తాగునీటి వనరులపై ‘మహా’ ఒత్తిడి
పెరుగుతున్న జనాభా..
తగ్గుతున్న నీటి వనరులు..సంప్రదాయ విధానాలతోనే
నష్టమంటున్న నిపుణులు..
ఫజిలాజిక్ సాంకేతిక విధానాలతో వినూత్నంగా నగర నీటి సరఫరా..
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. అంతకంతకూ నీటి డిమాండ్ అధికమవుతోంది. ఫలితంగా గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న జలాశయాలపై ఒత్తిడి ఎక్కువవుతోంది. మహానగర జనాభా సుమారు 86 లక్షలు. నగరానికి నిత్యం జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు 340 మిలియన్ గ్యాలన్లు మాత్రమే. కానీ డిమాండ్ 480 మిలియన్ గ్యాలన్లు. 2020 నాటికి నగర జనాభా 108.30 కోట్లకు, మంచినీటి డిమాండ్ 693 మిలియన్ గ్యాలన్లకు చేరనుంది. ఇటీవల ‘ఇండియన్ వాటర్‌వర్క్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ‘మహానగరాల్లో మెరుగైన తాగునీటి సరఫరా -అత్యుత్తమ విధానాలు’ అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో అమెరికా, జపాన్లతోపాటు మన దేశానికి చెందిన జలవనరుల నిపుణులు తమ అనుభవాలను వివరించారు. జలమండలి ప్రాజెక్టు డెరైక్టర్ సత్యనారాయణ గ్రేటర్ నగరంలో మంచినీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత నీటి సరఫరా విధానాలను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్‌లో నీటి కటకట పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఫజిలాజిక్, మ్యాట్‌ల్యాబ్ సాంకేతికతల ఆధారంగా నీటి సరఫరా మెరుగుపరిస్తేనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ జంటజలాశయాల పరిస్థితి...
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట్) జలాశయాల ఎగువ ప్రాంతాల్లో భారీ భవన, విల్లాల నిర్మాణం, పట్టణీకరణ ప్రభావంతో వర్షపునీరు(ఇన్‌ఫ్లో)చేరే దారులు మూసుకుపోతున్నాయి. ఫిల్టర్ ఇసుక మాఫియాతో జలవనరులు కుంచించుకుపోతున్నాయి. ఈ రెండు జలాశయాల నుంచి సుమారు 20 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. ఈ జలాశయాలను కబ్జా, కాలుష్యం నుంచి కాపాడకుంటే నగరంలో తాగునీటికి కష్టమే.
సింగూరు, మంజీరా జలాశయాలపై ఒత్తిడి ఇలా..
సింగూరు, మంజీరా జలాశయాల నుంచి రోజూ120 మిలియన్ గ్యాలన్ల నీరు నగరానికి సరఫరా అవుతోంది. కర్ణాటకలో భారీగా చిన్నతరహా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. దీంతో ఈ జలాశయాలకు ఇన్‌ఫ్లో ఏటేటా బాగా తగ్గుతోంది.
కృష్ణా నీటికి సవాళ్లెన్నో..
కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా నిత్యం 180 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు మూడోదశ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే మరో 90 మిలియన్ గ్యాలన్ల నీరు అందించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో నీటి వాటాల కేటాయింపు జటిలం కానుంది. మరోవైపు కృష్ణా వరద, నికర జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల కృష్ణా నీటి కోసం మరింత ఒత్తిడి పెరగనుంది. మరోవైపు కృష్ణా మూడుదశల పైప్లైన్ల మార్గంలోని గ్రామాల నుంచి సుదీర్ఘకాలంగా తాగు, సాగునీటి డిమాండ్లున్నాయి. వీటిని నెరవేర్చడమూ కష్టతరం కానుంది.
గోదావరి జలాలకూగడ్డుకాలమే..
నగర పరిధి, జనాభా అనూహ్యంగా పెరుగుతున్నందున గోదావరి మంచినీటి పథకానికి 2008లో శ్రీకారం చుట్టారు. పనులు జరుగుతున్నాయి. ఈ పథకానికి అవసరమైన నీటిని ప్రాణహిత చేవెళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి సేకరించాలని మొదట్లో నిర్దేశించారు. నగర తాగునీటి అవసరాలకు మొదటి విడతగా 172 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఆయా ప్రాజెక్టుల నుంచి వరద, నికర జలాల కేటాయింపులపై స్పష్టత లేదు. దీంతో గోదావరి జలాల సేకరణ కూ గడ్డు పరిస్థితులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఫజిలాజిక్ సాంకేతికతతో పరిష్కారం
గోదావరి, కృష్ణా నదులపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల్లోంచి గ్రేటర్ తాగునీటి అవసరాలకు 10 శాతం నీటిని విధిగా కేటాయించాలి.
సమృద్ధిగా నీటిలభ్యత ఉన్నప్పుడు ఆయా జలాశయాల నీటిని నిల్వ చేసేందుకు భారీ రిజర్వాయర్లను నిర్మించాలి. స్టోరేజి కర్వ్‌లను ఏర్పాటు చేయాలి. ఆయా జలాశయాల్లోకి వర్షపునీరు చేరే మార్గాలను పటిష్టం చేయాలి. కబ్జాలు లేకుండా, జలాశయాల్లోకి కాలుష్యం చేరకుండా చూడాలి. 40 శాతంగా ఉన్న సరఫరా నష్టాలను 10 శాతానికి తగ్గించాలి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జలాశయాల్లో ఆవిరయ్యే నీటి శాతం బాగా తగ్గుముఖం పట్టేలా చూడాలి. ప్రణాళికాబద్ధంగా జలాశయాల నీటిని వినియోగించాలి.
నీటి పంపింగ్ సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించాలి. హైడ్రాలిక్ ఫెయిల్యూర్స్‌ను అరికట్టాలి. మోటార్లు,పంపుల సామర్థ్యం మెరుగ్గా ఉంటే విద్యుత్ వినియోగం బాగా తగ్గుతుంది.నీటిని పొదుపుగా వినియోగించడంపై అందరికీ అవగాహన కల్పించాలి. జలాశయాల పరిరక్షణను మహోద్యమంగా చేపట్టాలి.వర్షపునీటి నిల్వ ద్వారా భూగర్భజలాలను రీచార్జి చేయాలి.
నీటిని పునఃశుద్ధి చేసి తిరిగి వినియోగిస్తున్న అమెరికా, సింగపూర్ దేశాల తరహాలో మినీ ఎస్టీపీలను ఏర్పాటు చేయాలి. ఈ నీటిని గార్డెనింగ్, టాయిలెట్స్ ఫ్లషింగ్, భూగర్భ జలాల రీచార్జికి వినియోగించాలి.