ్‌రాస్ డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన నిధులను గ్రామంలోని రైతులు ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.
సీఎం కేసీఆర్ ఎర్రవల్లి పర్యటన ఖరారు కావడంతో జిల్లా ఎస్పీ సుమతి, సిద్ధిపేట డిఎస్పీ శ్రీధర్, పోలీసులు బలగాలు ఎర్రవల్లిలో మొహరించాయి. కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్‌రాస్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, జేసీ వెంకట్రామిరెడ్డి, ఏపీజీవీబీ చైర్మన్ నర్సిరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, సర్పంచ్ భాగ్య, జడ్పీటీసీ రాంచంద్రం, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, సభ్యులు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సత్తయ్య, తహసీల్దార్ పరమేశం తదితరులు ఉన్నారు.