సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లు
త్వరలోనే సర్దుకుంటుంది: సీఎం కేసీఆర్
గతంలో కంటే 32.54 శాతం డిమాండ్ పెరిగింది
తుపాను కారణంగా విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గింది
జల విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడి
హైదరాబాద్: తుపాను కారణంగా విశాఖపట్నంలోని రెండు వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన ఆగిపోవడంతో తెలంగాణకు విద్యుత్ ఇబ్బందులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ఇబ్బందికరంగా మారిందని ఆయన చెప్పారు. విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్షించారు. గత ఏడాది కంటే ఈ సారి విద్యుత్ డిమాండ్ 32.54 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. 143 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో డిమాండ్ 126 మిలి యన్ యూనిట్లు ఉంటే.. 122 మిలియన్ యూనిట్లు సరఫరా చేశారని తెలిపారు. తుపాను రావడానికి ముందు 10 నుంచి 16 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేసేవారమని.. కానీ తుపాను కారణంగా జైపూర్-గాజువాక లైనులో అంతరాయం ఏర్పడిందని చెప్పారు. దీంతో విద్యుత్ ఎక్కువగా కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సీఎం స్పందిస్తూ.. జల విద్యుత్ ఉత్పత్తిని సాధ్యమైనంత మేరకు పెంచి, పంటలను ఆదుకునే యత్నం చేస్తున్నామని చెప్పారు. సింహాద్రి ప్రాజెక్టులో గురువారం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని, మిగతా ఉత్పత్తి ప్రారంభమైతే పరిస్థితి మెరుగుపడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరతో సంబంధం లేకుండా ఎక్కడ విద్యుత్ లభిస్తే.. అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఇస్తే.. తెలంగాణలో వ్యవసాయానికి మరికొంత విద్యుత్ ఇవ్వడం సాధ్యమవుతుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
పక్కా ప్రణాళికతో వెళుతున్నాం..
►తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపర్చడానికి పక్కాగా స్పల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళిక లతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన పలు వివరాలు..
► 2015 మే 9వ తేదీ నుంచి పెన్నా, థర్మల్ పవర్‌టెక్, శ్రీ సిమెంట్స్ సంస్థల నుంచి రెండు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
► 500 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం టెండర్లు పిలిస్తే.. అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్లాంట్ల ఏర్పాటు నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది.
► 2015 మే నుంచి పది సంస్థలు విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయి. వాటి తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
► తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పవర్ ఎక్స్ఛేంజీ నుంచి 539 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రూ. 310 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశాం.
► ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లను ఈఆర్‌సీ నిర్ణయించిన ధర మేరకు కొనుగోలు చేస్తాం. అయితే ఆ లైను అందుబాటులోకి వచ్చిన తరువాతే ఇది సాధ్యమవుతుంది.
► జెన్‌కో నుంచి 6వేల మెగావాట్లు, ఎన్టీపీసీ నుంచి 4వేల మెగావాట్ల సామర్థ్యమున్న వి ద్యుత్‌ప్లాంట్లు భవిష్యత్‌లో నెలకొల్పనున్నాం.