The maximum temperatures
-
వేసవి రాకముందే సూర్యప్రతాపం
ఈ వేసవి సీజన్ రాకముందే భానుడు భగభగలాడుతున్నాడు. సూర్యప్రతాపంతో వాతావరణం వేడెక్కుతోంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే గరిష్ట ఉష్ణోగ్రత 5.1 డిగ్రీలకు పెరిగింది. గతేడాది ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 15-16 డిగ్రీలు నమోదు కాగా, ఈసారి జనవరి చివరికి 17.5 డిగ్రీలు నమోదైంది. సాధారణంగా మార్చి ప్రారంభం నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి.ఈసారి మాత్రం నెలరోజులు ముందుగానే ఉష్ణోగ్రతలు పెరగటం గమనార్హం. పరోక్షంగా పగటి గరిష్ట ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. గతేడాది జనవరి చివరినాటికి పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే నమోదైతే, ఈసారి మాత్రం 35.1 డిగ్రీలుగా నమోదైంది. వర్షాభావమే కారణం. భారత వాతావరణ అధ్యయన సంస్థ (ఐఎండీ) సూచనల ప్రకారం జిల్లాలో ఈసారి పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ తెలిపారు. వర్షాభావంతోపాటు ప్రతి ఏడాది ఉత్తర వాయవ్వ ప్రాంతాల నుంచి శీతల గాలులు దక్షిణ దిశకు వీయకపోవడం గరిష్ట ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమన్నారు. -
ఉగ్ర సూర్య
- రికార్డు స్థాయి ఉష్ణోగ్రత - గరిష్టంగా 44.3 డిగ్రీలు - ఐదేళ్ల తర్వాత ఇదే అత్యధికం - మరో మూడు రోజులు ఇదే పరిస్థితి - వడదెబ్బకు ముగ్గురి మృతి - నేడు మరో డిగ్రీ పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రత? - అప్రమత్తత అవసరం: వాతావరణ శాఖ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌పై నిప్పుల వాన కురుస్తోంది. సూర్యుడు మండిపోతున్నాడు. గురువారం గరిష్టంగా 44.3 డిగ్రీలు... కనిష్టంగా 31.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐదేళ్ల తరవాత మహా నగరంలో వేసవిలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే.2010 మే 12న గ్రేటర్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరవాత ఆ స్థాయిలో ఇప్పుడుఎండలు మండిపోతున్నాయి. వాయువ్య భారతదేశం నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా నగరంలో వడగాల్పులు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజుల పాటు వడగాలులు, గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత ఇదే స్థాయిలో నమోదయ్యేఅవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఎండ తీవ్రంగాఉన్న సమయాల్లో బయటికి వెళ్లేటపుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని... అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గాలిలో తేమ 22 శాతానికి పడిపోవడంతో బయటకువెళ్లినవారు ఎండ, వేడిగాలుల తీవ్రతకు సొమ్మసిల్లుతున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వడదెబ్బ కేసులు, కుక్క కాటు కేసులు బాగా పెరిగాయి. గ్రేటర్ పరిధిలో నీటి వినియోగం పెరిగింది. జలమండలి సరఫరా చేస్తున్న 385 గ్యాలన్ల జలాలు నగరంలో పలు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు. ట్యాంకర్ నీళ్లకు డిమాండ్ .. ఈనెల తొలివారం నుంచి ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండడం.. శివార్లలో బోరుబావులు వట్టిపోవడంతో నగరంలో ట్యాంకర్ నీళ్లకు డిమాండ్ పెరిగింది. గత 20 రోజులుగా జలమండలి ట్యాంకర్ నీళ్లు కావాలని 43,343 మంది బుకింగ్ చేసుకోగా.. వీరిలో 41,365 మందికి బుక్ చేసుకున్న రోజునే నీటిని సరఫరా చేసినట్లు సంబంధిత వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మరో 1978 మంది ట్యాంకర్ నీళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. గత 20 రోజులుగా ప్రైవేటు వ్యాపారుల వద్ద సుమారు లక్ష ట్రిప్పుల వరకు (ఐదువేల లీటర్ల సామర్థ్యం గలవి) ట్యాంకర్ నీళ్లు అమ్ముడయినట్లు అంచనా. నీటికి డిమాండ్ పెరుగుతుండడంతో ప్రైవేటు వ్యాపారులు వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రూ.750 నుంచి రూ.1500 వరకు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. జలమండలి ట్యాంకర్ నీళ్లకు రూ.450 కాగా..ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీకి కళ్లెం వేసేవారు లేకపోవడం పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. - పెద్ద సంఖ్యలో వడదెబ్బ బాధితులు ఆస్పత్రుల్లో చేరారు - ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ ప్రచండం - పది గంటల నుంచి రోడ్లు నిర్మానుష్యం - ప్రధాన ప్రాంతాలు సైతం బోసిపోయాయి - డిస్కం చరిత్రలోనే అత్యధికంగా గురువారం - 51 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు తేలింది - వివిధ సంస్థల్లోని కంప్యూటర్ నెట్వర్క్... సాంకేతిక వ్యవస్థలు దెబ్బ తిన్నాయి - నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేకసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం - నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రజలు దాహంతో అల్లాడారు - ఎండ వేడిమికి తట్టుకోలేక పౌల్ట్రీలలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృతిచెందాయి అప్రమత్తంగా ఉండండి మరో మూడు రోజుల పాటు నగరంలో వడగాల్పులుఅధికంగా ఉంటాయి. ఎండ తీవ్రత కూడా తగ్గే అవకాశం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాయువ్య భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలులతోనే పరిస్థితి ఇలా ఉంది. దీంతో నగరంలో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. వచ్చే వారంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. - వై.కె.రెడ్డి,డెరైక్టర్,వాతావరణశాఖ, బేగంపేట్ -
‘మండి’పోతున్న ఢిల్లీవాసులు!
రికార్డు స్థాయి ఎండలు, ఎడతెగని కరెంటు కోతలతో అల్లాడుతున్న పరిస్థితి ప్రభుత్వంపై ఆగ్రహంతో నిరసన ప్రదర్శనలు న్యూఢిల్లీ: దేశ రాజధాని వాసులు ‘మండి’పోతున్నారు. ఓ వైపు రికార్డు స్థాయిలో మండుతున్న ఎండలు.. మరోవైపు గంటల తరబడి విద్యుత్ కోతలు.. ఇంకోవైపు అరకొర తాగునీటి సరఫరా..! ఇవన్నీ ఒకట్రెండు రోజుల నుంచి కాదు.. పక్షం రోజులుగా ఇదే పరిస్థితి. ప్రశ్నిస్తే అధికారుల నుంచీ స్పందన లేదు. దాంతో సహనం సన్నగిల్లిన ఢిల్లీవాసులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ధర్నా లు, రాస్తారోకోలే కాదు.. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి దిగారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సైతం ధర్నా లో పాల్గొని ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల్ని వెతకాల్సిన ఢిల్లీ ప్రభుత్వం గత పాలకులపై విమర్శలతో సరిపెడుతోంది. దేశరాజధాని ఢిల్లీలో 12 గంటలకు పైగా విద్యుత్ కోతలు సాధారణమయ్యాయి. ఓ వైపు రికార్డులు దాటుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు, మరోవైపు కరెంటు కోతలతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విద్యుత్ కోతలు, నీటి సరఫరా లోపాలపై ఆగ్రహంతో వారు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అధికారులను నిర్బంధించడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దాంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఈనెల 10న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమై పరిస్థితిని వివరించారు. నగరంలో 5800 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం 5300 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. విద్యుత్ లోటును భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయితే, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేందుకు మరో 10 రోజలు పడుతుందని ఆ భేటీ అనంతరం నజీబ్ జంగ్ ప్రకటించారు. మరో 10 రోజులు ఇదే పరిస్థితి అనడంతో ప్రజలు నిరసనలను తీవ్రం చేశారు. గాలిదుమారం గందరగోళం సాధారణంగా ఢిల్లీలో రోజుకు 5వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మే 30న వచ్చిన గాలిదుమారం ధాటికి ఢిల్లీ విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలకమైన బవానా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ సామర్థ్యం పూర్తిగా పడిపోయింది. 1,500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంటు నుంచి ప్రస్తుతానికి 290 మెగావాట్లకు మించి ఉత్పత్తి ఉండడం లేదు. కాగా, త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగవచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి.