మద్దులపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: తుమ్మల
ఖమ్మం రూరల్: మద్దులపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి.. రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని మద్దులపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి బుధవారం ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 22 డబుల్ బెడ్రూం పనులు పూర్తి కాగా, గృహప్రవేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవం తో తలెత్తుకుని బతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఖమ్మం జిల్లా అగ్రభాగాన నిలవాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. గతంలో ఇళ్లు నిర్మించుకుని.. బిల్లులు రాని 36వేల మంది లబ్ధిదారుల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని, బడ్జెట్‌లో కూడా వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడేది లేదన్నారు. సాదాబైనామా ప్రవేశపెట్టి సన్న, చిన్నకారు రైతులకు పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.