సాక్షి, చుంచుపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. కార్మి కులు డిపోల పరిధిలో భారీ ప్రదర్శన, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరగలేదు. అయితే సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో పండగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. జిల్లాలో మూడో రోజు 193 బస్సులను నడిపారు. శని, ఆదివారాల్లో 167 బస్సులు మాత్రమే తిరగగా, సోమవారం మరో 26 బస్సులను పెంచారు. అయినా అవి ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోయాయి. ఎక్కువ మంది ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లోనే వెళ్లాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా 50 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లాలో ఆర్టీసీకి ఈ మూడు రోజుల్లో సుమారు రూ.90 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా.
ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వ పతనం ఆరంభం..
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులతోనే పతనం ప్రారంభం అవుతుందని ఆర్టీసీ జేఏసీ, వివిధ రాజకీయ పక్షాల నాయకులు అన్నారు. సోమవారం ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు వివిధ రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కొత్తగూడెం బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ..సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై వేటు వేయమనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కార్మికులను అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్మికులకు మద్దతు తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్ల కృష్ణ, యెర్రా కామేష్, బీజేపీ జిల్లా నాయకులు కోనేరు చిన్ని, జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగాకిరణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, వై. శ్రీనివాస్‌రెడ్డి, గుత్తుల సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, నాగ సీతారాములు, ఇప్టూ నాయకులు సంజీవ్, సతీష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీవీ.రాజు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రసాద్, జాకబ్, వైఎన్ రావు, సంధోని పాష, చిట్టిబాబు ఉన్నారు.
తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపినా సేవలు అంతంతే..
Published Tue, Oct 8 2019 10:22 AM | Last Updated on Tue, Oct 8 2019 10:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment