నడిగడ్డకు మహర్దశ
- కరెంట్ కష్టాలు తీర్చే భారీ విద్యుత్ ప్రాజెక్టులు
- సాగునీటి, ప్రాజెక్టుల కేంద్రంగా గద్వాల
- ‘జూరాల- పాకాల’ ఇక్కడి నుంచే ప్రారంభం
- రైల్వే, జాతీయ రహదారులతో రవాణా వ్యవస్థ
- తాగునీరు ఇచ్చేందుకు తాగునీటి పథకాలు
గద్వాల: కృష్ణా, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతమైన నడిగడ్డకు ఇక మహర్దశ కలుగనుంది. ఇప్పటికే విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు నిలయంగా మారిన ఈ ప్రాంతం ఇక రాష్ట్రానికి వె లుగులు పంచే ముఖ్యకేంద్రంగా కూడా మారనుంది. తాజాగా గద్వాలలో సోలార్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నడిగడ్డ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని సంకల్పించిన తరుణంలో ఈ ప్రాంత అభివృద్ధి మరింత ఊపందుకోనుంది.
దాదాపు 2500 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు, 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రతిపాదించిన పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల- పాకాల వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు గద్వాల కేంద్రంగానే ప్రారంభం కానున్నాయి. దీనికితోడు జూరాల రిజర్వాయర్ ఆధారంగా భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. జిల్లాలో సగం ప్రాంతానికి సాగునీటిని అందించే పథకాలు జూరాల రిజర్వాయర్ ఆధారంగానే పనిచేస్తున్నాయి.
జూరాలతో జలకళ..
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా కృష్ణానదిపై ధరూరు మండలం వద్ద ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును 1981లో నిర్మాణం ప్రారంభించి, 1996లో ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. జిల్లాకు అవసరమైన పెండింగ్ ప్రాజెక్టులను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరి ఇచ్చింది. దీంతో గద్వాల అభివృద్ధి వేగవంతం కావడానికి మరింత తోడైంది. జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, భీమా ప్రాజెక్టులు ఈ ఖరీఫ్ నుంచి సాగునీటిని అందించేందుకు పూర్తయ్యాయి. ఆర్డీఎస్ ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గంలో సాగునీటిని అందిస్తూనే ఉంది.
విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో..
జూరాల ప్రాజెక్టు వద్ద 240 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి ప్రారంభమైంది. లోయర్ జూరాల వద్ద మరో 240 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం మరో ఏడాదిలోగా అందుబాటులోకి రానుంది. గట్టు మండలంలో నాలుగేళ్ల క్రితమే ప్రైవేట్‌రంగంలో 35 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు భూ సేకరణ జరిగింది. జూరాల వద్ద జెన్‌కో ఆధ్వర్యంలో ఒక మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తి విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ లోటును భర్తీచేసేందుకు గద్వాల ప్రాంతంలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గద్వాల రైల్వే జంక్షన్, జూరాల రిజర్వాయర్ ఆధారంగా వెయ్యి మెగావాట్ల మరో సూపర్ థర్మల్ కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రతిపాదన చేశారు.
త్వరలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. గద్వాలలో రైల్వే జంక్షన్ ఏర్పాటుతో... నిజాం నవాబు కాలంలోనే గద్వాల రైల్వే స్టేషన్‌ను జంక్షన్‌గా మార్చేం దుకు భూమిని కేటాయించారు. రాయిచూర్- మాచర్ల రైల్వేలైన్ ప్రతి పాదనలో ప్రస్తుతం గద్వాల - రాయిచూర్ మధ్య పనులు పూర్తయ్యాయి. దీంతో గద్వాల రైల్వేస్టేషన్ జంక్షన్‌గా అవతరించింది. రవాణారంగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు గద్వాలకు కొత్త రైల్వేలైన్ ద్వారా మెరుగుపడ్డాయి. దీనికితోడు జూరాల ప్రాజెక్టుకు దిగువన డబుల్‌లైన్ బ్రిడ్జి నిర్మాణానికి నీటిపారుదల శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇవి పూర్తయితే రోడ్డు రవాణా సౌకర్యాలు మరింత పెరుగుతాయి. గద్వాల డివి జన్‌లో జాతీయ రహదారులు ఉండడం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి తోడయ్యాయి. ఇప్పటికే దేశంలోనే అతి పొడవైన 44వ జాతీయ రహదారి ఉండగా, నాగల్‌దిన్నె, జూరాల ప్రాజెక్టు బ్రిడ్జి ద్వారా మరో రాష్ట్ర రహదారి గద్వాల డివిజన్ అంతట అభివృద్ధికి తోడయ్యే అవకాశం ఉంది. ఇలా గద్వాల అన్నిరంగాల్లో వేగవంతంగా అభివృద్ధి చెందడం జిల్లా కేంద్రానికి అవసరమైన అర్హతలు సాధించినట్లయింది.