బీ కొత్తూరు వద్ద మందుపాతరను నిర్విర్యం చేస్తున్న దృశ్యం
చర్ల: పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను గుర్తించిన పోలీసులు శుక్రవారం దాన్ని నిర్విర్యం చేశారు. దీంతో పోలీసు బలగాలకు పెనుప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు–పెదమిడిసిలేరు ప్రధాన రహదారిపై బీ కొత్తూరు వద్ద వంతెనకు సమీపాన మావోయిస్టులు 30 కిలోల మందుపాతర ఏర్పాటు చేశారు.
ఈ రహదారి మీదుగా సరిహద్దు అటవీప్రాంతానికి నిత్యం బలగాలు కూంబింగ్‌కు వెళ్లివస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెళ్లే పోలీసులను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చగా, తనిఖీల్లో భాగంగా గురువారం ఉదయం గుర్తించారు. ఓ పక్క పోలింగ్ జరుగుతున్నందున దాన్ని నిర్వీర్యం చేస్తే వచ్చే శబ్దంతో ఓటర్లు భయబ్రాంతులవుతారని భావించిన పోలీసులు మందుపాతరకు ఉన్న ఎలక్ట్రిక్ వైర్లు తొలగించారు.
శుక్రవారం ఉదయం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆధ్వర్యాన నిర్వీర్యం చేశారు. కాగా, ఈ మందుపాతరను మావోలు పేల్చినట్లయితే బస్సు లేదా లారీ వంటి భారీ వాహనం కనీసం 20 నుంచి 30 అడుగుల మేర ఎత్తు ఎగిరిపడి తునాతునకలయ్యేదని చెబుతున్నారు. మరోపక్క ఈ మార్గంలో ఇంకా మందుపాతరలు ఉండొచ్చనే భావించిన పోలీసులు నిశితంగా తనిఖీలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment