పంటనష్టం గణనకు విద్యుత్ కష్టాలు
- గడువు ముగిసినా సిద్ధం కాని జాబితా
- విద్యుత్ లేక వ్యవసాయ కార్యాలయంలో అవస్థలు
- నష్టం వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచలేని పరిస్థితి
- విద్యుత్ వస్తేనే ప్రభుత్వానికి నివేదిక
పంట నష్టం గణనకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. రైతులకే కాదు..వ్యవసాయ శాఖాధికారులనూ విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. మైదానంలో ఎన్యూమరేషన్ పూర్తయినప్పటికీ.. ఆ వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచలేని పరిస్థితి. దీంతో పంట నష్టం జాబితా రూపకల్పనకు జాప్యం జరుగుతోంది. వ్యవసాయ శాఖ కార్యాలయానికి విద్యుత్ పునరుద్ధరణ జరిగితేగాని జాబితాను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం లేదని అధికారులే పేర్కొంటున్నారు.
విశాఖ రూరల్: హుదూద్‌కు జిల్లాలో ఆహార పంటలు 62,709 హెక్టార్లలోను, ఉద్యాన పంటలు 51,688 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆహార పంటల ఎన్యూమరేషన్ కోసం పది రోజుల క్రితం 145 బృందాలు, హార్టికల్చర్‌కు 53 టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఉద్యాన పంటలకు సంబంధించి ఈ బృందాల సంఖ్య సరిపోకపోవడంతో ఇతర జిల్లా నుంచి అధికారులను రప్పించి మరో 37 టీమ్‌లు వేశారు.
గత నెల 31వ తేదీకి ఎన్యూమరేషన్ పూర్తి చేయాని అధికారులు నిర్ణయించారు. అయితే అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వర కు మైదానంలోని ఏడు వ్యవసాయ డివిజన్లలో క్షేత్ర స్థాయిలో పంట నష్టం గణన పూర్తయింది. ఏజె న్సీలో 11 మండలాల్లో పూర్తికి మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ కష్టాలు
నష్టం వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అంచనా బృందాలకు ట్యాబ్లెట్లను కూడా అందజేసింది. తుపానుకు సమాచార వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ఇంటర్నెట్ పూర్తిగా పడకేసింది. ఫలితంగా నష్టం వివరాలను ట్యాబ్లెట్ల ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపర్చలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఆఫ్‌లైన్‌లో జాబితాను సిద్ధం చేయడానికి కూడా విద్యుత్ కూడా లేకపోవడంతో బృందాలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. కనీసం ఆ వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి ఇక్కడ అప్‌లోడ్ చేద్దామన్నా అవకాశం లేకుండా పోతోంది.
వ్యవసాయ శాఖ కార్యాలయానికి కూడా విద్యుత్ లేదు. అత్యవసర కార్యకలాపాలకు మాత్రం జనరేటర్‌ను గంట పాటు వినియోగిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం ఉన్న మండల కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో జాబితాను రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నప్పటికీ అక్కడ కూడా విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో నష్టం జాబితా సిద్ధమైనా ప్రభుత్వానికి నివేదించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రైతులకు పరిహారం మంజూరుకు మరింత జాప్యం జరగనుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టిసారించకుంటే అంచనాల జాబితా రూపకల్పన ఇప్పట్లో పూర్తయ్యే అవకాశముండదు.