జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేస్తున్న ప్రజారోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులు
బొబ్బిలి: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రూ.261.02 కోట్ల ఏఐఐబీ(ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్) నిధులతో సమగ్ర తాగునీటి పథకాలను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. మున్సిపాల్టీల సమీపాల్లో ఉన్న నదుల్లో ఇన్‌ఫిల్టర్ బావులను నిర్మించి అధునాతన తాగునీటి పథకాలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పైప్‌లైన్ల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖతో కలసి ప్రజారోగ్య శాఖ సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పరిపాలనామోదం పొందడంతో ఇక నిర్మాణాలే మిగిలాయి.
మొదలైన అధికారుల పరిశీలన
తాగునీటి పథకాల నిర్మాణం కోసం మంజూరైన రూ.261 కోట్ల నిధులను రెండేసి ప్యాకేజీలుగా విభజించారు. పార్వతీపురం మున్సిపాలిటీకి రూ.63.63 కోట్లు, బొబ్బిలికి రూ.93.62 కోట్లు, సాలూరుకు రూ.68.98 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి రూ.34.97 కోట్లు కేటాయించారు ఈ నిధులను రెండు ఫేజ్‌లుగా విభజించారు. జిల్లాలోని పట్టణ సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణం కోసం మెయిన్ పైప్‌లైన్లు, డిస్ట్రిబ్యూటరీ లైన్లను నిర్మించాల్సి ఉంది. వీటిని మున్సిపాలిటీల్లోని ప్రధాన రోడ్ల వెంబడి నిర్మిస్తారు. ఇందుకోసం ఆర్‌అండ్‌బీ రోడ్లను దాదాపు నాలుగు మీటర్ల వెడల్పుతో తవ్వాల్సి ఉంది. వీటిని తవ్వాలంటే ఆ శాఖ అనుమతులు తప్పనిసరి! ఇందుకోసం జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు సంయుక్తంగా పరిశీలనలు చేపడుతున్నారు. బొబ్బిలి పరిశీలనలో ఆర్‌అండ్‌బీ ఈఈ కె.చంద్రన్, ప్రజారోగ్య ఈఈ ఎ.కృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ఏఈ ఐ.వి.ఎస్.జగన్నాతరావు, మున్సిపల్ డీఈఈ రమేష్, ఏఈ షమీమ్, ఇతర సిబ్బంది పైపుల కోసం తవ్వాల్సిన రోడ్లను పరీశీలించారు.
రెండు ఫేజుల్లో మంజూరు ఇలా...
పట్టణ సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణంలో భాగంగా మంజూరైన రూ.261 కోట్లను రెండు ఫేజులుగా విభజించారు. ఇందులో పార్వతీపురం మున్సిపాలిటీకి మొదటి విడత రూ. 31.19 కోట్లు, రెండో విడత రూ.32.44 కోట్లు, బొబ్బిలికి రూ,55.06 కోట్లు, రెండో విడత రూ.38.02 కోట్లు, సాలూరుకు మొదటి విడత రూ.44.54కోట్లు, రెండో విడత రూ.24.44 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి మొదటి విడత రూ.17.64 కోట్లు, రెండో విడత రూ.17.33 కోట్లు మంజూరు చేస్తున్నారు. రెండో ఫేజ్ టెండర్ల ప్రక్రియ ముగియగా మొదటి ఫేజ్ పెండింగ్‌లో ఉంది.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం
నిధులు మంజూరైన సమగ్ర తాగునీటి పథకాలకు సంబంధించి మొదటి, రెండో ఫేజుల్లో నిధులు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని టెండర్ల దశకు చేరుకున్నాయి. అవి పూర్తవ్వగానే పనులు ప్రారంభిస్తాం.
– ఎ.కృష్ణారావు, ఈఈ, ప్రజారోగ్య శాఖ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment