నీటి కోసం కన్నీరు
అసెంబ్లీలో విలపించిన జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగేగౌడ
తన నియోజకవర్గంలో మంచినీటి పథకాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన
బెంగళూరు : తన నియోజక వర్గ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందంటూ ఓ ఎమ్మెల్యే శాసనసభలోనే కన్నీరు పెట్టుకున్నారు. వివరాలు... శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తాగునీటి పథకాలకు సంబంధించిన అంశాలపై జేడీఎస్ ఎమ్మెల్యే కేఎం శివలింగేగౌడ చర్చను ప్రారంభించారు. తాగునీటి పథకం పూర్తి చేసేందుకు గాను అరసికెరె ప్రాంతంలోని 477 గ్రామాల్లో ఇప్పటికే టెండర్ ప్రక్రియను రెండేళ్ల క్రితమే పూర్తి చేశారని, అయినా ఇప్పటికీ తాగునీటిని అందజేసే పథకాన్ని ప్రారంభించలేదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
ప్రజలకు తాగునీటిని అందజేయడంలో కూడా రాజకీ యాలు చేయడం ఎంత వరకు సమంజసమంటూ ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై కలగజేసుకున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ కొన్ని కారణాల వల్ల సదరు గ్రామాలకు నీటిని అందించలేకపోవడం వాస్తవమేనన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించడమే కాకుండా ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.