విద్యుత్ శాఖకు భారీ నష్టం
విజయనగరం మున్సిపాలిటీ: తుపాను బీభత్సం విద్యుత్ శాఖకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆప రేషన్ సర్కిల్ పరిధిలో తొలిరోజు అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలో సుమారు రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వారు భావిస్తున్నారు. కాగా శనివారం అర్ధరాత్రి నుంచి వీచిన భారీ ఈదురుగాలులు, కుండపోత వర్షానికి జిల్లావ్యాప్తంగా 250 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవ్వగా 4 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగారుు.
సోమవారం ఉదయం నుంచి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. 600 మంది అధికారులు సిబ్బందితో తొలిరోజు మరమ్మతు పనుల్లో పాల్గొనగా, మంగళవారం ఉదయానికి అదనంగా మరో 300 మంది సిబ్బందిని వివిధ జిల్లాల నుంచి రప్పిస్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ సి.శ్రీనివాసమూర్తి తెలిపారు. పార్వతీపురం, బొబ్బిలి మండలాల మినహా మిగిలిన 32 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపినట్టు చెప్పారు. తుపాను బీభత్సంతో జిల్లా వ్యాప్తంగా సరఫరా నిలిచిపోగా, ముందస్తుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, రక్షిత పథకాలకు సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రాధాన్యమివ్వ నున్నట్టు చెప్పారు. అలాగే సాధ్యమైనంత వేగంగా జిల్లావ్యాప్తంగా సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
కిలోమీటర్ల మేర ధ్వంసమైన విద్యుత్ వైర్లు
శృంగవరపుకోట రూరల్ : హుదూద్ తుపాను ప్రభావంతో ఆదివారం వీచిన గాలులు, వర్షానికి మండలంలోని అన్ని గ్రామాల్లోనూ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు ధ్వంసమయ్యాయి. బొడ్డవరలో 20, ముషిడిపల్లి-10, కొట్టాం-8, రేవళ్లపాలెం-9, ధర్మవరం-10, ఎస్.కోట-20, పోతనాపల్లి-6, వెంకటరమణపేట-8, తిమిడి-4, వశి-6 చొప్పున విద్యుత్ స్తం భాలు నేలకొరినట్టు సమాచారం. ఒకేసారి అన్ని గ్రామాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ పునరుద్ధరణకు ఎక్కు వ రోజులు పట్టే అవకాశం ఉందని ఏఈ దాసరి సింహాచలం తెలిపారు. వేపాడ మండలంలో 703 విద్యుత్ స్తంభాలు, 50 హెచ్‌టీ స్తంభాలు కూలి పోయాయి. మెరకముడిదాం మండలంలో 103 స్తంభాలు నేలకూలాయి.