జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు గుర్తించిన దాని ప్రకారమే.. 28 మండలాల్లోని 238 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఆదిలాబాద్, మంచిర్యాల డివిజన్లు ఉండగా.. ఈ రెండింటి పరిధిలోని 708 హ్యాబిటేషన్లలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఆయా గ్రామాలకు, హ్యాబిటేషన్లకు వాహనాలు, రోడ్డు మార్గం సరిగా లేని చోట ఎడ్లబండ్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంది. 151 హ్యాబిటేషన్లలో ఇలా వాహనాల ద్వారా నీటి సరఫరాతోనే సమస్య పరిష్కరించే వీలుందని అధికారులు గుర్తించారు. దీని కోసం కాంటింజెన్సీ ప్లాన్ కింద రూ.1.43 కోట్లు కేటాయించారు. 59 హ్యాబిటేషన్లలో ప్రైవేటు వ్యక్తుల నీటి పథకాలను అద్దెకు తీసుకుని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది.
ఇలాంటి 62 ప్రైవేటు నీటి పథకాలను ఇప్పటికే గుర్తించారు. దీని కోసం రూ.30లక్షలు కేటాయించారు. 711 బోర్‌వెల్స్‌లో నీరు అడుగంటడంతో వాటిని మరింత లోతుకు తవ్వించాల్సి ఉంది. దీని కోసం రూ.33 లక్షలు కేటాయించారు. 66 బావులు అడుగంటడంతో వాటిలో జలాలు ఊరే వరకు తవ్వించేందుకు రూ.30 లక్షలు కేటాయించారు. కొత్త పథకాల నిర్మాణం కోసం రూ.52 లక్షలు వెచ్చిస్తున్నారు. పలు గ్రామాల్లో సీజనల్ చేతిపంపులు ఇంకిపోతున్నాయి. అసంపూర్తి మంచినీటి పథకాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల నిధులు మంజూరవుతున్నా పనులు గడువులోగా పూర్తి కావడం లేదు.
అధికారుల అవినీతి కారణంగా పలు చోట్ల మంచినీటి పథకాలు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పథకాలు పూర్తయినప్పటికీ పైప్‌లైన్ లేకపోవడం, బోరు వేసినప్పటికీ చేతిపంపు బిగించకపోవడం, కొన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం సమస్యకు కారణంగా నిలుస్తున్నాయి. చేతిపంపుల్లో నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గ్రామాలివే..
ఆదిలాబాద్ మండలంలో 20 గ్రామాలు. జైనూర్‌లో 9, కెరమెరిలో 12, నార్నూర్‌లో 7, సిర్పూర్(యు)లో 11, తిర్యాణిలో 8, కాసిపేటలో ఒకటి, బజార్‌హత్నూర్‌లో 13, బోథ్‌లో 8, ఇచ్చోడలో 17, గుడిహత్నూర్‌లో 8, నేరడిగొండలో 4, ఇంద్రవెల్లిలో 16, జన్నారంలో 11, కడెంలో 8, ఖానాపూర్‌లో 13, ఉట్నూర్‌లో 14, మంచిర్యాలలో 2, భైంసాలో ఒకటి, కుబీర్‌లో 6, కుంటాల, లోకేశ్వరంలో ఒక్కొక్కటి, ముథోలో 15, తానూర్‌లో 9, దిలావర్‌పూర్‌లో 2, మామడలో 8, సారంగపూర్‌లో 13 గ్రామాల్లో నీటి సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం, ప్రైవేటు బోరువెల్స్, బావులు అద్దెకు తీసుకుని గ్రామాల్లో సమస్యను పరిష్కరించాలి.
వేసవి ముందు నీటి సమస్య మొదలైంది
Published Tue, Apr 1 2014 12:48 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement