Enyumaresan
-
పంటనష్టం గణనకు విద్యుత్ కష్టాలు
గడువు ముగిసినా సిద్ధం కాని జాబితా విద్యుత్ లేక వ్యవసాయ కార్యాలయంలో అవస్థలు నష్టం వివరాలను ఆన్లైన్లో పొందుపరచలేని పరిస్థితి విద్యుత్ వస్తేనే ప్రభుత్వానికి నివేదిక పంట నష్టం గణనకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. రైతులకే కాదు..వ్యవసాయ శాఖాధికారులనూ విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. మైదానంలో ఎన్యూమరేషన్ పూర్తయినప్పటికీ.. ఆ వివరాలు ఆన్లైన్లో పొందుపరచలేని పరిస్థితి. దీంతో పంట నష్టం జాబితా రూపకల్పనకు జాప్యం జరుగుతోంది. వ్యవసాయ శాఖ కార్యాలయానికి విద్యుత్ పునరుద్ధరణ జరిగితేగాని జాబితాను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం లేదని అధికారులే పేర్కొంటున్నారు. విశాఖ రూరల్: హుదూద్‌కు జిల్లాలో ఆహార పంటలు 62,709 హెక్టార్లలోను, ఉద్యాన పంటలు 51,688 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆహార పంటల ఎన్యూమరేషన్ కోసం పది రోజుల క్రితం 145 బృందాలు, హార్టికల్చర్‌కు 53 టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఉద్యాన పంటలకు సంబంధించి ఈ బృందాల సంఖ్య సరిపోకపోవడంతో ఇతర జిల్లా నుంచి అధికారులను రప్పించి మరో 37 టీమ్‌లు వేశారు. గత నెల 31వ తేదీకి ఎన్యూమరేషన్ పూర్తి చేయాని అధికారులు నిర్ణయించారు. అయితే అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వర కు మైదానంలోని ఏడు వ్యవసాయ డివిజన్లలో క్షేత్ర స్థాయిలో పంట నష్టం గణన పూర్తయింది. ఏజె న్సీలో 11 మండలాల్లో పూర్తికి మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ కష్టాలు నష్టం వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అంచనా బృందాలకు ట్యాబ్లెట్లను కూడా అందజేసింది. తుపానుకు సమాచార వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ఇంటర్నెట్ పూర్తిగా పడకేసింది. ఫలితంగా నష్టం వివరాలను ట్యాబ్లెట్ల ద్వారా ఆన్లైన్లో పొందుపర్చలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఆఫ్‌లైన్‌లో జాబితాను సిద్ధం చేయడానికి కూడా విద్యుత్ కూడా లేకపోవడంతో బృందాలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. కనీసం ఆ వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి ఇక్కడ అప్లోడ్ చేద్దామన్నా అవకాశం లేకుండా పోతోంది. వ్యవసాయ శాఖ కార్యాలయానికి కూడా విద్యుత్ లేదు. అత్యవసర కార్యకలాపాలకు మాత్రం జనరేటర్‌ను గంట పాటు వినియోగిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం ఉన్న మండల కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో జాబితాను రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నప్పటికీ అక్కడ కూడా విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో నష్టం జాబితా సిద్ధమైనా ప్రభుత్వానికి నివేదించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రైతులకు పరిహారం మంజూరుకు మరింత జాప్యం జరగనుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టిసారించకుంటే అంచనాల జాబితా రూపకల్పన ఇప్పట్లో పూర్తయ్యే అవకాశముండదు. -
లెక్కలు తప్పుతున్నాయి
ఇళ్ల నష్టం అంచనాలపై అనేక అనుమానాలు తుపానుకు దెబ్బతిన్న వారం రోజులకు ఎన్యూమరేషన్ ఇప్పటికే కొంత మంది ఇళ్లను బాగుచేయించుకున్న వైనం వీరికి పరిహారం మాటేమిటి? 2 రోజుల్లో అంచనాలు పూర్తవుతాయంటున్న మంత్రులు ఇంకా పలు ప్రాంతాలకు వెళ్లని బృందాలు తుపాను నష్టం అంచనాలపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. ఎన్యూమరేషన్ తీరు పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల భిన్న ప్రకటనలు తుపాను బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అంచనాల రూపకల్పన పూర్తవుతుందని చెబుతున్నప్పటికీ.. ఇంకా వేల మంది బాధితుల వివరాలు సేకరించాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడువు సమీపిస్తున్నా అంచనా బృందాలు రాలేదన్న ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. విశాఖ రూరల్ : హుదూద్ ధాటికి జిల్లాలో లక్షకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో రోడ్ల మీదకు వచ్చారు. మరికొందరు దెబ్బతిన్న ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. జిల్లా ప్రజల ఆస్తుల నష్టాలపై అధికారులు 176 బృందాలను ఏర్పాటు చేశారు. తొలిదశలో ఇళ్లు, ఇతర ఆస్తులు, మరణాలు, జంతు మరణాలును లెక్కించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం మూడు రోజుల క్రింత ఈ బృందాలు ఎన్యుమరేషన్‌ను ప్రారంభించాయి. ఇప్పటి వరకు 90 శాతం బాధితుల వివరాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 68,254 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగనుంది. ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో అర్బన్‌లో పక్కా గృహాలు 21, రూరల్‌లో 106 మొత్తం 127 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని లెక్కలు తేల్చారు. పూరిళ్లు అర్బన్‌లో 30, రూరల్‌లో 1720 మొత్తంగా 2050 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని గుర్తించారు. అలాగే పక్కా ఇళ్లు అర్బన్‌లో 203, రూరల్ 642, పూరిళ్లు అర్బన్‌లో 2229, రూరల్ 3065 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. అదే విధంగా పక్కా గృహాలు అర్బన్‌లో 1355, రూరల్‌లో 4627, పూరిళ్లు అర్బన్‌లో 14,740, పూరిళ్లు 17,970, గుడిసెలు అర్బన్‌లో 6774, రూరల్‌లో 14,472 స్వల్పం గా దెబ్బతిన్నట్లు బృందాలు పరిశీలనలో వెల్లడైంది. తుది గడువుపై గందరగోళం ఎన్యూమరేషన్ గడువుపై గందరగోళం నెలకొంది. ఈ నెల 22వ తేదీ నాటికి నష్టం అంచనా ప్రక్రియ పూర్తవుతుందని మంత్రులు చెబుతున్నారు.అసలు కొన్ని ప్రాంతాలకు బృందాలు వెళ్లలేదన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ 29వ వార్డు అచ్చయ్యమ్మపేటలో సహాయ కార్యక్రమాలు అందించకపోగా నష్టం అంచనాలకు ఏ ఒక్కరు రాలేదని భారీ సంఖ్యలో మహిళలు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అలాగే చాలా ప్రాంతాలకు బృందాలు పర్యటించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌కు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మంత్రులు కేవలం రె ండు రోజుల్లో అంచనాలు పూర్తి చేస్తామని చెప్పడంతో నష్టపరిహారం తమకు అందదేమోనని బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఇళ్లు బాగుచేయించుకున్న వారి పరిస్థితేమిటి తుపానుకు దెబ్బతిన్న ఇళ్లను కొందరు బాగు చేయించుకున్నారు. అంచనా బృందాలు వచ్చి పరిశీలన చేసినంత వరకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండలేమని భావించి కొందరు అప్పులు చేసి ఇళ్లకు మరమ్మతులు చేపట్టారు. ఇటువంటి వారికి నష్టపరిహారం ఏ విధంగా అందిస్తారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. దీంతో అటువంటి బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయంపై అధికారులు, మంత్రులు దృష్టి సారించని పక్షంలో బాధితులకు న్యాయం జరిగే అవకాశముండదు. -
నేటి నుంచి నష్టం అంచనా
ఎన్యూమరేషన్‌కు 176 బృందాలు జోనల్ ఆఫీసర్లుగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, డిప్యూటీ కలెక్టర్లు ఒక్కొక్కరికి ఆరు వార్డులు/ మండలం బాధ్యత వీరిపై పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు విశాఖ రూరల్: హుదూద్ తుపాను నష్టం అంచనా గురువారం నుంచి చేపడుతున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం భావి స్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 176 బృందాలను ఏర్పాటు చేసింది. నష్టం అంచనా నిష్పక్షపాతంగా జరిగేందుకు ఇతర జిల్లాల అధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులుండే వీటిల్లో స్థానిక తహశీల్దార్, వీఆర్వో కూడా ఉంటారు. పం టలు, గృహాలు, మరణాలతో పాటు ఇతర నష్టాలను గురువారం నుంచి ఈ బృందాలు వారికి కేటాయించిన మండలాలు, వార్డుల్లో సర్వే చేయనున్నాయి. జోనల్ అధికారులుగా ఐఏఎస్‌లు ఈ 176 బృందాల పనితీరును పరిశీలించేందుకు జోన ల్ అధికారులుగా 35 మంది ఐఏఎస్‌లను నియమిం చారు. వీరితో పాటు ఐఎఫ్ఎస్, డిప్యూటీ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు కూడా ఆ బాధ్యతలను అప్పగించా రు. ఒక్కో జోనల్ అధికారికి జీవీఎంసీ పరిధిలో అయితే ఆరు వార్డులు, గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక మం డలాన్ని కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 24 వార్డులను లేదా రూరల్‌లో ఏడు మండలాలను కలిపి ఒక జోన్‌గా విభజించారు. ఒక్కో జోన్లో నష్టం అంచనాల పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ను నియమించారు. ఎల్.వి.సుబ్రహ్మణ్యం, శ్యాంబా బు, అనిల్చంద్రపునీఠా, మన్మోహన్సింగ్, చొత్రాయ్, ఉషారాణి, కృష్ణయ్య(రిటైర్డ్)లు ఎన్యూమరేషన్‌ను పర్యవేక్షించనున్నారు. వారం రోజుల్లో పూర్తి నష్టం అంచనాలను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాప్యం జరిగే కొద్దీ బాధితులు మరింత నష్టపోతారని భావిస్తున్నారు.గత ఏడాది తుఫాన్ నష్టాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. అంచనాల రూపల్పనకు జాప్యంవల్లే ఇలా జరిగిందని అధికారుల మాట. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా బాధితులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర బృందం వచ్చేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఆ అంచనాలను కేంద్రం ముందుంచి భారీగా పరిహారాన్ని రాబట్టాలని యోచిస్తున్నారు.