అంతా అడ్డగోలు !
పారదర్శకత ... నీటి పథకాల్లో సమాధి అయింది. టెండర్లు పిలవాల్సిన చోట నామినేటెడ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. టెండర్లు పిలవాలని ఆ పథకాలకు నిధులు సమకూర్చే జెడ్పీ అధికారులు కోరుతున్నా... నాయకుల ఒత్తిళ్లకు భయపడి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నాన్చుడుధోరణి అవలంభిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం ః ‘గతంలో రూ.లక్ష దాటితే ఆ పనులకు టెండర్లు పిలిచేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ నాయకులు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకు ఆ నిబంధన మార్చారు. పనుల విలువ రూ.10 లక్షలు దాటితే టెండర్లుస పిలవాలని నిర్ణయించారు’ కానీ ఇప్పుడా నిర్ణయానికి టీడీపీ నేతలు కట్టుబడడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నామినేటేడ్‌గా పనులు కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అధికారులు కూడా తలొగ్గుతున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన పనుల్ని కూడా నామినేటేడ్ పద్ధతిలో అప్పగించేశారు. ఇందుకు భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనులే ఉదాహరణ.
రూ.10 లక్షలకుపైగా నిర్వహణ వ్యయం గల భారీ మంచినీటి పథకాలు జిల్లాలో 19 ఉన్నాయి. టెండర్లు పిలిచి, తక్కువగా కోట్ చేసిన వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. చీపురుపల్లి, భోగాపురం, గొట్లాం, గోస్తనీ, గెడ్డపువలస, దేవుని కనపాక, మరువాడ, పూసపాటిరేగ, భీమసింగి, భోగాపురం ఫేస్-1 తదితర పథకాలెన్నో ఉన్నాయి. వీటిలో చాలా వాటి నిర్వహణకు రూ.కోట్లలోనే వ్యయం చేస్తున్నారు. గతంలో టెండర్ల ద్వారానే ఈ ప్రక్రియ నడిచేది. షరతులకు అనుగుణంగా పనులు కట్టబెట్టడంతో తప్పు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక టెండర్ల విధానాన్ని పక్కన పెట్టి నామినేటేడ్ పద్ధతిలో కొందరు నేతలు పనులు పొందారు. అధికారులు కాదూ కూడదని చెప్పినా ఒత్తిడి చేసి, భయబ్రాంతులకు గురిచేసి తమ వశం చేసుకున్నారు. వాటాలేసుకుని నామినేటేడ్ పనులను పంచేసుకున్నారు. నామినేటెడ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఆరు నెలలు దాటింది. ఇంకా వాటికి టెండర్లు పిలవలేదు. యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పిలిచి, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని వాటికి నిధులు వెచ్చిస్తున్న జెడ్పీ అధికారులు ఉత్తర్వులిచ్చినా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదు. కొన్నాళ్లు ఇలాగే వదిలేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
అశోక్ చెప్పినదానికి భిన్నంగా....
కాంగ్రెస్ హయాంలో షాడోనేత హవాపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరును నిరసిస్తూ ఆందోళనలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పలు సమావేశాల్లో మాట్లాడుతూ అటువంటి సంస్కృతి ఇకపై ఉండదని, అడ్డగోలు వ్యవహారాలు ఉండవని, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు. దీంతో ఇటు అధికారులు, అటు ప్రజలు సంతోషించారు. అయితే అశోక్ మాటలకు, వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండడం లేదు.