లెక్కలు తప్పుతున్నాయి | Estimates of damage to homes, many suspected | Sakshi
Sakshi News home page

లెక్కలు తప్పుతున్నాయి

Published Tue, Oct 21 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

Estimates of damage to homes, many suspected

  • ఇళ్ల నష్టం అంచనాలపై అనేక అనుమానాలు
  •  తుపానుకు దెబ్బతిన్న వారం రోజులకు ఎన్యూమరేషన్
  •  ఇప్పటికే కొంత మంది ఇళ్లను బాగుచేయించుకున్న వైనం
  •  వీరికి పరిహారం మాటేమిటి?
  •  2 రోజుల్లో అంచనాలు పూర్తవుతాయంటున్న మంత్రులు
  •  ఇంకా పలు ప్రాంతాలకు వెళ్లని బృందాలు
  • తుపాను నష్టం అంచనాలపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. ఎన్యూమరేషన్ తీరు పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల భిన్న ప్రకటనలు తుపాను బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అంచనాల రూపకల్పన పూర్తవుతుందని చెబుతున్నప్పటికీ.. ఇంకా వేల మంది బాధితుల వివరాలు సేకరించాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడువు సమీపిస్తున్నా అంచనా బృందాలు రాలేదన్న ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి.
     
    విశాఖ రూరల్ : హుదూద్ ధాటికి జిల్లాలో లక్షకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో రోడ్ల మీదకు వచ్చారు. మరికొందరు దెబ్బతిన్న ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. జిల్లా ప్రజల ఆస్తుల నష్టాలపై అధికారులు 176 బృందాలను ఏర్పాటు చేశారు. తొలిదశలో ఇళ్లు, ఇతర ఆస్తులు, మరణాలు, జంతు మరణాలును లెక్కించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం మూడు రోజుల క్రింత ఈ బృందాలు ఎన్యుమరేషన్‌ను ప్రారంభించాయి. ఇప్పటి వరకు 90 శాతం బాధితుల వివరాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు.

    తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 68,254 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగనుంది. ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో అర్బన్‌లో పక్కా గృహాలు 21, రూరల్‌లో 106 మొత్తం 127 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని లెక్కలు తేల్చారు. పూరిళ్లు అర్బన్‌లో 30, రూరల్‌లో 1720 మొత్తంగా 2050 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని గుర్తించారు.

    అలాగే పక్కా ఇళ్లు అర్బన్‌లో 203, రూరల్ 642, పూరిళ్లు అర్బన్‌లో 2229, రూరల్ 3065 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. అదే విధంగా పక్కా గృహాలు అర్బన్‌లో 1355, రూరల్‌లో 4627, పూరిళ్లు అర్బన్‌లో 14,740, పూరిళ్లు 17,970, గుడిసెలు అర్బన్‌లో 6774, రూరల్‌లో 14,472 స్వల్పం గా దెబ్బతిన్నట్లు బృందాలు పరిశీలనలో వెల్లడైంది.
     
    తుది గడువుపై గందరగోళం

    ఎన్యూమరేషన్ గడువుపై గందరగోళం నెలకొంది. ఈ నెల 22వ తేదీ నాటికి నష్టం అంచనా ప్రక్రియ పూర్తవుతుందని మంత్రులు చెబుతున్నారు.అసలు కొన్ని ప్రాంతాలకు బృందాలు వెళ్లలేదన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ 29వ వార్డు అచ్చయ్యమ్మపేటలో సహాయ కార్యక్రమాలు అందించకపోగా నష్టం అంచనాలకు ఏ ఒక్కరు రాలేదని భారీ సంఖ్యలో మహిళలు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అలాగే చాలా ప్రాంతాలకు బృందాలు పర్యటించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌కు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మంత్రులు కేవలం రె ండు రోజుల్లో అంచనాలు పూర్తి చేస్తామని చెప్పడంతో నష్టపరిహారం తమకు అందదేమోనని బాధితుల్లో ఆందోళన నెలకొంది.
     
    ఇళ్లు బాగుచేయించుకున్న వారి పరిస్థితేమిటి

    తుపానుకు దెబ్బతిన్న ఇళ్లను కొందరు బాగు చేయించుకున్నారు. అంచనా బృందాలు వచ్చి పరిశీలన చేసినంత వరకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండలేమని భావించి కొందరు అప్పులు చేసి ఇళ్లకు మరమ్మతులు చేపట్టారు. ఇటువంటి వారికి నష్టపరిహారం ఏ విధంగా అందిస్తారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. దీంతో అటువంటి బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయంపై అధికారులు, మంత్రులు దృష్టి సారించని పక్షంలో బాధితులకు న్యాయం జరిగే అవకాశముండదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement