నిఘా నిద్దరోతోందా?
విజయనగరం మున్సిపాలిటీ : అసలే విద్యుత్ సంక్షోభం... వినియోగదారులకు సరఫరా చేసేది కాస్తాకూస్తో... జరిగే కాస్త సరఫరాలో కూడా పలువురు యథేచ్ఛగా చౌర్యానికి పాల్పడుతున్నారు. దీంతో ఏపీఈపీడీసీఎల్ నష్టాల బాట పడుతోంది. జిల్లాలో విద్యుత్ అక్రమ వాడకంపై నిఘా కొరవడుతోంది. విద్యుత్ చౌర్యం అధికమవుతోంది. నిఘా విభాగం చర్యలు అంతంతమాత్రం కావడంతో చోరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అరకొర తనిఖీలకే ఏటా 1500 పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. సీరియస్‌గా దాడులు నిర్వహించాల్సి వస్తే ఈ సంఖ్య మరింత పెరగవచ్చని చెప్పవచ్చు. వాస్తవానికి విద్యుత్ చౌర్యాన్ని నిరోధించేందుకు ఏపీఈపీడీసీఎల్ సంస్థ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేసింది.
ఈ నిఘా విభాగానికి అనుబంధంగా ఎఫ్‌ఐఆర్ నమోదు, నిందితుల అరెస్టుకు వీలుగా ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో పోలీస్ విభాగం ఉంది. అయితే విద్యుత్ చౌర్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టే విషయంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది లేకుండా తాము మాత్రం ఏమి చేయగలమంటూ నిఘా విభాగం అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో మొత్తం 6 లక్షల 2వేల 376 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో 5 లక్షల 24వేల 73 గృహావసర, 24వేల 228 వ్యవసాయ, 2వేల 708 ఎల్‌టీ, 200 హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలినవి వాణిజ్య కనెక్షన్లు. ఈ విద్యుత్ కనెక్షన్లు అన్నింటినీ జిల్లాలో ఉన్న విద్యుత్ నిఘా విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలి. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం, అక్రమ వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే స్పందించి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది.
అయితే సిబ్బంది కొరతతో జిల్లాలో దాడులు అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పాలి. వాస్తవానికి జిల్లా పరిధిలో విద్యుత్ చౌర్యాన్ని నిరోధించేందుకు ఏర్పాటు చేసిన నిఘా విభాగంలో ఒక డీఈ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఏడీఈలు, ఐదుగురు ఏఈలు ఉండాల్సి ఉంది. అంతమంది సిబ్బంది లేకపోవడంతో వీరు క్షేత్ర స్థాయిలో పూర్తి నిఘా పెట్టలేకపోతున్నారు. ఈపీడీసీఎల్ సాంకేతిక విభాగం ముందడుగులో ఉన్నా చౌర్యాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు చిత్తశుద్ధితో తనిఖీలు జరిపితే మరిన్ని కేసులు నమోదవుతాయని సంబంధిత శాఖ అధికారు లే పేర్కొంటున్నా ఆ దిశగా అధికారులు ఎంత వరకు సఫలీకృతులు అవుతారో వేచి చూడాలి.
నాలుగేళ్లలో 6,723 కేసులు నమోదు...
అసలే నష్టాల బాటలో పయనిస్తున్న ఏపీఈపీడీసీఎల్ అధికారులకు మొండి బకాయిల దారులు వేధిస్తుంటే మరో వైపు విద్యుత్ చౌర్యం కేసులు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉన్న కాస్త సిబ్బందితో జిల్లాలో అధికారులు అడపాదడపా దాడులు నిర్వహిస్తే గత మూడేళ్లలో 6,723 విద్యుత్ చౌర్యం కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. సంబంధిత చోరుల నుంచి రూ.6 కోట్ల 39 లక్షలు వసూలు చేశారు. ఇందులో అక్రమంగా విద్యుత్ వాడకం, మాల్‌ప్రాక్టీస్‌లు, అదనపు విద్యుత్ వాడకం, మీటర్లు తిరగకపోయినా సమాచారం అందించకపోయిన కేసులు నమోదవుతుంటాయి.
ఇందులో 2010-11 ఆర్థిక సంవత్సరంలో 1983 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు కాగా వారి నుంచి రూ3.08 కోట్లు వసూలు చేశారు. 2011-12 సంవత్సరంలో 1,722 కేసులు నమోదు కాగా 1.59 కోట్లు సంబంధిత చోరులకు అపరాధ రుసుం విధించారు. 2012-13 సంవత్సరంలో 2 వేల 541 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు కాగా అపరాధ రుసుం రూపంలో రూ.1.72 కోట్లు విధించారు. 2013-14 సంవత్సరంలో మొత్తం 477 కేసులు నమోదు చేయగా వారి నుంచి రూ.19.71 లక్షల అపరాధ రుసుం వసూలు చేయగలిగారు. గడిచిన కొద్ది ఏళ్లతో పోల్చితే 2013-14 సంవత్సరంలో విద్యుత్ చౌర్యం కేసులు తక్కువ సంఖ్యలో నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా అధికారులు చోరుల పట్ల ఉదాసీన వైఖరి అవలంభించటం వల్ల చోరుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.