Operation Circle
-
విద్యుత్ అక్రమాలకు చెక్ !
విజయనగరం మున్సిపాలిటీ : ‘‘సార్ మా ఇంట్లో రెండు ట్యూబ్‌లైట్లు, ఒక ఫ్యాన్, ఒక టీవీ మాత్రమే ఉన్నాయి. ఈ నెల బిల్లు మాత్రం రూ. 2 వేల వరకు వచ్చింది. దయచేసి మా మీటర్‌ను సరిచేసి బిల్లును మార్చండి ... ’’ ఇది ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని పలువురు వినియోగదారుల విన్నపం. మీటర్ రీడర్స్ నిర్లక్ష్య వైఖరో... లేక ఏళ్లకిందట ఏర్పాటు చేసిన విద్యుత్‌మీటర్ల వల్లో తెలియదు కానీ ప్రతి నెలా వందల సంఖ్యలో ఈ తరహా బిల్లులు నమోదవుతున్నాయి. ఎక్కువ నమోదైన బిల్లును సరి చేసేందుకు విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ వినియోగదారులు తిరగాల్సి వస్తోంది. గృహావసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లు ఎన్నో ఏళ్ల కింద అమర్చినవి కావడంతో అవి సక్రమంగా తిరగకపోవటం, వాటిపై అవగాహన ఉన్న వారు మీటర్లు తిరగకుండా నిలిపివేసి, అక్రమంగా విద్యుత్ వాడుకోవడంతో ఇటు వినియోగదారులకు, అటు విద్యుత్‌శాఖకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. దీనికితోడు ఎక్కువ రీడింగ్ ఉన్నా వినియోగదారుల అభ్యర్థన, వారిచ్చే కానుకలకు లొంగిపోయి కొంతమంది మీటర్ రీడర్స్ బిల్లుల్లో తక్కువగా నమోదు చేసున్నారు. ఈ విధంగా విద్యుత్ చౌర్యం, సిబ్బంది అక్రమాల వల్ల సంస్థకు వస్తున్న నష్టాలను అధిగమించేందుకు, వినియోగదారుల ఇక్కట్లు తీర్చేందుకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఉండే విధంగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న విద్యుత్ మీటర్ల స్థానంలో ఇన్ఫ్రారెడ్ డేటా అక్విజేషన్(ఐఆర్డీఏ) మీటర్లను ఏరా్పాటు చేస్తున్నారు. ఈ మీటర్ల ఏర్పాటుతో అక్రమాలకు బ్రేక్ పడుతుంది. నెలలో వినియోగించిన మొత్తం యూనిట్లకు బిల్లు నమోదవుతుంది. ఈ విషయంలో మీటర్ రీడర్స్ చేతి వాటం ప్రదర్శించేందుకు వీలుండదు. రీమోట్ కంట్రోల్ సిస్టమ్ పద్ధతిలో విద్యుత్ మీటర్ దగ్గరకు వెళ్లి రీడింగ్ నమోదు చేసే అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా లెక్కకట్టి బిల్లు వస్తుంది. అధిక మొత్తంలో బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు. పలువురు రూ.వేలల్లో విద్యుత్‌ను వినియోగించి మీటర్లను కాల్చివేయటంతో ఆ బిల్లును ఎగవేయాలని భావిస్తారు. అవసరమైతే మీటరు కోసం గతంలో రూ.200 చెల్లించి చేతులు దులుపుకొనే వారున్నారు. అయితే ఐఆర్డీఏ మీటర్లతో అలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు. మీటర్ వద్ద అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం లేకుండా అధునాత టెక్నాలజీతో రూపొందించారు. సంస్థ పరిధిలో ఉన్న మొత్తం 5 లక్షల 97వేల 977 విద్యుత్ మీటర్లను మార్పు చేయనున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఐఆర్ డీఏ మీటర్లను అమర్చతున్నారు. ఒక్కొక్క ఐఆర్డీఏ విద్యుత్‌మీటర్ ధర రూ. 840. జిల్లా వ్యాప్తంగా వాటిని అమర్చేందుకు సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ముందుగా పట్టణాలు, మండల కేంద్రాల్లో వీటి మార్పునకు శ్రీకారం చుట్టారు. -
విద్యుత్ శాఖకు భారీ నష్టం
విజయనగరం మున్సిపాలిటీ: తుపాను బీభత్సం విద్యుత్ శాఖకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆప రేషన్ సర్కిల్ పరిధిలో తొలిరోజు అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలో సుమారు రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వారు భావిస్తున్నారు. కాగా శనివారం అర్ధరాత్రి నుంచి వీచిన భారీ ఈదురుగాలులు, కుండపోత వర్షానికి జిల్లావ్యాప్తంగా 250 ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురవ్వగా 4 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగారుు. సోమవారం ఉదయం నుంచి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. 600 మంది అధికారులు సిబ్బందితో తొలిరోజు మరమ్మతు పనుల్లో పాల్గొనగా, మంగళవారం ఉదయానికి అదనంగా మరో 300 మంది సిబ్బందిని వివిధ జిల్లాల నుంచి రప్పిస్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ సి.శ్రీనివాసమూర్తి తెలిపారు. పార్వతీపురం, బొబ్బిలి మండలాల మినహా మిగిలిన 32 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపినట్టు చెప్పారు. తుపాను బీభత్సంతో జిల్లా వ్యాప్తంగా సరఫరా నిలిచిపోగా, ముందస్తుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, రక్షిత పథకాలకు సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రాధాన్యమివ్వ నున్నట్టు చెప్పారు. అలాగే సాధ్యమైనంత వేగంగా జిల్లావ్యాప్తంగా సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. కిలోమీటర్ల మేర ధ్వంసమైన విద్యుత్ వైర్లు శృంగవరపుకోట రూరల్ : హుదూద్ తుపాను ప్రభావంతో ఆదివారం వీచిన గాలులు, వర్షానికి మండలంలోని అన్ని గ్రామాల్లోనూ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు ధ్వంసమయ్యాయి. బొడ్డవరలో 20, ముషిడిపల్లి-10, కొట్టాం-8, రేవళ్లపాలెం-9, ధర్మవరం-10, ఎస్.కోట-20, పోతనాపల్లి-6, వెంకటరమణపేట-8, తిమిడి-4, వశి-6 చొప్పున విద్యుత్ స్తం భాలు నేలకొరినట్టు సమాచారం. ఒకేసారి అన్ని గ్రామాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ పునరుద్ధరణకు ఎక్కు వ రోజులు పట్టే అవకాశం ఉందని ఏఈ దాసరి సింహాచలం తెలిపారు. వేపాడ మండలంలో 703 విద్యుత్ స్తంభాలు, 50 హెచ్‌టీ స్తంభాలు కూలి పోయాయి. మెరకముడిదాం మండలంలో 103 స్తంభాలు నేలకూలాయి. -
నిఘా నిద్దరోతోందా?
విజయనగరం మున్సిపాలిటీ : అసలే విద్యుత్ సంక్షోభం... వినియోగదారులకు సరఫరా చేసేది కాస్తాకూస్తో... జరిగే కాస్త సరఫరాలో కూడా పలువురు యథేచ్ఛగా చౌర్యానికి పాల్పడుతున్నారు. దీంతో ఏపీఈపీడీసీఎల్ నష్టాల బాట పడుతోంది. జిల్లాలో విద్యుత్ అక్రమ వాడకంపై నిఘా కొరవడుతోంది. విద్యుత్ చౌర్యం అధికమవుతోంది. నిఘా విభాగం చర్యలు అంతంతమాత్రం కావడంతో చోరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అరకొర తనిఖీలకే ఏటా 1500 పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. సీరియస్‌గా దాడులు నిర్వహించాల్సి వస్తే ఈ సంఖ్య మరింత పెరగవచ్చని చెప్పవచ్చు. వాస్తవానికి విద్యుత్ చౌర్యాన్ని నిరోధించేందుకు ఏపీఈపీడీసీఎల్ సంస్థ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేసింది. ఈ నిఘా విభాగానికి అనుబంధంగా ఎఫ్ఐఆర్ నమోదు, నిందితుల అరెస్టుకు వీలుగా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో పోలీస్ విభాగం ఉంది. అయితే విద్యుత్ చౌర్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టే విషయంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది లేకుండా తాము మాత్రం ఏమి చేయగలమంటూ నిఘా విభాగం అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో మొత్తం 6 లక్షల 2వేల 376 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో 5 లక్షల 24వేల 73 గృహావసర, 24వేల 228 వ్యవసాయ, 2వేల 708 ఎల్టీ, 200 హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలినవి వాణిజ్య కనెక్షన్లు. ఈ విద్యుత్ కనెక్షన్లు అన్నింటినీ జిల్లాలో ఉన్న విద్యుత్ నిఘా విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలి. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం, అక్రమ వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే స్పందించి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది కొరతతో జిల్లాలో దాడులు అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పాలి. వాస్తవానికి జిల్లా పరిధిలో విద్యుత్ చౌర్యాన్ని నిరోధించేందుకు ఏర్పాటు చేసిన నిఘా విభాగంలో ఒక డీఈ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఏడీఈలు, ఐదుగురు ఏఈలు ఉండాల్సి ఉంది. అంతమంది సిబ్బంది లేకపోవడంతో వీరు క్షేత్ర స్థాయిలో పూర్తి నిఘా పెట్టలేకపోతున్నారు. ఈపీడీసీఎల్ సాంకేతిక విభాగం ముందడుగులో ఉన్నా చౌర్యాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు చిత్తశుద్ధితో తనిఖీలు జరిపితే మరిన్ని కేసులు నమోదవుతాయని సంబంధిత శాఖ అధికారు లే పేర్కొంటున్నా ఆ దిశగా అధికారులు ఎంత వరకు సఫలీకృతులు అవుతారో వేచి చూడాలి. నాలుగేళ్లలో 6,723 కేసులు నమోదు... అసలే నష్టాల బాటలో పయనిస్తున్న ఏపీఈపీడీసీఎల్ అధికారులకు మొండి బకాయిల దారులు వేధిస్తుంటే మరో వైపు విద్యుత్ చౌర్యం కేసులు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉన్న కాస్త సిబ్బందితో జిల్లాలో అధికారులు అడపాదడపా దాడులు నిర్వహిస్తే గత మూడేళ్లలో 6,723 విద్యుత్ చౌర్యం కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. సంబంధిత చోరుల నుంచి రూ.6 కోట్ల 39 లక్షలు వసూలు చేశారు. ఇందులో అక్రమంగా విద్యుత్ వాడకం, మాల్‌ప్రాక్టీస్‌లు, అదనపు విద్యుత్ వాడకం, మీటర్లు తిరగకపోయినా సమాచారం అందించకపోయిన కేసులు నమోదవుతుంటాయి. ఇందులో 2010-11 ఆర్థిక సంవత్సరంలో 1983 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు కాగా వారి నుంచి రూ3.08 కోట్లు వసూలు చేశారు. 2011-12 సంవత్సరంలో 1,722 కేసులు నమోదు కాగా 1.59 కోట్లు సంబంధిత చోరులకు అపరాధ రుసుం విధించారు. 2012-13 సంవత్సరంలో 2 వేల 541 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు కాగా అపరాధ రుసుం రూపంలో రూ.1.72 కోట్లు విధించారు. 2013-14 సంవత్సరంలో మొత్తం 477 కేసులు నమోదు చేయగా వారి నుంచి రూ.19.71 లక్షల అపరాధ రుసుం వసూలు చేయగలిగారు. గడిచిన కొద్ది ఏళ్లతో పోల్చితే 2013-14 సంవత్సరంలో విద్యుత్ చౌర్యం కేసులు తక్కువ సంఖ్యలో నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా అధికారులు చోరుల పట్ల ఉదాసీన వైఖరి అవలంభించటం వల్ల చోరుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
మళ్లీ విద్యుత్ కోతలు
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో రెండు రోజులుగా విద్యు త్ శాఖాధికారులు అనధికారికంగా కోత లు విధిస్తున్నారు. పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ కేటాయింపులు నిలిచి పోయాయి. దీంతో కోతలు అనివార్యమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆది, సోమవారాల్లో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎడాపెడా కోతలు అమలు చేశారు. జిల్లాలో గృహావసర విద్యుత్ సర్వీసులకు ఆదివారం రాత్రి 11.15 నుంచి అర్ధరాత్రి 12.10 గంటల వరకు.. మళ్లీ వేకువ జామున 5.00 నుంచి 5.45 గంటల వరకుజిల్లా కేంద్రం మినహా అన్ని ప్రాంతాల్లోనూ కోత విధించారు. అలాగే సోమవా రం ఉదయం 7.45 నుంచి 10.05 గంటల వరకు జిల్లావ్యాప్తంగా కోత విధించారు. సాయంత్రం 4.50 నుంచి 6.25 వరకు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కోతలు విధించారు. రెండు రోజులు విద్యుత్‌ను అధి కంగా వినియోగించే ఫెర్రో పరిశ్రమలకు వినియోగంపై ఆంక్షలు విధించా రు.ప్రతి రోజూ సాయంత్రం 6.30నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు కేవలం లైటింగ్ లోడు మాత్రమే విని యోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ శ్రీనివాసమూర్తి వద్ద ప్రస్తావించగా.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల జిల్లాలో అనధికారిక కోతలు విధిస్తున్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితి బుధవారం అర్ధరాత్రి వరకు ఉండవచ్చునని చెప్పారు. -
100 రోజుల విద్యుత్ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి
విజయనగరం మున్సిపాలిటీ: ఏపీఈపీడీ సీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో చేపడుతున్న 100 రోజుల ప్రణాళిక పనులపై దృష్టి సారించాలని ఎస్ఈ సి.శ్రీనివాసమూర్తి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. దాసన్నపేట విద్యుత్ భవనంలో జిల్లాలోని అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళికల పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సూచించారు. ఈ పనులకు సంబంధించి సామగ్రిని ప్రతి వారం తెప్పిం చుకుని పనులను ప్రణాళికా బద్దంగా చేయాలని చెప్పారు. మొత్తం 100 రోజుల వ్యవధిలో ప్రతిపాదించిన పనులన్నింటినీ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, ఏబీ స్విచ్‌లు ఏర్పాటుతో పాటు లూజ్ స్పాన్స్ సరిచేయటం, ఒరి గిన, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్పు చేయటం వంటి పనుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలన్నారు. చేసే పనులను పక్కగా నిర్వహించ టం ద్వారా సమస్యలను అధిగమించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వం వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే యోచనలో ఉన్న నేపథ్యంలో అందుకు సన్నద్ధం కావాలని సూచించారు. అనంతరం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, బిల్లుల వసూళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. బిల్లుల వసూళ్ల విషయంలో శతశాతం లక్ష్యాలను సాధించి సంస్థను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ టెక్నికల్ డీఈటీ ఎల్.ఆర్.దైవప్రసాద్, ఎస్ఈ వెంకటరాజు, విజయనగరం డీఈ నాగిరెడ్డి కృష్ణమూర్తితో పాటు పలు విభాగాల డీఈలు, ఏడీఈలు, ఏఈలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కరెంట్ కష్టాలు
= తిరుమల మినహా, అన్నిచోట్లా సరఫరా బంద్ = తీరని ప్రాంతీయ ఆస్పత్రుల కష్టాలు = సమ్మెలో పాల్గొన్న 2,200 మంది ఉద్యోగ, కార్మికులు = కార్పొరేట్ ఆఫీసు ఎదుట మహిళా ఉద్యోగుల దీక్షలు = పడకేసిన ఐస్‌క్రీం తయారీ పరిశ్రమలు సాక్షి, చిత్తూరు: విద్యుత్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుండటంతో జిల్లాలో బుధవారం కూడా ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పలేదు. విద్యుత్ ఉద్యోగులందరూ నాల్గవ రోజు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంతో సహా పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంలో కూడా పూర్తిగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. తిరుమలకు, ప్రధాన ఆస్పత్రులకు మాత్రమే విద్యుత్ ఇచ్చారు. 4వ రోజు తిరుపతి ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని 2,200 మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. సీఎండీ హెచ్‌వై.దొర, ఎస్ఈలు మాత్రం విధుల్లో ఉన్నారు. తిరుపతి, మదనపల్లి, చిత్తూరులో విద్యుత్ ఉద్యోగ, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఎస్పీడీసీఎల్ తిరుపతి కార్పొరేట్ కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. రైల్వేట్రాక్షన్ లైన్లకు కూడా విద్యుత్ పునరుద్ధరించకపోవడంతో కాట్పాడి(తమిళనాడు) నుంచి తీసుకున్న విద్యుత్‌తోనే రైళ్లు నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్లల్లో సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు, రైళ్ల మైక్ అనౌన్స్మెంట్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు, విద్యుత్ అధారితంగా నడిచే వ్యాపారాలన్నీ పగటి పూట బంద్ అయ్యాయి. కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి. దీంతో చాలా వ్యాపారసంస్థలు తమ కార్యకలాపాలను రాత్రిపూటకు మార్చుకుంటున్నాయి. ఏరియా ఆస్పత్రులకు విద్యుత్ నిల్ ప్రభుత్వ వైద్య, విధాన పరిషత్ అధికారులు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. తిరుపతిలోని స్విమ్స్, బర్డ్, రుయా, చిత్తూరు జిల్లా ప్రధాన ఆస్పత్రి మినహా మిగిలిన ఆస్పత్రుల్లో విద్యుత్ లేదు. వైద్యులు కూడా వెలుతురు లేక చీకట్లో అరకొరగా విధులు నిర్వర్తిస్తున్నారు. చీకటి, ఉక్కపోతలో ఎక్కువసేపు ఉండలేక వైద్యులు త్వరగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పడకేసిన ఐస్‌క్రీం కంపెనీలు పూర్తిగా విద్యుత్‌పై అధారపడి నడిచే ఐస్‌క్రీం తయారీ కంపెనీలు జిల్లాలో చిన్నా పెద్దా కలిపి 100కు పైగా ఉన్నాయి. రోజుకు నిరంతరాయంగా 13గంటలు విద్యుత్ లేకపోవడంతో ఐస్ తయారీ నిలిచిపోయింది. రాత్రి ఐస్ తయారు చేసినా పగలంతా నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. దీంతో చిన్నతరహా ఐస్‌క్రీం తయారీ ఫ్యాక్టరీలు ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశాయి. పట్టణాల నుంచి మండల కేంద్రాల వరకు జ్యూస్ దుకాణాలు, కూల్‌డ్రింక్‌ల వ్యాపారం పడిపోయింది. జ్యూస్ సెంటర్లన్నీ విద్యుత్ అధారంగానే నడవాల్సి ఉంది. దీంతో రాత్రి ఏడు నుంచి 10 గంటల వరకు కొద్దిసేపు వ్యాపారం చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల్లో సమస్యలు జిల్లాలోని 500కు పైగా పెట్రోల్ బంకుల్లో విద్యుత్ బంద్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఎలక్ట్రానిక్ పంపులు పని చేయడం లేదు. కొన్ని పెద్ద పెట్రోల్ బంకుల్లో జనటరేటర్లతో పెట్రోల్ పడ్తున్నారు. ఈ జనరేటర్లు కూడా ఎక్కువసేపు పని చేయడం లేదు. రాత్రి 7 గంటల తరువాత విద్యుత్ రాగానే వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూకడుతున్నారు. వందల సంఖ్యలో వాహనాలకు ఒక్కసారిగా పెట్రోల్ పట్టలేక బంకు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు.