విజయనగరం మున్సిపాలిటీ : ‘‘సార్ మా ఇంట్లో రెండు ట్యూబ్‌లైట్లు, ఒక ఫ్యాన్, ఒక టీవీ మాత్రమే ఉన్నాయి. ఈ నెల బిల్లు మాత్రం రూ. 2 వేల వరకు వచ్చింది. దయచేసి మా మీటర్‌ను సరిచేసి బిల్లును మార్చండి ... ’’ ఇది ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని పలువురు వినియోగదారుల విన్నపం. మీటర్ రీడర్స్ నిర్లక్ష్య వైఖరో... లేక ఏళ్లకిందట ఏర్పాటు చేసిన విద్యుత్‌మీటర్ల వల్లో తెలియదు కానీ ప్రతి నెలా వందల సంఖ్యలో ఈ తరహా బిల్లులు నమోదవుతున్నాయి.
ఎక్కువ నమోదైన బిల్లును సరి చేసేందుకు విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ వినియోగదారులు తిరగాల్సి వస్తోంది. గృహావసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లు ఎన్నో ఏళ్ల కింద అమర్చినవి కావడంతో అవి సక్రమంగా తిరగకపోవటం, వాటిపై అవగాహన ఉన్న వారు మీటర్లు తిరగకుండా నిలిపివేసి, అక్రమంగా విద్యుత్ వాడుకోవడంతో ఇటు వినియోగదారులకు, అటు విద్యుత్‌శాఖకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. దీనికితోడు ఎక్కువ రీడింగ్ ఉన్నా వినియోగదారుల అభ్యర్థన, వారిచ్చే కానుకలకు లొంగిపోయి కొంతమంది మీటర్ రీడర్స్ బిల్లుల్లో తక్కువగా నమోదు చేసున్నారు.
ఈ విధంగా విద్యుత్ చౌర్యం, సిబ్బంది అక్రమాల వల్ల సంస్థకు వస్తున్న నష్టాలను అధిగమించేందుకు, వినియోగదారుల ఇక్కట్లు తీర్చేందుకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఉండే విధంగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న విద్యుత్ మీటర్ల స్థానంలో ఇన్‌ఫ్రారెడ్ డేటా అక్విజేషన్(ఐఆర్‌డీఏ) మీటర్లను ఏరా్పాటు చేస్తున్నారు. ఈ మీటర్ల ఏర్పాటుతో అక్రమాలకు బ్రేక్ పడుతుంది. నెలలో వినియోగించిన మొత్తం యూనిట్లకు బిల్లు నమోదవుతుంది. ఈ విషయంలో మీటర్ రీడర్స్ చేతి వాటం ప్రదర్శించేందుకు వీలుండదు. రీమోట్ కంట్రోల్ సిస్టమ్ పద్ధతిలో విద్యుత్ మీటర్ దగ్గరకు వెళ్లి రీడింగ్ నమోదు చేసే అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా లెక్కకట్టి బిల్లు వస్తుంది.
అధిక మొత్తంలో బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు.
పలువురు రూ.వేలల్లో విద్యుత్‌ను వినియోగించి మీటర్‌లను కాల్చివేయటంతో ఆ బిల్లును ఎగవేయాలని భావిస్తారు. అవసరమైతే మీటరు కోసం గతంలో రూ.200 చెల్లించి చేతులు దులుపుకొనే వారున్నారు. అయితే ఐఆర్‌డీఏ మీటర్‌లతో అలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు. మీటర్ వద్ద అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం లేకుండా అధునాత టెక్నాలజీతో రూపొందించారు.
సంస్థ పరిధిలో ఉన్న మొత్తం 5 లక్షల 97వేల 977 విద్యుత్ మీటర్లను మార్పు చేయనున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఐఆర్ డీఏ మీటర్లను అమర్చతున్నారు. ఒక్కొక్క ఐఆర్‌డీఏ విద్యుత్‌మీటర్ ధర రూ. 840. జిల్లా వ్యాప్తంగా వాటిని అమర్చేందుకు సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ముందుగా పట్టణాలు, మండల కేంద్రాల్లో వీటి మార్పునకు శ్రీకారం చుట్టారు.
విద్యుత్ అక్రమాలకు చెక్ !
Published Tue, May 5 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement