= తిరుమల మినహా, అన్నిచోట్లా సరఫరా బంద్
= తీరని ప్రాంతీయ ఆస్పత్రుల కష్టాలు
= సమ్మెలో పాల్గొన్న 2,200 మంది ఉద్యోగ, కార్మికులు
= కార్పొరేట్ ఆఫీసు ఎదుట మహిళా ఉద్యోగుల దీక్షలు
= పడకేసిన ఐస్‌క్రీం తయారీ పరిశ్రమలు
సాక్షి, చిత్తూరు: విద్యుత్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుండటంతో జిల్లాలో బుధవారం కూడా ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పలేదు. విద్యుత్ ఉద్యోగులందరూ నాల్గవ రోజు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంతో సహా పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంలో కూడా పూర్తిగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. తిరుమలకు, ప్రధాన ఆస్పత్రులకు మాత్రమే విద్యుత్ ఇచ్చారు. 4వ రోజు తిరుపతి ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని 2,200 మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు.
సీఎండీ హెచ్‌వై.దొర, ఎస్‌ఈలు మాత్రం విధుల్లో ఉన్నారు. తిరుపతి, మదనపల్లి, చిత్తూరులో విద్యుత్ ఉద్యోగ, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఎస్పీడీసీఎల్ తిరుపతి కార్పొరేట్ కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. రైల్వేట్రాక్షన్ లైన్లకు కూడా విద్యుత్ పునరుద్ధరించకపోవడంతో కాట్పాడి(తమిళనాడు) నుంచి తీసుకున్న విద్యుత్‌తోనే రైళ్లు నడుస్తున్నాయి.
రైల్వేస్టేషన్లల్లో సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు, రైళ్ల మైక్ అనౌన్స్‌మెంట్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు, విద్యుత్ అధారితంగా నడిచే వ్యాపారాలన్నీ పగటి పూట బంద్ అయ్యాయి. కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి. దీంతో చాలా వ్యాపారసంస్థలు తమ కార్యకలాపాలను రాత్రిపూటకు మార్చుకుంటున్నాయి.
ఏరియా ఆస్పత్రులకు విద్యుత్ నిల్
ప్రభుత్వ వైద్య, విధాన పరిషత్ అధికారులు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. తిరుపతిలోని స్విమ్స్, బర్డ్, రుయా, చిత్తూరు జిల్లా ప్రధాన ఆస్పత్రి మినహా మిగిలిన ఆస్పత్రుల్లో విద్యుత్ లేదు. వైద్యులు కూడా వెలుతురు లేక చీకట్లో అరకొరగా విధులు నిర్వర్తిస్తున్నారు. చీకటి, ఉక్కపోతలో ఎక్కువసేపు ఉండలేక వైద్యులు త్వరగా
ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
పడకేసిన ఐస్‌క్రీం కంపెనీలు
పూర్తిగా విద్యుత్‌పై అధారపడి నడిచే ఐస్‌క్రీం తయారీ కంపెనీలు జిల్లాలో చిన్నా పెద్దా కలిపి 100కు పైగా ఉన్నాయి. రోజుకు నిరంతరాయంగా 13గంటలు విద్యుత్ లేకపోవడంతో ఐస్ తయారీ నిలిచిపోయింది. రాత్రి ఐస్ తయారు చేసినా పగలంతా నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. దీంతో చిన్నతరహా ఐస్‌క్రీం తయారీ ఫ్యాక్టరీలు ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశాయి. పట్టణాల నుంచి మండల కేంద్రాల వరకు జ్యూస్ దుకాణాలు, కూల్‌డ్రింక్‌ల వ్యాపారం పడిపోయింది. జ్యూస్ సెంటర్లన్నీ విద్యుత్ అధారంగానే నడవాల్సి ఉంది. దీంతో రాత్రి ఏడు నుంచి 10 గంటల వరకు కొద్దిసేపు వ్యాపారం చేసుకుంటున్నారు.
పెట్రోల్ బంకుల్లో సమస్యలు
జిల్లాలోని 500కు పైగా పెట్రోల్ బంకుల్లో విద్యుత్ బంద్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఎలక్ట్రానిక్ పంపులు పని చేయడం లేదు. కొన్ని పెద్ద పెట్రోల్ బంకుల్లో జనటరేటర్లతో పెట్రోల్ పడ్తున్నారు. ఈ జనరేటర్లు కూడా ఎక్కువసేపు పని చేయడం లేదు. రాత్రి 7 గంటల తరువాత విద్యుత్ రాగానే వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూకడుతున్నారు. వందల సంఖ్యలో వాహనాలకు ఒక్కసారిగా పెట్రోల్ పట్టలేక బంకు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు.
కొనసాగుతున్న కరెంట్ కష్టాలు
Published Thu, Oct 10 2013 4:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement