ముఖ్యమంత్రి అబద్ధాల కోరు
కొండా రాఘవరెడ్డి
హైదరాబాద్ :అబద్ధాలకోరు సీఎం పాలనలో రాష్ట్రం దగా పడుతోం దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో విలేకరులతో మాట్లాడారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం హామీతో అధికా రంలోకి వచ్చిన కేసీఆర్, మూడేళ్లు దాటినా పదుల సంఖ్యలోనే ఇళ్లు నిర్మించి ప్రజలను వంచించారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ విషయంపై నిలదీయటంతో రాష్ట్ర వ్యాప్తం గా రెండు లక్షలు మాత్రమే నిర్మిస్తామని చెప్పారన్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 5 లక్షలకు పైగా ప్రజలు ఇళ్లకోసం దరఖాస్తు చేశారని.. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల వరకు ఆ సంఖ్య ఉంటే సీఎం మాత్రం రెండు లక్షలే నిర్మిస్తామనడం విడ్డూరమన్నారు.
దీన్నిబట్టి డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఆశిస్తున్న లక్షలాదిమందిని నిలువునా ముంచేం దుకు కేసీఆర్ సిద్ధమయ్యారని తేలిపో యిందన్నారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో అప్పటి ఏపీలో ఏకంగా 36 లక్షల గృహాలను నిర్మించారని, అందులో తెలంగా ణలో 16లక్షలు ఉన్న విషయాన్ని కేసీఆర్ గమనించాలని అన్నారు. ప్రభుత్వ పెద్దలకు కమీషన్‌లు వచ్చే పథకాలను చేపట్టి, పేదల పథకాన్ని అటకెక్కించారన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వాగ్దానం చేసిన సీఎం.. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం పదుల సంఖ్యలో రోగులు చనిపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నారన్నారు. ఇష్టారాజ్యంగా అబద్ధాలు చెపుతున్న ముఖ్యమంత్రి ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు.