గొంతెండుతోంది..
- మూలకు చేరిన బోర్లు,పథకాలు
- తాగునీటి కోసం జనం అవస్థలు
- వేసవి కార్యాచరణకు రూ.18 లక్షలతో ప్రతిపాదన
- ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.5 లక్షలే
- 13వ ఆర్థిక సంఘం నిధులే దిక్కు
గొంతెండుతోంది గుక్కెడు నీళ్లివ్వండంటూ గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బిందెడు నీటి కోసం మహిళలు కిలోమీటర్లు దూరం నడవాల్సిన దుస్థితి. మండుటెండల్లో అష్టకష్టాలు పడుతూ ఊటగెడ్డలకు వెళ్లి నీటిని సేకరిస్తున్నారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: బావులు ఎండుతున్నా.. బోర్లు, మంచినీటి పథకాలు మూలకు చేరినా.. పట్టించుకొనే యంత్రాంగమే కరువైంది. దీనికి తోడు విద్యుత్ కోతలతో మండల కేంద్రాల్లో సైతం తాగునీటి ఎద్దడి నెలకొంది. సాధారణంగా వేసవికి ముందే తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ చేస్తుంటారు. ఈ ఏడా ది సార్వత్రిక ఎన్నికలు, కోడ్ వంటి కారణాలతో దీనిని పట్టించుకున్న వారే లేకుండాపోయారు. దీంతో జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పుడు 13వ ఆర్థిక సంఘం నిధులతో బోర్లు, మంచినీటి పథకాలు బాగు చేయాలని భావిస్తున్నారు.
మూలకు చేరిన పథకాలు
జిల్లాలో మొత్తం 5444 నివాస ప్రాంతాల్లో కేవలం 798 ఆవాసాల్లోనే పూర్తి స్థాయిలో నీటి వనరులున్నాయి. పాక్షిక్షంగా 4477 ప్రాంతాలకు నీటి అందిస్తుండగా.. సురక్షితం కాని నీటి వనరులు ఉన్న ప్రాంతాలు 133 వరకు ఉన్నట్లు అధికారుల గణాంకాలే చెబుతున్నాయి. అసలు నీటి సరఫరా లేని ప్రాంతాలు 36 ఉన్నాయి. జిల్లాలో 968 రక్షిత మంచినీటి పథకాలు, 1245 మినీ పథకాలు, 27 సమగ్ర రక్షిత పథకాలు ఉన్నాయి.
వీటిల్లో అధిక భాగం ప్రస్తుతం మూలకు చేరినట్లు అధికారులే చెబుతున్నారు. 250 పనికిరాకుండా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. కొన్ని సక్రమంగా ఉన్నప్పటికీ విద్యుత్ కోతలు కారణంగా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో 18,069 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా నీటిచుక్కలు రాల్చడం లేదు. వీటిని బాగు చేయాలన్న ధ్యాసే అధికారులకు ఉండడం లేదు.
రూ.5 లక్షలు విడుదల
జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద గ్రామీణ నీటి సరఫరా అధికారులు రూ.19.43 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5 లక్షలే మంజూరు చేసింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ నిధులపై దృష్టి సారించారు. పంచాయతీ, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కొంత మొత్తాలను తాగునీటి సరఫరాకు వెచ్చించాలని యోచిస్తున్నారు. వీటిని కేవలం మంచినీటి పథకాలు, బోర్ల మరమ్మతులకే వినియోగించనున్నారు.
ఊటగెడ్డలే ఆధారం
గ్రామాలు,గూడేల్లో బావులు ఎండిపోయాయి. బోర్లు మూలకు చేరాయి. పథకాలు నీటిచుక్కలు రాల్చకపోవడంతో గ్రామీణులు ఊటగెడ్డలపైనే ఆధారపడుతున్నారు. కిలోమీటర్ల మేర ఎండలో వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఏజె న్సీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు, తోటవలస, అంజోడ, స్వర్ణగుడ, జాకవలస, బల్లుగుడ, చంపగుడ, ఇలా అనేక గ్రామాల్లో బోర్లు ఏళ్ల క్రితమే పాడయ్యాయి.
ఆయా గ్రామాల వారు ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. నాతవరం మండలంలోనూ ఇదే దుస్థితి. వేసవి కావడంతో అవి కూడా అడుగంటిపోయాయి. గంటల తరబడి నిరీక్షిస్తే తప్పా.. బిందెడు నీరు రావడం లేదు. ఈ కలుషిత నీటి కారణంగా గ్రామీణులు రోగాల బారిన పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అరకు, డుంబ్రిగుడ మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కాలనీల్లోనూ తీవ్రమైన నీటి ఎద్దడి ఉండడం గమనార్హం. ఏటా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా.. దీర్ఘకాల ప్రణాళికలు,ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం కొట్టొస్తోంది.