water schemes
-
దాహం తీరనుంది..!
బొబ్బిలి: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రూ.261.02 కోట్ల ఏఐఐబీ(ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్) నిధులతో సమగ్ర తాగునీటి పథకాలను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. మున్సిపాల్టీల సమీపాల్లో ఉన్న నదుల్లో ఇన్‌ఫిల్టర్ బావులను నిర్మించి అధునాతన తాగునీటి పథకాలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పైప్లైన్ల నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖతో కలసి ప్రజారోగ్య శాఖ సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పరిపాలనామోదం పొందడంతో ఇక నిర్మాణాలే మిగిలాయి. మొదలైన అధికారుల పరిశీలన తాగునీటి పథకాల నిర్మాణం కోసం మంజూరైన రూ.261 కోట్ల నిధులను రెండేసి ప్యాకేజీలుగా విభజించారు. పార్వతీపురం మున్సిపాలిటీకి రూ.63.63 కోట్లు, బొబ్బిలికి రూ.93.62 కోట్లు, సాలూరుకు రూ.68.98 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి రూ.34.97 కోట్లు కేటాయించారు ఈ నిధులను రెండు ఫేజ్‌లుగా విభజించారు. జిల్లాలోని పట్టణ సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణం కోసం మెయిన్ పైప్లైన్లు, డిస్ట్రిబ్యూటరీ లైన్లను నిర్మించాల్సి ఉంది. వీటిని మున్సిపాలిటీల్లోని ప్రధాన రోడ్ల వెంబడి నిర్మిస్తారు. ఇందుకోసం ఆర్అండ్బీ రోడ్లను దాదాపు నాలుగు మీటర్ల వెడల్పుతో తవ్వాల్సి ఉంది. వీటిని తవ్వాలంటే ఆ శాఖ అనుమతులు తప్పనిసరి! ఇందుకోసం జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు సంయుక్తంగా పరిశీలనలు చేపడుతున్నారు. బొబ్బిలి పరిశీలనలో ఆర్అండ్బీ ఈఈ కె.చంద్రన్, ప్రజారోగ్య ఈఈ ఎ.కృష్ణారావు, ఆర్అండ్బీ ఏఈ ఐ.వి.ఎస్.జగన్నాతరావు, మున్సిపల్ డీఈఈ రమేష్, ఏఈ షమీమ్, ఇతర సిబ్బంది పైపుల కోసం తవ్వాల్సిన రోడ్లను పరీశీలించారు. రెండు ఫేజుల్లో మంజూరు ఇలా... పట్టణ సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణంలో భాగంగా మంజూరైన రూ.261 కోట్లను రెండు ఫేజులుగా విభజించారు. ఇందులో పార్వతీపురం మున్సిపాలిటీకి మొదటి విడత రూ. 31.19 కోట్లు, రెండో విడత రూ.32.44 కోట్లు, బొబ్బిలికి రూ,55.06 కోట్లు, రెండో విడత రూ.38.02 కోట్లు, సాలూరుకు మొదటి విడత రూ.44.54కోట్లు, రెండో విడత రూ.24.44 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి మొదటి విడత రూ.17.64 కోట్లు, రెండో విడత రూ.17.33 కోట్లు మంజూరు చేస్తున్నారు. రెండో ఫేజ్ టెండర్ల ప్రక్రియ ముగియగా మొదటి ఫేజ్ పెండింగ్‌లో ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం నిధులు మంజూరైన సమగ్ర తాగునీటి పథకాలకు సంబంధించి మొదటి, రెండో ఫేజుల్లో నిధులు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని టెండర్ల దశకు చేరుకున్నాయి. అవి పూర్తవ్వగానే పనులు ప్రారంభిస్తాం. – ఎ.కృష్ణారావు, ఈఈ, ప్రజారోగ్య శాఖ, విజయనగరం -
‘జల’గాటం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగునీరు..రైతులకు ఎంతో విలువైనది. ఇటు ఖరీఫ్, అటు రబీ సీజన్లలో పంటలు చేతికొచ్చే దశలో నీరందకుంటే కర్షకుడి పరిస్థితి తలకిందులే. ఇలాంటి కష్టం నుంచి గట్టెక్కించేందుకు, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో భూగర్భ జలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు జలనిధి పథకంపై కనీస ప్రచారం లేకపోవడంతో ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు జలనిధి (ఫారంపాండ్లు) నిర్మించాలనేది అసలు ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాలోని ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ..అసలు పనులే చేపట్టకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 2,17,584 రైతు జలనిధి (ఫారంపాండ్లు)మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.85.23కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు కేవలం 47,109 ఫారంపాండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందుకోసం రూ.32.34 కోట్లు ఖర్చు పెట్టారు. జిల్లాలో రైతులు ఫారంపాండ్లు నిర్మించుకునేందుకు అంగీకారం తెలిపితే చాలు..నిధులు మంజూరు చేసేందుకు, అన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు నిధుల కొరత లేదు. కానీ..ప్రచారమే కరువైంది. రైతు జలనిధి అంటే.. వర్షాకాలంలో కురిసిన నీటిని నిల్వ చేసుకునేందుకు, తద్వారా భూగర్భ జలాలు పెంచుకునేందుకు ఫారంపాండ్లు నిర్మించుకునేందుకు ఈ రైతు జలనిధి పథకాన్ని చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో పడ్డ వాననీరంతా వృథాగా సమీప కుంటలు, చెరువుల్లో కలుస్తోంది. సారవంతమైన మట్టి కూడా కొట్టుకుపోతోంది. రైతు పొలంలో పడ్డ వర్షపు నీటిని పొదుపు చేసుకుని, పంట అత్యవసర సమయాల్లో తడులు కట్టుకునేందుకు ఈ రైతుజలనిధి (ఫారంపాండ్) ఎంతో ఉపయోగపడుతుంది. రైతు పొలం, పై ప్రాంతాల్లో పడిన వర్షపునీరు ఏవైపు నుంచి ప్రవహించి బయటకు వెళుతుందో..పల్లపు ప్రాంతాన్ని గుర్తించి అక్కడ జలనిధిని కుంటను నిర్మించుకోవాలి. నీటిని ఎక్కువకాలం నిల్వ చేసుకునే ఉద్దేశం ఉంటే మొత్తం ఫారంపాండ్ అడుగుభాగం నుంచి అంచుల వరకు పాలిథిన్ లేదా ప్లాస్టిక్ షీట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. నీరు ఇంకి పోకుండా కొన్ని నెలలపాటు నిల్వ ఉంటుంది. తద్వారా భూమిలో తేమశాతం పెరుగుతుంది. చుట్టుపక్కల బోర్లు, బావుల్లో నీటి లభ్యత అధికమవుతుంది. అత్యవసర సమయాల్లో నీటిని విద్యుత్ మోటార్లతోకానీ, మనుషులతో కానీ పంటకు తడి అందించొచ్చు. ఫారంపాండ్ నిర్మించుకోవడానికి రైతులు ఉపాధిహమీ జాబ్‌కార్డు వివరాలతో ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఉపాధిహామీ పథకం ఏపీఓ, ఎంపీడీఓను సంప్రదించవచ్చు. జలనిధిలో రకాలు.. ► ఉపాధి హామీ పథకంలో నాలుగు రకాల సైజుల్లో జలనిధి కుంటలను తవ్వుకోవచ్చు. ► అందుకు అవసరమైన ఖర్చు మొత్తం ఉపాధి హామీ పథకం నుంచి చెల్లిస్తారు. ► రెండు కుంటల భూమిలో నిర్మించుకునేందుకు రూ.50,588 చెల్లిస్తారు. 1.28లక్షల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు. ► కుంటన్నర భూమిలో నిర్మించుకునేందుకు రూ.32,594 చెల్లిస్తారు. 50వేల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ► కుంట భూమిలో నిర్మాణానికి రూ.23,106 చెల్లిస్తారు. 16వేల లీటర్ల వర్షపు నీరు నిలుస్తుంది. ► అర కుంట భూమికి రూ.14,926 చెల్లిస్తారు. 8వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఫారంపాండ్‌ను నిర్మిస్తారు. -
సప్లిమెంట్ మాయాజాలం!
► తాగునీటి పథకాల టెండర్లులో భారీ గోల్మాల్ ► రూ.27లక్షల టెండర్‌కు రూ.65లక్షల అదనం ► ఆ మేరకే బిల్లులు చెల్లింపులు ► ఎస్ఈ కార్యాలయం నుంచే దిశానిర్దేశం ► బినామీ కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తున్న ఈఈ, ఉన్నతాధికారి పీఏ తాగునీటి ఇక్కట్లు సత్వరమే తీర్చాలనే తలంపు లేకపోగా, నిధులను దండుకోవాలనే దిశగా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం పనిచేస్తోంది. టెండర్ల కంటే రెండురెట్లు అధికంగా సంప్లిమెంట్ అగ్రిమెంటు ద్వారా పనులు అప్పగించి బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రపంచబ్యాంకు నిధులు సైతం క్లాస్4 కాంట్రాక్టర్‌కు కేటాయిస్తూ బినామీ కాంట్రాక్టర్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఉన్నతా«ధికారి కార్యాలయం నుంచే దిశానిర్దేశం చేస్తూ కిందిస్థాయి యంత్రాంగంపై హుకుం ప్రదర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: సీపీడబ్ల్యూ స్కీమ్‌లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నుంచి పనులు పూర్తయ్యే వరకూ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోంది. కేటాయించిన దాని కంటే కేవలం 10 శాతం అదనంగా సప్లిమెంటు అగ్రిమెంటు ద్వారా పనులు అప్పగించాల్సి ఉండగా, టెండర్ కంటే రెండు నుంచి రెండున్నర్ర రెట్లు అధికంగా పెంచి అప్పగిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా యోగివేమన సీపీడబ్ల్యూ స్కీం చెప్పవచ్చు. పెండ్లిమర్రి, వల్లూరు మండలాల్లోని గ్రామాలతోపాటు వైవీయూకు నీటి పథకాన్ని రూ.27 లక్షలతో చేపట్టారు. ఆమేరకు టెండర్లు నిర్వహించి పనులు అప్పగించారు. కాగా అవే పనులకు సప్లిమెంట్ అగ్రిమెంటు కింద రూ.64.5 లక్షలు కలిపారు. అంటే ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా అదనంగా రూ.64.5లక్షల పనిని సదరు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. సప్లిమెంట్ అగ్రిమెంట్లో కేబుల్ వైరు దాదాపు రూ.50 లక్షల విలువైనది వేయాల్సి ఉంది. వాస్తవానికి టెండర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిధిలో 5 శాతం, ఎస్ఈ పరధిలో 10 శాతం, సీఈ పరిధిలో 15 శాతం పనులు మాత్రమే అప్పగించే అర్హత ఉంది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.27లక్షల పనికి రూ.64.5 లక్షల సప్లిమెంట్ అగ్రిమెంట్ అప్పగించడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని పలువురు వివరిస్తున్నారు. ఎస్టిమేట్ నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారులు ముందస్తుగా టెండరు ప్రక్రియలో చోటుచేసుకున్న విధంగా కాకుండా అనువైన రీతిలో సప్లిమెంట్ అగ్రిమెంట్ పుట్టించడం వెనుక ఎస్ఈ కార్యాలయం కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం. అధికారుల భాగస్వామితో బినామీ కాంట్రాక్టర్: ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ అధికారుల భాగస్వామ్యంతో బినామీ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో నిబంధనలను తొక్కిపెడుతున్నట్లు సమాచారం. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనులకు నిర్వహణ చేసే కాంట్రాక్టర్‌కు క్రిమినల్ కేసులు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా క్లాస్–4 కాంట్రాక్టర్‌కు లక్కిరెడ్డిపల్లెలో రూ.2కోట్ల పనులు అప్పగించినట్లు సమాచారం. ఎస్ఈ కార్యాలయం అధికారులకు అతను భాగస్వామి కావడంతో నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు పలు టెండర్లలో ఎస్ఎస్ఆర్ రేట్లు కంటే అధికంగా బిల్లులు చెల్లిస్తున్నట్లు సమాచారం. చేసిన పనులకు సైతం సత్వరమే బిల్లులు చెల్లించకుండా దాదాపు ఏడాది తర్వాత చేయని పనులకు సైతం రికార్డులు పొందుపరుస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో ఏఈ, డిఈ స్థాయి అధికారులు అడ్డంకిగా మారితే ఎస్ఈ కార్యాలయం నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉంటున్నాయి. అందులోభాగంగా పలువురు ఏఈలను పరుషపదజాలంతో ఇబ్బందిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో దాదాపు రూ.6 కోట్ల పనులు బినామీ కాంట్రాక్టర్ ద్వారా చేపట్టినట్లు సమాచారం. ఆ పనులన్నింటిలో ప్రధానంగా టెండర్ ప్రక్రియ ఒకలా ఉంటే సప్లిమెంట్ అగ్రిమెంట్ జోడిస్తూ నిధులు దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడం విశేషం. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావును వివరణ కోరగా సప్లిమెంట్ అగ్రిమెంటు విషయమై తనకు అవగాహన లేదని, పరిశీలించాల్సి ఉందని వివరించారు. ప్రపంచ బ్యాంకు నిధుల పనులు కూడా పరిశీలించనున్నట్లు వివరించనున్నారు. -
ఏం ఒరగబెట్టారని వస్తున్నారు బాబూ
- నియోజకవర్గంలో సాగు, తాగు నీటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి - లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం - వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి అనంతపురం : శింగనమల నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారని ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారో చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈనెల 6న బుక్కరాయసముద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ ఏ మేరకు చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు. రుణమాఫీ చేసిన సొమ్ము వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. రూ. 2–3 వడ్డీకి తెచ్చుకుని బ్యాంకుల్లో రెన్యూవల్ చేసుకున్నారన్నారు. కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పంటల పెట్టుబడులకు ప్రైవేటుగా అప్పులు చేశారన్నారు. వీటిపై నియోజకవర్గంలోని ఆరు మండలాల రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దని అన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ఓట్లేస్తే.. ఈరోజు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని మహిళలు వాపోతున్నారన్నారు. మోసపోయిన మహిళలకుS ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారు బయటకు రావాలంటూ బాబు అధికారంలోకి రావాలంటూ ప్రచారాలు చేశారని, ఈరోజు ఒక్క మహిళ బంగారు కూడా విడిపించలేదన్నారు. చివరకు బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వచ్చాయన్నారు. ఆ మహిళలకు ఏం సమాధానం చెబుతారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారని, కానీ రెండేళ్లు దాటినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలో వేలాదిమంది ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీటికితోడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ సమస్య తీర్చలేని చంద్రబాబు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. ఆయకట్టుకు సంబంధించి రెండేళ్లుగా చుక్క నీరు రాకపోవడంతో రైతులు తమ భూములన్నీ బీళ్లు పెట్టారన్నారు. వెనుకబడిన అనంత జిల్లాకు కేంద్రం మంజూరు చేసిన రూ. 50 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ, జిల్లా ప్రజల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ముఖ్యమత్రి పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్, పుట్లూరు మండల కన్వీనర్ రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటరామిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబాసలాం తదితరులు పాల్గొన్నారు. -
ఎడారిలా..
తడి ఆరిన రక్షిత నీటి పథకాలు పడకేసిన మంచినీటి పథకాలు వెంటాడుతున్న నిధుల కొరత కనీస మరమ్మతులకు నోచుకోని వైనం ఎండిపోతున్న చెరువులు, బావులు పాలకుల వైఫల్యంపై గ్రామస్తుల ధ్వజం నిధుల లేమి.. అధికారుల నిర్లక్ష్యం.. వెరసి గ్రామీణులకు గుక్కెడు నీరందని దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల సామూహిక రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) పడకేశాయి. ఇందులోని మోటార్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడే లేడు. తాగునీటిని సరఫరా చేసే పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడినా కనీస మరమ్మతులు చేయలేని పరిస్థితి. ఫలితంగా వేసవికి ముందే జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. విజయవాడ : జిల్లాలో 374 తాగునీటి చెరువులు ఉన్నాయి. వర్షాభావం, కాలువలకు నీటి విడుదలలో జాప్యం కారణంగా అడుగంటాయి. సామూహిక రక్షిత మంచినీటి పథకాల ద్వారా బిందెడు నీరు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందని దుస్థితి నెలకొంది. ఈ చెరువుల ఆధారంగానే రక్షిత నీటి పథకాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఉప్పునీరే దిక్కవుతోంది. ఈ నీరు తాగడం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. నిధుల కొరత గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు జిల్లా పరిషత్‌కు జమ అయ్యేవి. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పలువురు సర్పంచులు సామూహిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ఆలోచిస్తుండడంతో గ్రామీణ నీటి సరఫరా శాఖను నిధుల కొరత వేధిస్తోంది. దీనికితోడు జెడ్పీ పాలకవర్గ సభ్యులు తాగునీటి సరఫరాలో నిధులకు సంబంధించి పొదుపును పాటిస్తుండడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ బిల్లుల భారం, మోటార్ల కొనుగోలు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని వివిధ సామూహిక రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. జిల్లాలోని 717 గ్రామాలకు సీపీడబ్ల్యు పథకాల ద్వారా తాగునీరు అందించేందుకు ఏడాదికి రూ. 15.84 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా తాగునీటి కొరత తీరడం లేదు. కంచికచర్ల మండలంలోని 42 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కృష్ణానదిలో బత్తినపాడు తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. నదిలో నీరు లేకపోవడంతో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. గన్నవరం నియోజకవర్గంలో ఏలూరు కాలువపై ఆధారపడి నడుస్తున్న రక్షిత నీటి పథకాల్లో అల్లాపురం, తెంపల్లి, బాపులపాడు, పెరికీడు ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయి. సాధారణంగా ఏలూరు కాలువ నుంచి నీటిని మోటార్ల ద్వారా ఈ ప్రాజెక్టులకు తరలించాల్సి ఉంది. అనంతరం ప్రాజెక్టులోని నీటిని ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధిచేసి గ్రామాలకు సరఫరా చేస్తుంటారు. ఏడాది కాలంలో ఏలూరు కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకపోవడంతో ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల సుమారు 30 గ్రామాలకు నీటిని సరఫరా చేసే అల్లాపురం, తెంపల్లి ప్రాజెక్టులు నీరు లేక పూర్తిగా ఎండిపోయాయి. బాపులపాడు ప్రాజెక్టు నిర్మించి ఆరేళ్లయినా మరమ్మతుల కారణంగా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. పెరికీడు ప్రాజెక్టుకు నీటిని లిప్ట్ చేసే పైపులైన్లు రెండేళ్ల కిందట రోడ్డు విస్తరణలో పగిలిపోవడంతో మూలనపడింది. పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరులో 49 రక్షిత మంచినీటి పథకాలు, 17 డెరైక్ట్ పంపింగ్ స్కీములు ఉన్నాయి. 1.85 లక్షల జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చటానికి కొత్తగా నాలుగు ట్యాంకులకు శంకుస్థాపనలు చేశారు. పనులు ప్రారంభానికి నోచలేదు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 45 రక్షిత మంచినీటి పథకాలుండగా వీటిలో ఆరు పథకాలు ఆర్‌డబ్ల్యుఎస్ నిర్వహణలో ఉన్నాయి. కోడూరు, నాగాయలంక మండలాల్లోని పది గ్రామ పంచాయితీలకు తాగునీరు అందించే కమ్మనమోల రక్షిత మంచినీటి చెరువు పూర్తిగా అడుగంటింది. ఇక్కడ రెండురోజులకొకసారి ఒకపూట మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగాయలంక మండలంలో ఎదురుమొండి రక్షితనీటి పథకం పూర్తిగా ఎండిపోయింది. జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లిలో ఏర్పాటు చేసిన తాగునీటి పెలైట్ పథకం నిరుపయోగంగా మారింది. అనుమంచిపల్లి, తక్కెళ్లపాడు, గరికపాడు, రామచంద్రునిపేట గ్రామాలకు గత ఏడాది గ్రామీణ నీటి సరఫరా శాఖ రూ.2.10 కోట్ల నిధులతో పెలైట్ ప్రాజెక్టు ద్వారా పాలేటిలో బోరు వేసి నీరు అందించేందుకు చర్యలు చేపట్టింది. మైలవరం మండలంలో కృష్ణా జలాల పంపిణీకి పైలట్ ప్రాజెక్టు పనులు పూర్తయినా శివారు గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కావడంలేదు. ఆయా గ్రామాల ప్రజలు బోరునీటినే తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు, కేతనకొండ, దాములూరు, చిలుకూరు, కాచవరం, కొటికలపూడి గ్రామాల్లో తాగునీటి సమస్య వుంది. ఈ గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 450కోట్లతో పైలట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టినా పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాట్రాయి మండలంలోని చిన్నంపేట, కోటపాడు, తుమ్మగూడెం, చనుబండ, చీపురుగూడెం, పోతనపల్లిలలో గ్రామాలలో బోర్లు ఎండిపోవడం వల్ల నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పామర్రు మండలం ఐనంపూడిలో తాగునీటికి వినియోగించే బావిలో నీరు అడుగంటడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఎలకుర్రులో చెరువులు ఎండిపోవడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అధికారులు అందజేస్తున్నారు. నెమ్మలూరు తాగునీటి చెరువులో నీరు అడుగంటడంతో కొద్దిపాటిగా ఉన్న నీటినే తాగునీరుగా వాడుకుంటున్నారు. జుఝవరంలో ఫిల్టర్ బెడ్లు లేకపోవడంతో చెరువు నుంచినేరుగా కలుషిత నీరే ఉపయోగించుకుంటున్నారు. -
అంతా అడ్డగోలు !
పారదర్శకత ... నీటి పథకాల్లో సమాధి అయింది. టెండర్లు పిలవాల్సిన చోట నామినేటెడ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. టెండర్లు పిలవాలని ఆ పథకాలకు నిధులు సమకూర్చే జెడ్పీ అధికారులు కోరుతున్నా... నాయకుల ఒత్తిళ్లకు భయపడి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నాన్చుడుధోరణి అవలంభిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం ః ‘గతంలో రూ.లక్ష దాటితే ఆ పనులకు టెండర్లు పిలిచేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ నాయకులు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకు ఆ నిబంధన మార్చారు. పనుల విలువ రూ.10 లక్షలు దాటితే టెండర్లుస పిలవాలని నిర్ణయించారు’ కానీ ఇప్పుడా నిర్ణయానికి టీడీపీ నేతలు కట్టుబడడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నామినేటేడ్‌గా పనులు కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అధికారులు కూడా తలొగ్గుతున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన పనుల్ని కూడా నామినేటేడ్ పద్ధతిలో అప్పగించేశారు. ఇందుకు భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనులే ఉదాహరణ. రూ.10 లక్షలకుపైగా నిర్వహణ వ్యయం గల భారీ మంచినీటి పథకాలు జిల్లాలో 19 ఉన్నాయి. టెండర్లు పిలిచి, తక్కువగా కోట్ చేసిన వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. చీపురుపల్లి, భోగాపురం, గొట్లాం, గోస్తనీ, గెడ్డపువలస, దేవుని కనపాక, మరువాడ, పూసపాటిరేగ, భీమసింగి, భోగాపురం ఫేస్-1 తదితర పథకాలెన్నో ఉన్నాయి. వీటిలో చాలా వాటి నిర్వహణకు రూ.కోట్లలోనే వ్యయం చేస్తున్నారు. గతంలో టెండర్ల ద్వారానే ఈ ప్రక్రియ నడిచేది. షరతులకు అనుగుణంగా పనులు కట్టబెట్టడంతో తప్పు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక టెండర్ల విధానాన్ని పక్కన పెట్టి నామినేటేడ్ పద్ధతిలో కొందరు నేతలు పనులు పొందారు. అధికారులు కాదూ కూడదని చెప్పినా ఒత్తిడి చేసి, భయబ్రాంతులకు గురిచేసి తమ వశం చేసుకున్నారు. వాటాలేసుకుని నామినేటేడ్ పనులను పంచేసుకున్నారు. నామినేటెడ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఆరు నెలలు దాటింది. ఇంకా వాటికి టెండర్లు పిలవలేదు. యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పిలిచి, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని వాటికి నిధులు వెచ్చిస్తున్న జెడ్పీ అధికారులు ఉత్తర్వులిచ్చినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదు. కొన్నాళ్లు ఇలాగే వదిలేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. అశోక్ చెప్పినదానికి భిన్నంగా.... కాంగ్రెస్ హయాంలో షాడోనేత హవాపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరును నిరసిస్తూ ఆందోళనలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పలు సమావేశాల్లో మాట్లాడుతూ అటువంటి సంస్కృతి ఇకపై ఉండదని, అడ్డగోలు వ్యవహారాలు ఉండవని, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు. దీంతో ఇటు అధికారులు, అటు ప్రజలు సంతోషించారు. అయితే అశోక్ మాటలకు, వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. -
నీటి కోసం కన్నీరు
అసెంబ్లీలో విలపించిన జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగేగౌడ తన నియోజకవర్గంలో మంచినీటి పథకాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన బెంగళూరు : తన నియోజక వర్గ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందంటూ ఓ ఎమ్మెల్యే శాసనసభలోనే కన్నీరు పెట్టుకున్నారు. వివరాలు... శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తాగునీటి పథకాలకు సంబంధించిన అంశాలపై జేడీఎస్ ఎమ్మెల్యే కేఎం శివలింగేగౌడ చర్చను ప్రారంభించారు. తాగునీటి పథకం పూర్తి చేసేందుకు గాను అరసికెరె ప్రాంతంలోని 477 గ్రామాల్లో ఇప్పటికే టెండర్ ప్రక్రియను రెండేళ్ల క్రితమే పూర్తి చేశారని, అయినా ఇప్పటికీ తాగునీటిని అందజేసే పథకాన్ని ప్రారంభించలేదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ప్రజలకు తాగునీటిని అందజేయడంలో కూడా రాజకీ యాలు చేయడం ఎంత వరకు సమంజసమంటూ ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై కలగజేసుకున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ కొన్ని కారణాల వల్ల సదరు గ్రామాలకు నీటిని అందించలేకపోవడం వాస్తవమేనన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించడమే కాకుండా ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
నడిగడ్డకు మహర్దశ
- కరెంట్ కష్టాలు తీర్చే భారీ విద్యుత్ ప్రాజెక్టులు - సాగునీటి, ప్రాజెక్టుల కేంద్రంగా గద్వాల - ‘జూరాల- పాకాల’ ఇక్కడి నుంచే ప్రారంభం - రైల్వే, జాతీయ రహదారులతో రవాణా వ్యవస్థ - తాగునీరు ఇచ్చేందుకు తాగునీటి పథకాలు గద్వాల: కృష్ణా, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతమైన నడిగడ్డకు ఇక మహర్దశ కలుగనుంది. ఇప్పటికే విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు నిలయంగా మారిన ఈ ప్రాంతం ఇక రాష్ట్రానికి వె లుగులు పంచే ముఖ్యకేంద్రంగా కూడా మారనుంది. తాజాగా గద్వాలలో సోలార్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నడిగడ్డ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని సంకల్పించిన తరుణంలో ఈ ప్రాంత అభివృద్ధి మరింత ఊపందుకోనుంది. దాదాపు 2500 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు, 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రతిపాదించిన పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల- పాకాల వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు గద్వాల కేంద్రంగానే ప్రారంభం కానున్నాయి. దీనికితోడు జూరాల రిజర్వాయర్ ఆధారంగా భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. జిల్లాలో సగం ప్రాంతానికి సాగునీటిని అందించే పథకాలు జూరాల రిజర్వాయర్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. జూరాలతో జలకళ.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా కృష్ణానదిపై ధరూరు మండలం వద్ద ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును 1981లో నిర్మాణం ప్రారంభించి, 1996లో ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. జిల్లాకు అవసరమైన పెండింగ్ ప్రాజెక్టులను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరి ఇచ్చింది. దీంతో గద్వాల అభివృద్ధి వేగవంతం కావడానికి మరింత తోడైంది. జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, భీమా ప్రాజెక్టులు ఈ ఖరీఫ్ నుంచి సాగునీటిని అందించేందుకు పూర్తయ్యాయి. ఆర్డీఎస్ ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గంలో సాగునీటిని అందిస్తూనే ఉంది. విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో.. జూరాల ప్రాజెక్టు వద్ద 240 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి ప్రారంభమైంది. లోయర్ జూరాల వద్ద మరో 240 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం మరో ఏడాదిలోగా అందుబాటులోకి రానుంది. గట్టు మండలంలో నాలుగేళ్ల క్రితమే ప్రైవేట్‌రంగంలో 35 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు భూ సేకరణ జరిగింది. జూరాల వద్ద జెన్కో ఆధ్వర్యంలో ఒక మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తి విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ లోటును భర్తీచేసేందుకు గద్వాల ప్రాంతంలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గద్వాల రైల్వే జంక్షన్, జూరాల రిజర్వాయర్ ఆధారంగా వెయ్యి మెగావాట్ల మరో సూపర్ థర్మల్ కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రతిపాదన చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. గద్వాలలో రైల్వే జంక్షన్ ఏర్పాటుతో... నిజాం నవాబు కాలంలోనే గద్వాల రైల్వే స్టేషన్‌ను జంక్షన్‌గా మార్చేం దుకు భూమిని కేటాయించారు. రాయిచూర్- మాచర్ల రైల్వేలైన్ ప్రతి పాదనలో ప్రస్తుతం గద్వాల - రాయిచూర్ మధ్య పనులు పూర్తయ్యాయి. దీంతో గద్వాల రైల్వేస్టేషన్ జంక్షన్‌గా అవతరించింది. రవాణారంగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు గద్వాలకు కొత్త రైల్వేలైన్ ద్వారా మెరుగుపడ్డాయి. దీనికితోడు జూరాల ప్రాజెక్టుకు దిగువన డబుల్‌లైన్ బ్రిడ్జి నిర్మాణానికి నీటిపారుదల శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవి పూర్తయితే రోడ్డు రవాణా సౌకర్యాలు మరింత పెరుగుతాయి. గద్వాల డివి జన్‌లో జాతీయ రహదారులు ఉండడం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి తోడయ్యాయి. ఇప్పటికే దేశంలోనే అతి పొడవైన 44వ జాతీయ రహదారి ఉండగా, నాగల్‌దిన్నె, జూరాల ప్రాజెక్టు బ్రిడ్జి ద్వారా మరో రాష్ట్ర రహదారి గద్వాల డివిజన్ అంతట అభివృద్ధికి తోడయ్యే అవకాశం ఉంది. ఇలా గద్వాల అన్నిరంగాల్లో వేగవంతంగా అభివృద్ధి చెందడం జిల్లా కేంద్రానికి అవసరమైన అర్హతలు సాధించినట్లయింది. -
మమ్మల్ని కలపండి ప్లీజ్!
కోనమసివానిపాలెం(లక్కవరపుకోట):ఆ గ్రామం పేరు కోనమసిపాలెం. అక్కడ అం తా అయోమయం. గజిబిజి గందరగోళం. తమ్ముడు ఒక మండలంలో ఉంటే అన్న వేరే మండలంలో ఉంటాడు. ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో అసలు తెలీదు. ముప్పై ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్లుగా స్థానికులు అధికారులకు అధికారులకు వినతులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ వారి సమస్యను పట్టించుకోలేదు. లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం గ్రామంలో ఐదు వందల ఇళ్లున్నాయి. దాదాపు 2,500 మంది జనాభా ఉన్నారు. 1976-77లో తామరాపల్లి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి కోనమసివానిపాలెం పంచాయతీను అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామంలో కొంత భాగాన్ని కొత్తవలస మండలం దేవాడ పంచాయతీలో కలిపారు. అక్కడే అసలు సమస్య ఏర్పడింది. గ్రామం ఒక్కటే అయినప్పటికీ ప్రజలను రెండు పంచాయతీలు, రెండు మండలాల్లో కలిపారు. దీంతో ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో స్థానికులకు కూడా అయోమయంగా ఉంది. వారికి అవసరమైన ధ్రువపత్రాలను ఏ మండలంలో తీసుకోవాలో కూడా తెలీకుండా వారు అవస్థలు పడుతున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఏ పంచాయతీలో ఓటు వేయాలో కూడా తెలీదు. గ్రామంలో ఒక వీధి అవతల భాగం కొత్తవలస మండలం దేవాడ పంచాయతీ శివారు కోనమసివానిపాలెం గ్రామంగా, మరొక వైపు లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం పంచాయతీగా గుర్తింపు ఉంది. అన్నీ రెండేసే... కోనమసివానిపాలెం గ్రామం ఒక్కటే కాగా ప్రభుత్వ కార్యాలయాలు రెండేసి ఉన్నాయి. రెండు అంగన్వాడీ కేంద్రాలు, రెండు ప్రాథమిక పాఠశాలలు, రెండు రక్షిత మంచినీటి పథకాలు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు ఉన్నారు. అలాగే రెండు పంచాయతీ భవనాలు కూడా ఉన్నాయి. వృథా అవుతున్న ప్రజాధనంగ్రామంలో అన్నీ రెండేసి ఉండడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడినంత విద్యార్థులు లేకపోవడంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. గ్రామాన్ని ఒక పంచాయతీగా చేసి ఒకే మండలానికి చెందినదిగా చేయాలని స్థానికులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. -
గొంతెండుతోంది..
మూలకు చేరిన బోర్లు,పథకాలు తాగునీటి కోసం జనం అవస్థలు వేసవి కార్యాచరణకు రూ.18 లక్షలతో ప్రతిపాదన ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.5 లక్షలే 13వ ఆర్థిక సంఘం నిధులే దిక్కు గొంతెండుతోంది గుక్కెడు నీళ్లివ్వండంటూ గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బిందెడు నీటి కోసం మహిళలు కిలోమీటర్లు దూరం నడవాల్సిన దుస్థితి. మండుటెండల్లో అష్టకష్టాలు పడుతూ ఊటగెడ్డలకు వెళ్లి నీటిని సేకరిస్తున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: బావులు ఎండుతున్నా.. బోర్లు, మంచినీటి పథకాలు మూలకు చేరినా.. పట్టించుకొనే యంత్రాంగమే కరువైంది. దీనికి తోడు విద్యుత్ కోతలతో మండల కేంద్రాల్లో సైతం తాగునీటి ఎద్దడి నెలకొంది. సాధారణంగా వేసవికి ముందే తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ చేస్తుంటారు. ఈ ఏడా ది సార్వత్రిక ఎన్నికలు, కోడ్ వంటి కారణాలతో దీనిని పట్టించుకున్న వారే లేకుండాపోయారు. దీంతో జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పుడు 13వ ఆర్థిక సంఘం నిధులతో బోర్లు, మంచినీటి పథకాలు బాగు చేయాలని భావిస్తున్నారు. మూలకు చేరిన పథకాలు జిల్లాలో మొత్తం 5444 నివాస ప్రాంతాల్లో కేవలం 798 ఆవాసాల్లోనే పూర్తి స్థాయిలో నీటి వనరులున్నాయి. పాక్షిక్షంగా 4477 ప్రాంతాలకు నీటి అందిస్తుండగా.. సురక్షితం కాని నీటి వనరులు ఉన్న ప్రాంతాలు 133 వరకు ఉన్నట్లు అధికారుల గణాంకాలే చెబుతున్నాయి. అసలు నీటి సరఫరా లేని ప్రాంతాలు 36 ఉన్నాయి. జిల్లాలో 968 రక్షిత మంచినీటి పథకాలు, 1245 మినీ పథకాలు, 27 సమగ్ర రక్షిత పథకాలు ఉన్నాయి. వీటిల్లో అధిక భాగం ప్రస్తుతం మూలకు చేరినట్లు అధికారులే చెబుతున్నారు. 250 పనికిరాకుండా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. కొన్ని సక్రమంగా ఉన్నప్పటికీ విద్యుత్ కోతలు కారణంగా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో 18,069 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా నీటిచుక్కలు రాల్చడం లేదు. వీటిని బాగు చేయాలన్న ధ్యాసే అధికారులకు ఉండడం లేదు. రూ.5 లక్షలు విడుదల జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద గ్రామీణ నీటి సరఫరా అధికారులు రూ.19.43 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5 లక్షలే మంజూరు చేసింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ నిధులపై దృష్టి సారించారు. పంచాయతీ, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కొంత మొత్తాలను తాగునీటి సరఫరాకు వెచ్చించాలని యోచిస్తున్నారు. వీటిని కేవలం మంచినీటి పథకాలు, బోర్ల మరమ్మతులకే వినియోగించనున్నారు. ఊటగెడ్డలే ఆధారం గ్రామాలు,గూడేల్లో బావులు ఎండిపోయాయి. బోర్లు మూలకు చేరాయి. పథకాలు నీటిచుక్కలు రాల్చకపోవడంతో గ్రామీణులు ఊటగెడ్డలపైనే ఆధారపడుతున్నారు. కిలోమీటర్ల మేర ఎండలో వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఏజె న్సీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు, తోటవలస, అంజోడ, స్వర్ణగుడ, జాకవలస, బల్లుగుడ, చంపగుడ, ఇలా అనేక గ్రామాల్లో బోర్లు ఏళ్ల క్రితమే పాడయ్యాయి. ఆయా గ్రామాల వారు ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. నాతవరం మండలంలోనూ ఇదే దుస్థితి. వేసవి కావడంతో అవి కూడా అడుగంటిపోయాయి. గంటల తరబడి నిరీక్షిస్తే తప్పా.. బిందెడు నీరు రావడం లేదు. ఈ కలుషిత నీటి కారణంగా గ్రామీణులు రోగాల బారిన పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అరకు, డుంబ్రిగుడ మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కాలనీల్లోనూ తీవ్రమైన నీటి ఎద్దడి ఉండడం గమనార్హం. ఏటా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా.. దీర్ఘకాల ప్రణాళికలు,ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం కొట్టొస్తోంది. -
పడకేసిన మంచినీటి పథకాలు
మూడో వంతు పథకాల నుంచి అందని నీరు ప్రజల అవసరాల మేరకు లేని కుళాయిలు నీటి కోసం మహిళలకు తప్పని పాట్లు అక్కరకురాని బోరు బావులు అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్ : దాదాపు లక్ష జనాభా ఉన్న అనకాపల్లి పట్టణంలో 64 మంచినీటి పథకాలున్నాయి. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కుళాయిలు ఏర్పాటు చేశారు. బోరు బావులకు లోటు లేదు. కానీ పట్టణ వాసుల గొంతు మాత్రం ఎండుతోంది. మూడో వంతు పథకాలు మూలకు చేరడం, ఉన్న కుళాయి పాయింట్ల నుంచి సరిపడే స్థాయిలో నీరందక పోవడం, బోరుబావులున్నా సరిగా అక్కరకు రాకపోవడంతో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరడం లేదు. పట్టణం జీవీఎంసీలో విలీనమైతే తమ కష్టాలు తీరుతాయని భావించిన పట్టణ వాసులకు నిరాశే మిగిలింది. మన్సిపాలిటీగా ఉన్నప్పుడే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని ప్రజలు భావిస్తున్నారంటే వారనుభవిస్తున్న వెతలను అర్థం చేసుకోవచ్చు. మొత్తం మంచినీటి పథకాల్లో 20 వరకు పనిచేయడం లేదు. మినీ ట్యాంకుల కోసం ఏర్పాటు చేసిన మోటార్లు పనిచేయక పోవడం, కొన్నిచోట్ల పైపులు శిథిలావస్థకు చేరడం సమస్యకు కారణం. గొల్లవీధి, వేల్పులవీధి, కాయగూరల మార్కెట్, గాంధీబొమ్మ నాయబ్రాహ్మణ వీధి, గవరపాలెం సంతోషిమాత కోవెల వద్ద, ఏఎంసీ కాలనీ మాధవ్ సదన్, దాసరిగెడ్డ తదితర ప్రాంతాల్లో ఉన్న మంచినీటి పథకాలు మూలకు చేరాయి. దీంతో ఈ ప్రాంతానికి సక్రమంగా నీరు సరఫరాకాక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కుళాయిల ద్వారా నీరు విడుదల చేస్తున్నా స్థానికుల అవసరాలకు సరిపోవడం లేదు. వేసవి ఎద్దడి సమయంలో ట్యాంకులతోనైనా మంచినీటిని సరఫరా చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. బోరు బావులున్నా చాలా వరకు మూలకు చేరడం, మిగిలినవి అక్కరకు రాకపోవడంతో మహిళలు మంచినీటి కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. యథేచ్ఛగా నీటి వృథా ఓవైపు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని ప్రజలు వాపోతుంటే, ఉన్న కుళాయిల నుంచి ఎక్కడికక్కడ నీరు వృథా అవుతుండడం మరో సమస్యగా మారింది. చాలా కుళాయిలకు హెడ్స్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనే సమయంలోనైనా నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ట్యాంకు పనిచేయడం లేదు నెల రోజుల నుంచి మంచినీటి ట్యాంకు పని చేయడం లేదు. అధికారులెవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వీధి కుళాయిలు దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి మంచినీటి ట్యాంకును బాగు చేయాలి. - ఎస్.సంతోషి, గొల్లవీధి -
గొంతెండుతోంది
పల్లె గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం పల్లెవాసులు అల్లాడుతున్నారు. పనిచేయని రక్షితనీటి పథకాలు.. అసంపూ ర్తి ప్రాజెక్టులతో జిల్లాలోని వందలాది గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎండలు ముదురుతున్న కొద్దీ భూగర్భజలాలు ఇంకిపోతున్నా యి. 20 మండలాల్లో 10 మీటర్లకు పైగా జలాలు పడిపోగా ఈ నెల రోజుల్లోనే నాలుగు మీటర్ల లోతుకు పడిపోయాయి. కొన్ని చోట్ల భూగర్భజలాలున్నా... బోర్లు, మోటార్లు పనిచేయక తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలంగా మారే ప్రమాదం ఉంది. సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని చాలా మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రస్తు తం నీటి ఎద్దడి ఉన్న మండలాల్లో ప్రజలకు గొంతు తడపడానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి రానుంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టాల్సిన జిల్లా యంత్రాంగం మొద్దు నిద్రపోయింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా.. ఇంత వర కు జిల్లాలో ఎక్కడా అసలు తాగునీటి సమస్య ఉత్పన్నమే కాలేదని, అందుకే తాము కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు వివరణ ఇవ్వడం గమనార్హం. భూగర్భజల శాఖ అధికారులు మా త్రం 20 మండలాల్లో నీటిమట్టం భూ ఉపరిత లం నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయింద ని, నెలరోజుల్లోనే 18 మండాల్లో మీటరు నుం చి నాలుగు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో 2463 తాగునీటి పథకాలున్నా... చాలా చోట్ల అవి పనిచేయక నీటి ఎద్దడి ఏర్పడుతోంది. కరెంట్ కోతలతో బోర్లు, నీటి పథకాలు పనిచేయక సిరగా నీరందడం లేదు. మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలు జిల్లాలో అనేక గ్రామాల ప్రజలు గుక్కెడు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. కథలాపూర్ మండలం దుంపేటలో రెండు వాటర్‌ట్యాంకు లు ఉన్నా నీరందించడం లేదు. మహాముత్తారం మండలం కనుకునూరు, కొత్తపల్లె, రెడ్డిపల్లె, రేకులగూడెం, పోచంపల్లి, బోర్లగూడెం గ్రామ పరిధిలోని దేవునితండాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. హుజూరాబాద్ పట్టణంతోపా టు జమ్మికుంట, తనుగుల, నగరం, వావిలా ల, కొత్తపల్లి గ్రామాల్లో 50 వేల మంది ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, బండలింగపల్లి, గర్జనపల్లి, వేములవాడ మండలం నూకలమర్రి, కొల నూరు (కోనరావుపేట), మల్యాల (చందుర్తి), తాండ్య్రాల (కథలాపూర్), గోవిందారం, మన్నెగూడెం (మేడిపల్లి), ధర్మపురి మండల కేంద్రంతో పాటు నక్కలపేట గిరిజన తండా, దుగ్గారం, గైన, రాయపట్నం, రామయ్యపల్లె, గొల్లపల్లి, ఘన్పూర్, అగ్గిమళ్ల, గుంజపడుగు, గంగాపూర్ గ్రామాలు, వెల్గటూరు, గొడ్జెటపేట, పెండపల్లి, గుళ్లకోట, ధర్మారం, కొత్తపల్లె, కొడిమ్యాల, నమిలికొండ, శ్రీరాములపల్లి, నాచుపల్లి, సుడంపేటతండా వాసులకు తాగునీరు సరిగా అందడం లేదు. బోయినపల్లి, కటికెనపల్లి(చొప్పదండి), కోరుట్ల, జోగన్‌పల్లి, చిన్నమెట్పల్లి, మోహన్‌రావుపేట, మెట్పల్లి, అల్లూరితండా, రంగరావుపేటతండా, పాటిమీది తండా, మల్లాపూర్, కుష్టాపూర్, రత్నాపూర్, సంగెం, శ్రీరాంపూర్, పాతదంరాజ్పల్లి, కాటారం, జాదరావ్పేట, చింతకాని, శంకరంపల్లి (ఎస్సీ కాలనీ), పరికిపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపాదనలేవీ? తాగునీటి సమస్య పరిష్కారానికి ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో అధికారులు అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారు. వేసవికాలం వచ్చినా ఎక్కడా బోర్వెల్ల మరమ్మతు చేయించలేదు. ట్యాంకులు ఏర్పాటు చేయలేదు. బావులు అద్దెకు తీసుకోలేదు. కాలిపోయిన మోటార్లు కూడా బాగు చేయించలేదు. పైప్‌లైన్ లీకేజీలు సరిచేసినవారే లేరు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 వేల బోర్లలో 12 వేల వరకు పనిచేయడం లేదు. బోర్వెల్ల నిర్వహణ బాధ్యత ఎంపీడీవోలదే అయినా చాలా మంది పట్టించుకోలేదు. మున్సిపాలిటీల్లోనూ అరిగోసే.. తాగునీటి సమస్యలో గ్రామాలకు మున్సిపాలిటీలు తీసిపోవడం లేదు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే నీరు సరిగా అందడం లేదు. సిరిసిల్ల పరిధిలోని తారకరామనగర్, తుక్కరావుపల్లె, బీవైనగర్, సుందరయ్యనగర్లలో నీటి ఎద్దడి చాలా ఉంది. మెట్పల్లి పరిధి గాజులపేట, దుబ్బవాడ, ముస్లింపుర, సుల్తాన్పూర్, బుడిగజంగాలకాలనీ, బీడీ కాలనీ, చైతన్యనగర్లలో, కోరుట్ల పరిధి అర్బన్‌కాలనీ, హాజీపుర, శివాజీరోడ్డు, ఝాన్సీరోడ్, భీమునిపేట, జగిత్యాల పరిధి విజయపురి, విద్యానగర్, చిలుకవాడ, సాయిబాబా టెంపుల్ ఏరియా, కృష్ణానగర్ (గవర్నమెంట్ స్కూల్ ఏరియా), అరవింద్ ఏరియా, బుడిగజంగాల కాలనీ, గణేశ్ టెంపుల్ ఏరియా, గోత్రాలకాలనీ, తులసీనగర్, హౌజింగ్‌బోర్డు కాలనీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. రామగుండం నగర పరిధిలోని యైటింక్లయిన్‌కాలనీ, ఎన్టీపీసీ, పెద్దపల్లి పట్టణ ం బస్టాండ్ ఏరియా, రైల్వేస్టేషన్, ప్రగతినగర్, క్రిస్టియన్‌కాలనీ, భూమినగర్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. -
అల్లాడిస్తున్న అప్రకటిత ‘కోత’
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వాన రాకడా.. ప్రాణం పోకడా అనే చందంగా విద్యుత్ సరఫరా పరిస్థితి ఉందని ప్రజానీకం వాపోతున్నారు. కొద్ది రోజులుగా పల్లెల్లో, పట్టణాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో అలాం్లడిపోతున్నారు. విజయవాడ, నగరంతో పాటు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో వారం రోజులుగా ఈఎల్ఆర్ (ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ) రోజుకు మూడు విడతలుగా కోత విధిస్తున్నారు. రాత్రిపూటకూడా ఎప్పుడు, కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మూతపడుతున్న రక్షిత మంచినీటి పథకాలు... కాగా అప్రకటిత విద్యుత్ కోత వల్ల జిల్లా వ్యాప్తంగా రక్షిత మంచినీటి పథకాలు మూతపడుతున్నాయి. త్రీఫేజ్ సరఫరా లేకపోవటంతో మోటార్లు పనిచేయక మున్సిపల్, గ్రామపంచాయతీల్లో నీటిసరఫరా పథకాలు పనిచేయడంలేదు. ఫలితంగా విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా మున్సిపల్ వాటర్ సరఫరా నిలిచిపోయింది. మెరక ప్రాంతాలకు మున్సిపల్ నీరు సరిగా రావటం లేదని ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాలో పెడన, గుడివాడ, ఉయ్యూరు, నూజివీడు, తిరవూరు,. జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీలో కరెంటు కష్టాలతో ప్రజలు తల్లఢిల్లుతున్నారు. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా 929 గ్రామ పంచాయతీల్లో, 49 మండలాల్లో మంచినీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుత్నుట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ కేంద్రాలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లో కొద్ది రోజులుగా నిర్ణీత సమయాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కోత విధిస్తున్నారని ప్రజలువాపోతున్నారు. అన్నదాతల అవస్థలు... కాగా విద్యుత్ కోత వల్ల అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. త్రీపేజ్ సరఫరా సరిగా లేకపోవటంతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పంటపొలాలకు సరిగా నీరు అందడం లేదని వాపోతున్నారు. అప్రకటిత కోతలు అనివార్యం విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య వ్యతాసం రావటంతో ఎమర్జెన్సీలోడ్ రిలీప్ పేరుతో కోతలు విధించాల్సి వస్తోందని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్.ఇ. మోహన్ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి ఎండలు, వాడ కం పెరగటం కొన్ని సందర్బాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కల్గినప్పుడు ఈఎల్ఆర్ విధించటం అనివార్యమన్నారు. విజయవాడ, మచిలీపట్నంలో మారిన షెడ్యూల్ ప్రకారం విద్యుత్ అధికారిక కోతలు ఈ విధంగా ఉన్నాయి. విద్యుత్ కోత వేళలివే.. విజయవాడ నగరంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, తిరిగి రాత్రి 7-45 గంటల నుంచి 8-45 గంటల వరకు మడు విడతలుగా విద్యుత్ అదికారికంగా కోత విధిస్తారు. జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటలవరకు, సాయంత్రం 6-45 గంటల నుంచి రాత్రి 7-45 గంటల వరకు కోత విధిస్తారు. -
తొలిఫలం తెలంగాణకే..
ముందుగా పూర్తయిన గుత్ప ఎత్తిపోతల పథకం అధిక బడ్జెట్ కేటాయించిన అపర భగీరథుడు వచ్చే ఎన్నికల వరకు పాలి‘ట్రిక్స్’ను వదిలి.. ప్రజలకు పనికొచ్చే రాజకీయం చేద్దాం.. కావాలంటే ఆ ఖ్యాతిని మీరే తీసుకోండి... వివిధ ప్రాజెక్టుల పూర్తికి నిర్దేశించిన కాలపరిమితులన్నీ ‘పెళ్లి ముహుర్తాలు’ కావు.. అంతిమంగా రూ.40 వేల కోట్లతో నీటిపారుదల సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ విధానం. నదుల అనుసంధానానికి దోహదం చేసే ప్రాజెక్టులపై అపోహలు.. విమర్శలు మాని సహకరించండి - జలయజ్ఞం సందర్భంగా రాజకీయ పార్టీలకు డాక్టర్ వైఎస్ఆర్ లేఖ. (గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్): ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మహాయజ్ఞమే... జలయజ్ఞం. బీడు భూముల్లో సిరులు పండి.. పుడమితల్లి పులకరించి పోవాలని తపనపడ్డ మహానేత వైఎస్సార్ కల నిజమై... కరువు జిల్లాల్లో బీడు భూములకు జలసిరులు చేరాయి. కష్టాలతో బిక్కచచ్చిన రైతుల కళ్లలో వెలుగులు నిండాయి. నెర్రెలిచ్చిన పొలాల్లోకి పరుగులు పెట్టిన నీళ్లు వేలాది మంది రైతులకు భరోసా నిచ్చాయి. ‘జలయజ్ఞం’లో తెలంగాణ ప్రాజెక్టులకు వైఎస్ పెద్దపీట వేశారు. ఫలితంగా జలయజ్ఞం కింద తొలిఫలం కూడా తెలంగాణ రైతాంగానికే దక్కింది. నిజాంసాగర్ చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన గుత్ప ఎత్తిపోతల పథకం తొలుత పూర్తయ్యింది. చంద్రబాబు హయాంలో సాగునీటి రంగంతీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్న సత్యం అప్పటి బడ్జెట్ కేటాయింపులు చూస్తే అర్థమవుతుంది. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం తొమ్మిదేళ్లలో బాబు పదివేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అయినా సాగు విస్తీర్ణం ఏమాత్రం పెరగలేదు. దీంతో వైఎస్ అధికారంలోకి రాగానే నీటి పథకాలకు పెద్దపీట వేశారు. ప్రాణహిత- చేవెళ్ల, దేవాదుల, కల్వకుర్తి తదితర 23 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. ఆయన తన ఐదేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతంలో నీటి పథకాలకు రూ. 32 వేల కోట్లు ఖర్చు చేసి, అదనంగా 25 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి మొత్తం 35 లక్షల ఎకరాలకు నీరందించారు. మొత్తం రూ.54,266 కోట్ల అంచనాలతో తెలంగాణ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 2008లో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద వైఎస్ శంకుస్థాపన చేశా రు. అప్పట్లోనే రూ.38.500 కోట్ల అంచనాతో ఈ పథకాన్ని చేపట్టారు. వైఎస్ మరణానంతరం ఆ పనులు మందగించాయి. జాతీయహోదా పేరిట కాలయాపన చేస్తున్నారు. -
వేసవి ముందు నీటి సమస్య మొదలైంది
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు గుర్తించిన దాని ప్రకారమే.. 28 మండలాల్లోని 238 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఆదిలాబాద్, మంచిర్యాల డివిజన్లు ఉండగా.. ఈ రెండింటి పరిధిలోని 708 హ్యాబిటేషన్లలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఆయా గ్రామాలకు, హ్యాబిటేషన్లకు వాహనాలు, రోడ్డు మార్గం సరిగా లేని చోట ఎడ్లబండ్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంది. 151 హ్యాబిటేషన్లలో ఇలా వాహనాల ద్వారా నీటి సరఫరాతోనే సమస్య పరిష్కరించే వీలుందని అధికారులు గుర్తించారు. దీని కోసం కాంటింజెన్సీ ప్లాన్ కింద రూ.1.43 కోట్లు కేటాయించారు. 59 హ్యాబిటేషన్లలో ప్రైవేటు వ్యక్తుల నీటి పథకాలను అద్దెకు తీసుకుని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. ఇలాంటి 62 ప్రైవేటు నీటి పథకాలను ఇప్పటికే గుర్తించారు. దీని కోసం రూ.30లక్షలు కేటాయించారు. 711 బోర్‌వెల్స్‌లో నీరు అడుగంటడంతో వాటిని మరింత లోతుకు తవ్వించాల్సి ఉంది. దీని కోసం రూ.33 లక్షలు కేటాయించారు. 66 బావులు అడుగంటడంతో వాటిలో జలాలు ఊరే వరకు తవ్వించేందుకు రూ.30 లక్షలు కేటాయించారు. కొత్త పథకాల నిర్మాణం కోసం రూ.52 లక్షలు వెచ్చిస్తున్నారు. పలు గ్రామాల్లో సీజనల్ చేతిపంపులు ఇంకిపోతున్నాయి. అసంపూర్తి మంచినీటి పథకాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల నిధులు మంజూరవుతున్నా పనులు గడువులోగా పూర్తి కావడం లేదు. అధికారుల అవినీతి కారణంగా పలు చోట్ల మంచినీటి పథకాలు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పథకాలు పూర్తయినప్పటికీ పైప్‌లైన్ లేకపోవడం, బోరు వేసినప్పటికీ చేతిపంపు బిగించకపోవడం, కొన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం సమస్యకు కారణంగా నిలుస్తున్నాయి. చేతిపంపుల్లో నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాలివే.. ఆదిలాబాద్ మండలంలో 20 గ్రామాలు. జైనూర్‌లో 9, కెరమెరిలో 12, నార్నూర్‌లో 7, సిర్పూర్(యు)లో 11, తిర్యాణిలో 8, కాసిపేటలో ఒకటి, బజార్హత్నూర్లో 13, బోథ్‌లో 8, ఇచ్చోడలో 17, గుడిహత్నూర్‌లో 8, నేరడిగొండలో 4, ఇంద్రవెల్లిలో 16, జన్నారంలో 11, కడెంలో 8, ఖానాపూర్‌లో 13, ఉట్నూర్‌లో 14, మంచిర్యాలలో 2, భైంసాలో ఒకటి, కుబీర్‌లో 6, కుంటాల, లోకేశ్వరంలో ఒక్కొక్కటి, ముథోలో 15, తానూర్‌లో 9, దిలావర్పూర్లో 2, మామడలో 8, సారంగపూర్‌లో 13 గ్రామాల్లో నీటి సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం, ప్రైవేటు బోరువెల్స్, బావులు అద్దెకు తీసుకుని గ్రామాల్లో సమస్యను పరిష్కరించాలి. -
కొత్త ఏడాదీ తప్పని నీటీ ‘కోత’ !
=2014 గ్రేటర్ నీటి డిమాండ్595 మిలియన్ గ్యాలన్లు =నీటి కొరత 62 మిలియన్ గ్యాలన్లు =2017 వరకూ ఇదే సీన్! సాక్షి, సిటీబ్యూరో: సామాన్యుడు సైతం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏయేటికాయేడు తన అవసరాలను గుర్తెరిగి బడ్జెట్‌ను రూపొందించుకుంటాడు. కానీ ఘనత వహించిన జలమండలికి ఆపాటి ధ్యాస కూడా లేదు. నీటిబిల్లులపైనే తప్ప సరఫరాపై అసలు దృష్టి సారించడం లేదు. ఫలితం.. గ్రేటర్ కన్నీటి కష్టాలు కొత్త ఏడాది (2014)లోనూ తీరే దాఖలాలు కనిపించడం లేదు. కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలు నత్తనడకన సాగుతుండటం.. సరఫరా నష్టాలు తడిసి మోపెడవుతుండటం.. వెరసి వచ్చే ఏడాదీ పానీ పరేషాన్ తథ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో మూడేళ్ల వరకూ ఇదే పరిస్థితి తప్పదంటున్నారు. జలమండలి ప్రస్తుతం రోజువారీగా నగరం నలుమూలలకు 340 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నా.. సరఫరా నష్టాలు 40 శాతం మేర ఉండడంతో వాస్తవ సరఫరా 204 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదన్నది అక్షర సత్యం. ఇక 2014లో గ్రేటర్ మంచినీటి డిమాండ్ 595 మిలియన్ గ్యాలన్లకు చేరుతుందని జలమండలి వర్గాలు తాజాగా అంచనా వేశాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 490 మిలియన్ గ్యాలన్లు, జీహెచ్ఎంసీకి ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాలకు 105 మిలియన్ గ్యాలన్ల మంచినీరు అవసరం ఉంటుందని లెక్కగట్టారు. అయితే వచ్చే ఏడాదిలో కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశలతోపాటు మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయాల నుంచి సేకరించే నీటి మొత్తం 533 మిలియన్ గ్యాలన్లకు మించని పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే డిమాండ్, సరఫరాల మధ్య అంతరం 62 మిలియన్ గ్యాలన్లుగా ఉంటుందని, దీంతో పానీ పరేషాన్ తప్పదని అంచనా వేయడం గమనార్హం. వీటిలో సరఫరా నష్టాలు కట్టడి చేయని పక్షంలో కొరత మరింత పెరిగే ప్రమాదం పొంచివుంది. కాగా మహానగరం పరిధి శరవేగంగా విస్తరిస్తున్నా మంచినీటి సరఫరా అదే స్థాయిలో పెరగడం లేదు. దీంతో కొత్త ఏడాదిలోనూ గ్రేటర్ వాసులకు కన్నీటి కష్టాలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించి, కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలను సత్వరం పూర్తిచేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో మూడేళ్లూ కటకటే.. ఇక 2017 నాటికీ గ్రేటర్ దాహార్తి పూర్తిస్థాయిలో తీరే పరిస్థితి కనిపించడంలేదు. 2017 నాటికి మహానగర నీటి సరఫరాకు 627 మిలియన్ గ్యా లన్ల మంచినీరు అవసరమౌతుందట. కానీ అప్పటికీ అందుబాటులో ఉండే నీటివనరులు 533 మిలియన్ గ్యాలన్లకు మించని పరిస్థితి ఉంది. దీంతో అప్పటికీ డిమాండ్, సరఫరాకు మధ్య అంతరం 94 మిలియన్ గ్యాలన్లుగా ఉండబోతుందని జలమండలి అంచనా వేస్తోంది.