సప్లిమెంట్‌ మాయాజాలం! | goalmal in water schemes | Sakshi
Sakshi News home page

సప్లిమెంట్‌ మాయాజాలం!

Published Sat, Apr 15 2017 5:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

సప్లిమెంట్‌ మాయాజాలం!

సప్లిమెంట్‌ మాయాజాలం!

► తాగునీటి పథకాల టెండర్లులో భారీ గోల్‌మాల్‌
► రూ.27లక్షల టెండర్‌కు రూ.65లక్షల అదనం
► ఆ మేరకే బిల్లులు చెల్లింపులు
► ఎస్‌ఈ కార్యాలయం నుంచే దిశానిర్దేశం
► బినామీ కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తున్న ఈఈ, ఉన్నతాధికారి పీఏ  


తాగునీటి ఇక్కట్లు సత్వరమే తీర్చాలనే తలంపు లేకపోగా, నిధులను దండుకోవాలనే దిశగా ఆర్‌డబ్ల్యూఎస్‌ యంత్రాంగం పనిచేస్తోంది. టెండర్ల కంటే రెండురెట్లు అధికంగా సంప్లిమెంట్‌ అగ్రిమెంటు ద్వారా పనులు అప్పగించి బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రపంచబ్యాంకు నిధులు సైతం క్లాస్‌4 కాంట్రాక్టర్‌కు కేటాయిస్తూ బినామీ కాంట్రాక్టర్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఉన్నతా«ధికారి కార్యాలయం నుంచే దిశానిర్దేశం చేస్తూ కిందిస్థాయి యంత్రాంగంపై హుకుం ప్రదర్శిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కడప: సీపీడబ్ల్యూ స్కీమ్‌లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నుంచి పనులు పూర్తయ్యే వరకూ ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోంది. కేటాయించిన దాని కంటే కేవలం 10 శాతం అదనంగా సప్లిమెంటు అగ్రిమెంటు ద్వారా పనులు అప్పగించాల్సి ఉండగా, టెండర్‌ కంటే రెండు నుంచి రెండున్నర్ర రెట్లు అధికంగా పెంచి అప్పగిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా యోగివేమన సీపీడబ్ల్యూ స్కీం చెప్పవచ్చు. పెండ్లిమర్రి, వల్లూరు మండలాల్లోని గ్రామాలతోపాటు వైవీయూకు నీటి పథకాన్ని రూ.27 లక్షలతో చేపట్టారు. ఆమేరకు టెండర్లు నిర్వహించి పనులు అప్పగించారు.

కాగా అవే పనులకు సప్లిమెంట్‌ అగ్రిమెంటు కింద రూ.64.5 లక్షలు కలిపారు. అంటే ఎలాంటి టెండర్‌ ప్రక్రియ లేకుండా అదనంగా రూ.64.5లక్షల పనిని సదరు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. సప్లిమెంట్‌ అగ్రిమెంట్‌లో కేబుల్‌ వైరు దాదాపు రూ.50 లక్షల విలువైనది వేయాల్సి ఉంది. వాస్తవానికి టెండర్‌ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పరిధిలో 5 శాతం, ఎస్‌ఈ పరధిలో 10 శాతం, సీఈ పరిధిలో 15 శాతం పనులు మాత్రమే అప్పగించే అర్హత ఉంది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.27లక్షల పనికి రూ.64.5 లక్షల సప్లిమెంట్‌ అగ్రిమెంట్‌ అప్పగించడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని పలువురు వివరిస్తున్నారు. ఎస్టిమేట్‌ నిర్వహించిన ఇంజనీరింగ్‌ అధికారులు ముందస్తుగా టెండరు ప్రక్రియలో చోటుచేసుకున్న విధంగా కాకుండా అనువైన రీతిలో సప్లిమెంట్‌ అగ్రిమెంట్‌ పుట్టించడం వెనుక ఎస్‌ఈ కార్యాలయం కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం.

అధికారుల భాగస్వామితో బినామీ కాంట్రాక్టర్‌: ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయ అధికారుల భాగస్వామ్యంతో బినామీ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో నిబంధనలను తొక్కిపెడుతున్నట్లు సమాచారం. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనులకు నిర్వహణ చేసే కాంట్రాక్టర్‌కు క్రిమినల్‌ కేసులు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా క్లాస్‌–4 కాంట్రాక్టర్‌కు లక్కిరెడ్డిపల్లెలో రూ.2కోట్ల పనులు అప్పగించినట్లు సమాచారం. ఎస్‌ఈ కార్యాలయం అధికారులకు అతను భాగస్వామి కావడంతో నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించినట్లు తెలుస్తోంది.

మరోవైపు పలు టెండర్లలో ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లు కంటే అధికంగా బిల్లులు చెల్లిస్తున్నట్లు సమాచారం. చేసిన పనులకు సైతం సత్వరమే బిల్లులు చెల్లించకుండా దాదాపు ఏడాది తర్వాత చేయని పనులకు సైతం రికార్డులు పొందుపరుస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈక్రమంలో ఏఈ, డిఈ స్థాయి అధికారులు అడ్డంకిగా మారితే ఎస్‌ఈ కార్యాలయం నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉంటున్నాయి. అందులోభాగంగా పలువురు ఏఈలను పరుషపదజాలంతో ఇబ్బందిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో దాదాపు రూ.6 కోట్ల పనులు బినామీ కాంట్రాక్టర్‌ ద్వారా చేపట్టినట్లు సమాచారం. ఆ పనులన్నింటిలో ప్రధానంగా టెండర్‌ ప్రక్రియ ఒకలా ఉంటే సప్లిమెంట్‌ అగ్రిమెంట్‌ జోడిస్తూ నిధులు దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడం విశేషం.

ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సంజీవరావును వివరణ కోరగా సప్లిమెంట్‌ అగ్రిమెంటు విషయమై తనకు అవగాహన లేదని, పరిశీలించాల్సి ఉందని వివరించారు.  ప్రపంచ బ్యాంకు నిధుల పనులు కూడా పరిశీలించనున్నట్లు వివరించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement