కొత్త ఏడాదీ తప్పని నీటీ ‘కోత’ !
=2014 గ్రేటర్ నీటి డిమాండ్595 మిలియన్ గ్యాలన్లు
=నీటి కొరత 62 మిలియన్ గ్యాలన్లు
=2017 వరకూ ఇదే సీన్!
సాక్షి, సిటీబ్యూరో: సామాన్యుడు సైతం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏయేటికాయేడు తన అవసరాలను గుర్తెరిగి బడ్జెట్‌ను రూపొందించుకుంటాడు. కానీ ఘనత వహించిన జలమండలికి ఆపాటి ధ్యాస కూడా లేదు. నీటిబిల్లులపైనే తప్ప సరఫరాపై అసలు దృష్టి సారించడం లేదు. ఫలితం.. గ్రేటర్ కన్నీటి కష్టాలు కొత్త ఏడాది (2014)లోనూ తీరే దాఖలాలు కనిపించడం లేదు. కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలు నత్తనడకన సాగుతుండటం.. సరఫరా నష్టాలు తడిసి మోపెడవుతుండటం.. వెరసి వచ్చే ఏడాదీ పానీ పరేషాన్ తథ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో మూడేళ్ల వరకూ ఇదే పరిస్థితి తప్పదంటున్నారు.
జలమండలి ప్రస్తుతం రోజువారీగా నగరం నలుమూలలకు 340 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నా.. సరఫరా నష్టాలు 40 శాతం మేర ఉండడంతో వాస్తవ సరఫరా 204 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదన్నది అక్షర సత్యం. ఇక 2014లో గ్రేటర్ మంచినీటి డిమాండ్ 595 మిలియన్ గ్యాలన్లకు చేరుతుందని జలమండలి వర్గాలు తాజాగా అంచనా వేశాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 490 మిలియన్ గ్యాలన్లు, జీహెచ్‌ఎంసీకి ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాలకు 105 మిలియన్ గ్యాలన్ల మంచినీరు అవసరం ఉంటుందని లెక్కగట్టారు.
అయితే వచ్చే ఏడాదిలో కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశలతోపాటు మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయాల నుంచి సేకరించే నీటి మొత్తం 533 మిలియన్ గ్యాలన్లకు మించని పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే డిమాండ్, సరఫరాల మధ్య అంతరం 62 మిలియన్ గ్యాలన్లుగా ఉంటుందని, దీంతో పానీ పరేషాన్ తప్పదని అంచనా వేయడం గమనార్హం.
వీటిలో సరఫరా నష్టాలు కట్టడి చేయని పక్షంలో కొరత మరింత పెరిగే ప్రమాదం పొంచివుంది. కాగా మహానగరం పరిధి శరవేగంగా విస్తరిస్తున్నా మంచినీటి సరఫరా అదే స్థాయిలో పెరగడం లేదు. దీంతో కొత్త ఏడాదిలోనూ గ్రేటర్ వాసులకు కన్నీటి కష్టాలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించి, కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలను సత్వరం పూర్తిచేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరో మూడేళ్లూ కటకటే..
ఇక 2017 నాటికీ గ్రేటర్ దాహార్తి పూర్తిస్థాయిలో తీరే పరిస్థితి కనిపించడంలేదు. 2017 నాటికి మహానగర నీటి సరఫరాకు 627 మిలియన్ గ్యా లన్ల మంచినీరు అవసరమౌతుందట. కానీ అప్పటికీ అందుబాటులో ఉండే నీటివనరులు 533 మిలియన్ గ్యాలన్లకు మించని పరిస్థితి ఉంది. దీంతో అప్పటికీ డిమాండ్, సరఫరాకు మధ్య అంతరం 94 మిలియన్ గ్యాలన్లుగా ఉండబోతుందని జలమండలి అంచనా వేస్తోంది.