‘మండి’పోతున్న ఢిల్లీవాసులు!
రికార్డు స్థాయి ఎండలు, ఎడతెగని కరెంటు
కోతలతో అల్లాడుతున్న పరిస్థితి
ప్రభుత్వంపై ఆగ్రహంతో నిరసన ప్రదర్శనలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని వాసులు ‘మండి’పోతున్నారు. ఓ వైపు రికార్డు స్థాయిలో మండుతున్న ఎండలు.. మరోవైపు గంటల తరబడి విద్యుత్ కోతలు.. ఇంకోవైపు అరకొర తాగునీటి సరఫరా..! ఇవన్నీ ఒకట్రెండు రోజుల నుంచి కాదు.. పక్షం రోజులుగా ఇదే పరిస్థితి. ప్రశ్నిస్తే అధికారుల నుంచీ స్పందన లేదు. దాంతో సహనం సన్నగిల్లిన ఢిల్లీవాసులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ధర్నా లు, రాస్తారోకోలే కాదు.. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి దిగారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సైతం ధర్నా లో పాల్గొని ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల్ని వెతకాల్సిన ఢిల్లీ ప్రభుత్వం గత పాలకులపై విమర్శలతో సరిపెడుతోంది.
దేశరాజధాని ఢిల్లీలో 12 గంటలకు పైగా విద్యుత్ కోతలు సాధారణమయ్యాయి. ఓ వైపు రికార్డులు దాటుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు, మరోవైపు కరెంటు కోతలతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విద్యుత్ కోతలు, నీటి సరఫరా లోపాలపై ఆగ్రహంతో వారు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అధికారులను నిర్బంధించడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దాంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఈనెల 10న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమై పరిస్థితిని వివరించారు. నగరంలో 5800 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం 5300 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. విద్యుత్ లోటును భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయితే, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేందుకు మరో 10 రోజలు పడుతుందని ఆ భేటీ అనంతరం నజీబ్ జంగ్ ప్రకటించారు. మరో 10 రోజులు ఇదే పరిస్థితి అనడంతో ప్రజలు నిరసనలను తీవ్రం చేశారు.
గాలిదుమారం గందరగోళం
సాధారణంగా ఢిల్లీలో రోజుకు 5వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మే 30న వచ్చిన గాలిదుమారం ధాటికి ఢిల్లీ విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలకమైన బవానా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ సామర్థ్యం పూర్తిగా పడిపోయింది. 1,500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంటు నుంచి ప్రస్తుతానికి 290 మెగావాట్లకు మించి ఉత్పత్తి ఉండడం లేదు. కాగా, త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగవచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి.